Thursday, October 1, 2009

జీవుని పరిపూర్ణత


జీవుడు దైవము చేరుటకు ప్రథానమైన అవరోథములలో స్వభావము ఒకటి. స్వభావము అనగా జీవుని ఆలోచనా సమూహము నుండి పుట్టిన ప్రవర్తన. స్వభావముననుసరించియే మనుష్యుల అనుభూతులు వేరు వేరుగా వుండును. ఒక సంఘటన యందు వున్నవారందరికి ఒకే అనుభూతి వుండదు. వారి వారి ప్రకృతి స్వభావముబట్టి వారి అనుభూతి వుంటుంది. కొందరికి ఆనందాన్ని ఇచ్చినది కొందరికి ఇవ్వక పోవచ్చును. అప్పుడు మనకు సహజముగా కొన్ని ప్రశ్నలు కలుగుతాయి. "భగవంతుడు ఎందుకిలా వేరు వేరు స్వభావములను సృష్టించాడు? అందరిని సమానముగా ఎందుకు చేయలేదు? అసమానతలు ఎందుకు? దోషము మనలో లేదుదైవము నందే వుంది... మొదలైనవి.

దైవము మానవుని తన వలే తనంతటి వానిగా సృష్టించాడు. God made Man in his own image and likeness అని అంటారు కదా! తనలో వున్నవన్నీమానవ శరీర నిర్మాణములో వుండేటట్లు తయారు చేశాడు. అపారమైన ప్రేమ, కరుణ కలిగి వుండుట చేత మానవుని తనంతటి వానిగా నిలిపాడు. ప్రకృతి లోని సమస్తముకూడా మానవుని యందు దర్శనము చేయవచ్చును. "జీవో దేవ సనాతనః" దేవుడు ఎప్పడి వాడో జీవుడు కూడా అప్పటి వాడే. మానవుని విషయానికొచ్చే సరికిదైవము మానవునికి పూర్తి స్వేశ్చతో కూడిన బుద్దిని ప్రసాదించాడు. రాజు సామ్రాజ్యము నందు రాజకుమారునికి ఎలాంటి స్వేశ్చ వుంటుందో అలాంటి స్వేశ్చను దైవముమానవునికి ఇచ్చాడు. దానితో పాటు విచక్షణతో కూడిన బుద్దిని కూడా అందించాడు. విచక్షణ బుద్దితో స్వేశ్చగా తన సామ్రాజ్యమునందు ఆనందమయ జీవనముగడపమని సమస్తమును తనయందే దర్శించమని మానవుని దైవము సృష్టించాడు.

అందింపబడిన స్వేశ్చను మానవుడు తన ఇష్టానుసారముగా రకరకములుగా వుపయోగించటము జరిగింది. ఎందుకిలా అని మరియొక ప్రశ్న కలగవచ్చు. దానికిసమాథానముగా అసలు సృష్టి ఎందుకు ఏర్పడింది అని ఆలోచిస్తే .. జీవుల పరిపూర్ణత కొరకు వారికి సృష్టి అందివ్వబడినది అని తెలుస్తుంది. వారియందు వున్నఅసంపూర్ణతను పూర్తి చేసికొనుటకు పరితపిస్తున్న జీవుల వల్ల దైవమునకు కలిగిన సంకల్పమును ఆథారముగా చేసికొని ఏర్పడిన ప్రకృతి నుండి సృష్టి ఏర్పడింది. ప్రతిసృష్టికి కూడా కాల పరిమితి వుంటుంది. ఇచ్చిన కాల పరిమితిలో కొందరు పరిపూర్ణతను పొందగా, మిగిలిన పరిపూర్ణత పొందని జీవుల కోసము మళ్ళీ సృష్టి మొదలుఅవుతుంది. దానికోసమే జీవులు మరల మరల జన్మించటము జరుగుతుంది. ఎవరికి దేనియందు పరిపూర్ణత కలగలేదో వారు దానికోసము ఆరాటపడటముజరుగుతుంది. పరిపూర్ణత కలిగిన దానియందు జీవుడు సంతుష్టి చెందినవాడై దాని యందు ఆరాటము చెందడు. అసంపూర్ణతే జన్మలకు కారణము అవుతుంది. అలాఅసంపూర్ణముగా మిగిలివున్న వాటితోనే ప్రళయమునందు జీవుడు మహా చైతన్యము నందు ఐక్యము చెందుతాడు. అప్పుడు ప్రతివానికీ వాని వాని సొంత ప్రణాళికలువుంటాయి. తిరిగి జన్మించి వాటిని పూర్తిచేసుకొనుటకు ప్రయత్నము కొనసాగించును. పూర్తి అయిన వాటి వంక చూడక పూర్తి కాని వాని వెనక పరిగెత్తి ప్రయత్నముచేయును. అలా ప్రయత్నము చేసి చేసి వాటి యందు పూర్ణమైన ఆనందము లేదనియు, అవి అన్నియు కూడా పరిథులు కలవనియు, అపరిమితము కాదనియుతెలుసుకొనును. అప్పుడు అపరిమితమైన దానికొకకు ప్రయత్నము మొదలు పెట్టును. కనుకనే భగవద్గీత యందు "ఎవరు దేనిని పొందుటకు ప్రతయ్నము చేసినా అదినన్ను పొందుటకు చేయు ప్రయత్నమే" అని భగవానుడు చెప్పి యున్నాడు. ఇతర వాజ్ఞ్మయములందు కూడా ఇలా చెప్పియుండలేదు. "నన్ను" అనగా సమస్తమునందు వ్యాపించి వున్న "నేను" అను ప్రజ్ఞ. అది అపరిమితమైనది. అవథులు లేనిది. అంతటా వ్యాపించి వున్నది. ఎవరు దేని కొరకు ఆరాటపడినా అది వారియందువున్న అసంపూర్ణతను పూర్తి చేసుకొనుటకే. అది పూర్తి అయిన పిదప సంతుష్టి చెంది ఇంకొక దానికొరకు ప్రయత్నము చేయును. చివరకు విసిగి తను ఆరాటపడినది ఏదీకూడా తను ఆనందమును ఇవ్వలేదు అని తెలిసికొని అసలు "తనెవరు" అని అన్వేషణ ప్రారంభించును. అది అతడు తిరిగి దైవము చేరు ప్రయత్నమునకు మొదటిమెట్టు.

దైవము చేరు ప్రయత్నము చేయువారు ఇతరులను చూచి వారు పాపాత్ములు, తెలియని వారు అని నిందించ కూడదు. అలా చేసే వారు అజ్ఞానాంథకారములో వున్నట్లే.తెలుసనుకొనుట వారి భ్రమ. ప్రతి ఒక్కరి ప్రయత్నము దైవము చేరుటయే. అందుకు దైవ సహాయము ఎప్పుడూ వుంటుంది. పరిపూర్ణత పొందుటయే జీవుని ప్రథమకర్తవ్యము. దానికొరకే ప్రతివాని ఆరాటము. అది తెలియక ఇంకొకరు చేసేదానిని విమర్శిస్తూ జీవితమును వృథా చేసుకొంటాము. అలా కాక అందరూ కూడా తమ తమఅసంపూర్ణతను పూర్తి చేసుకొనుటకు ప్రయత్నిస్తున్నారు అని తెలిసికొని చేతనైతే మన సహాయము కూడా అందించి వారిని పరిపూర్ణులను చేయుటకు ప్రయత్నిద్దాం.