Friday, February 24, 2012

సద్గురువు


నీవెవరో గుర్తు చేసేవాడు గురువు.

జ్ఞానమును బోధించేవాడు గురువు.

దైవము వైపు నడిపించేవాడు గురువు.

సమర్పణ చెందినవాని సమస్త భారము వహించువాడు గురువు.

అరిషడ్వర్గములనుండి కాపాడువాడు గురువు.

అమృతత్వమును ప్రసాదించువాడు గురువు.

తాను బ్రహ్మమై శిష్యునికి బ్రహ్మత్వము అనుగ్రహించేవాడు గురువు.

జన్మ జన్మలకు వదలక ఉండేవాడు గురువు.

కరుడుకట్టిన కర్మను కరుణతో కరగించువాడు గురువు.

సత్యదర్శనము చేయుంచువాడు గురువు.

అంధకారములో వెలుగై దారి చూపువాడు గురువు.

జీవుల శ్రేయస్సు కాంక్షించువాడు గురువు.

శిక్షణ, రక్షణ అందించేవాడు గురువు.

దేవునికి జీవునికి అనుసంధానము కలిగించువాడు గురువు.

భక్తి, జ్ఞాన వైరాగ్యములను మేల్కొలుపువాడు గురువు.

భోధ చేసి బాధ తీర్చేవాడు గురువు.

సమస్త జగత్తు వ్యాపించినవాడు గురువు.

త్రిగుణములకు అతీతుడు గురువు.

అజ్ఞానమును పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలుగించువాడు గురువు.

దేవతలందరూ వశమైవుండువాడు గురువు.

సమస్త అరిష్టములను నాశనము చేయువాడు గురువు.

మంత్ర ఛేదనము చేయగలవాడు గురువు.

త్రిలోకములను వశము చేసుకొన్నవాడు గురువు.

త్రిమూర్తి స్వరూపుడు గురువు.

ఆత్మ దర్శనము చేయించగలవాడు గురువు.

ప్రజ్ఞాప్రాణములను స్థిరపరచువాడు గురువు.

మనిషిని మహాత్మునిగా మలచువాడు గురువు.

Friday, February 17, 2012

సృష్టిలో దైవము ఎలా ఉన్నాడు? గుర్తించటము ఎలా?

సృష్టిలో దైవము ఎలా ఉన్నాడు? గుర్తించటము ఎలా? అన్న ప్రశ్న మామూలుగా దైవము ఎడల భక్తో, భయమో ఉన్న వారికి సహజముగా కలుగుతూ ఉంటుంది. అసలు దైవము ఉన్నాడా అనే ప్రశ్న అనాదిగా తర్కించుకుంటునే ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం. ఎప్పుడైనా ఎవరికైనా అసలు లేని దాని గురించి ప్రశ్నంచటానికి గాని, ఆలోచించటానికి గాని వీలు ఉంటుందా? ఒకవేళ అలావుంటే అవి ఏమిటి? ఎదైనా ఒక విషయము మనకి తెలియనంత మాత్రాన అది లేనట్లేనా? కనీసము ప్రశ్న రూపములోనైనా ఉన్నదన్న విషయాన్ని గుర్తించాలి. కనుక దైవము ఉన్నాడా లేడా అంటే ప్రశ్న రూపములో నైనా ఉన్నాడు అని తెలుసుకోవాలి. లేనిదేదీ మనిషికి తట్టటానికి అవకాశములేదు. సరే ఉంటే ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు?

తనలో తాను లీనమైవున్న విశ్వాత్మక చైతన్యము నందు కలిగిన సంకల్పముచేత వేరుగా ఏర్పడిన ప్రకృతి, కాలములకు ఆథారమైనవాడు దైవము. దానికి ఆకారము లేదు. పేరు లేదు. కనుక వేదములయందు దానిని "తత్" అనగా "అది" అన్నారు. ప్రకృతి నుండి త్రిగుణములు, వాటినుండి సమస్త సృష్టి ఏర్పడినట్లు భాగవతము చెపుతుంది. చైతన్యమే వేరుపడిన ప్రకృతియందు మరియి ప్రకృతికి అవతల కూడా ఉన్నది. అది ప్రకృతిలో ఉన్ననూ ప్రకృతిపై ఆథారపడదు. ప్రకృతికి ఆథారమై ఉంటుంది. దానిని మనచుట్టు అంతటా వ్యాపించి ఉన్న "చోటు"గా గుర్తిద్దాం. "చోటు"ను ఆంగ్లములో space అంటారు. సృష్టి సంకల్పము కలుగుట చేత, చోటు కొంత వేరుపడి ఒక గ్రుడ్డుగా ఏర్పడినది. దానిని చోటు గ్రుడ్డు (space egg) గా చెప్పబడెను. అది బంగారు రంగుతో వెలుగుచుండుటచేత దానిని "హిరణ్మయ అండము" అని పెద్దలచే చెప్పబడినది. కోటానుకోట్ల సూర్యమండలములకు కావలసిన విత్తనములన్నియు (star dust) దానియందు నిండి యుండెను. కాలక్రమమున అవిఅన్నియు అనేకమైన సూర్యమండలములుగా ఏర్పడి, ప్రతి ఒక్క సూర్యమండలములో దానికి కావలసిన అన్ని గ్రహసముదాయములు ఏర్పడెను. చోటు గ్రుడ్డు, చోటులో భాగమే కనుక రెండిటిలో వున్నది ఒక్కటియే. ఒకే చైతన్యము బయట, లోపలా కూడా వున్నది. గ్రుడ్డులోపల మేల్కాంచిన స్థితిలో వుండగా బయట మేల్కాంచక వున్నది. అంటే బయట వున్నదానికి Existance మాత్రమే వున్నది. కానీ గ్రుడ్డులో Existance మరియు awareness కూడా వున్నది. Awareness అనగా వున్నట్లు తెలియుట. ఉదాహరణకు నిద్రలో మనము ఉంటాము కానీ ఉన్నట్లు తెలియదు. మెలకువ వచ్చిన తరువాతనే ఉన్నట్లు తెలుస్తుంది. అలాంటి స్థితి అన్నమాట. చోటులో మనస్సు ఉన్నది. చోటులో ఏర్పడిన ప్రతి అణువు యందు మనస్సు ఉన్నది.

చోటులో ఏమున్నదో, చోటు గ్రుడ్డులోనూ అదే ఉన్నది కనుక దానియందలి ప్రకృతి ద్వారా ఏర్పడిన ప్రతిదానియందు కూడా అదే చైతన్యము నిండి వున్నది. కానీ దానిచుట్టు ప్రకృతి ఆవరించి ఉన్నది. ప్రకృతిచే ఆవరింపబడిననూ అది ప్రకృతిచే అంటబడదు. ప్రకృతికి సంబందించిన మలినములు దానిని అంటవు. విధ్యుత్చే నడపబడుతున్న పరికరము విధ్యుత్ను ఎలా నియత్రించలేదో అలాగే ప్రకృతి దానికి ఆథారమైన చైతన్యమును నియంత్రించలేదు. అణువు నుండి బహ్మాండము వరకు కూడా అదే చైతన్యము వేరువేరు స్థితులలో నిండి ఉన్నది. కొన్నిటియందు నిద్రాణమైన స్థితిలో, కొన్నిటియందు కొంత మేల్కాంచి ఉంటుంది. కానీ మానవునిలో పూర్తిగా మేల్కాంచి ఉన్నది. ఒక్క మానవునికి మాత్రమే తాను ఉన్నాను అని తెలిసిన స్థితి. జంతువులకు అవి ఉన్నట్లు తెలియదు. ఎదుటి జంతువు తెలుస్తుంది.

మనిషిలో ఎలా ఉన్నాడు? అది తెలియాలంటే మానవ శరీర నిర్మాణము తెలియాలి. భౌతిక శరీరము, ప్రాణశక్తి, ప్రజ్ఞ (మనస్సు), బుద్ది, పురుషుడు (ఆత్మ లేక తాను), పరపురుషుడు మరియు పరమపురుషుడు అనే 7 పొరలతో ఉన్న మానవ శరీర నిర్మాణము తెలియనిదే దైవము యొక్క అస్థిత్వము తెలియదు.

పరమపురుషుడు --> తనకుతానుగా ఉండే స్థితి (Maha Para Nirvanic Plane)

పరపురుషుడు --> యజ్ఞార్థ జీవన స్థితి (Para Nirvanic Plane) కేవలము మంచి సంస్కారములు మాత్రమే ఉన్న స్థితి.

పురుషుడు --> ఆత్మ స్థితి (Nirvanic Plane) మంచి, చెడుల పూర్వ సంస్కారములన్ని కలసి ఉన్న స్థితి.

బుద్ది --> యుక్తాయుక్త పరిజ్ఞానము (Buddic Plane - Creative will) Higher Mind

మనస్సు --> ప్రజ్ఞ - ఇంద్రియములను నడిపించునది (Mental Plane)

ప్రాణశక్తి --> ప్రాణమయ శరీరము (Vital Plane)

ద్రవ్యము --> భౌతిక శరీరము (Physcial Plane)

పైమూడు ఆత్మస్థితి యందలి పొరలు. క్రింది నాలుగు భౌతిక స్థితియందలి పొరలు. అంతటా నిండి ఉన్న చైతన్యము ఎప్పుడూ ఒకే స్థితియందు ఉంటుంది. అది తనకు తానుగా ఉండే స్థితి. కానీ దానిని ఆథారము చేసుకొని వేరుగా ఉన్న ప్రకృతిద్వారా పుట్టిన జీవరాశులు, వేరుబడిన స్థితిలో ఉండుట చేత ప్రత్యగాత్మలై తాము వేరుగా ఉన్నట్లుగా భావిస్తాయి. అలా భావించటమునే అహంకారము అని అంటారు. అహంకారము అంటే తాను ఉన్నట్లు భావించుట. నిజమునకు తాను వేరుగా లేడు. ఉన్నది విశ్వాత్మకమైన చైతన్యమే తానుగా ఉన్నది. ప్రకృతి గుణముల ద్వారా దిగివచ్చిన చైతన్యము మేల్కాంచి గుణముల సాంగత్యము వలన అహంకార పురుషుడుగా ప్రవర్తిస్తాడు. అప్పుడు అతని అస్థిత్వానికి ఆథారమైన పరమ పురుషుడు అతని యందు సాక్షీభూతుడుగా ఉంటాడు. ఇద్దరూ కూడా "నేను" అనే పిలువబడుతున్నారు. స్థితులు వేరు. ఒకడు చస్తూ పుడుతున్నాడు, ఇంకొకడు చావు పుట్టుకలకు అతీతుడై ఉన్నాడు. ఎవరైతే బుద్దిమయ లోకాన్ని దాటి ఆత్మ స్థితియందు స్థిరపడతాడో వానికి జన్మలు ఉండవు. అంటే వాడు వాడిగానే ఉంటాడు, శరీరములు వచ్చిపోతూ ఉంటాయి. ఎలా తాను శరీరాన్ని ధరిస్తున్నాడో, త్యజిస్తున్నాడో తెలిసి ఉంటాడు. పరమపురుష స్థితికి చేరిన వాడు పరమాత్మ యందు లీనమైనవాడు. అనగా మోక్షస్థితిని పొందినవాడు.

నేను, నాది. ఇక్కడ ఇద్దరు వున్నారు. ఒకరు నేను, ఇంకొకరు నేను కన్నా వేరుగా వున్నవాడు. నేను అన్నవాడు అందరిలో అంతటా వున్నవాడు. అంతటా వ్యాపించి వున్నవాడిని అంతర్యామి అంటారు. వ్యాపించివున్నవాడిని సంస్కృతములో "విష్ణువు" అంటారు. "విష్ణుః" అన్నదానికి వ్యాపించుట అని అర్థము. అతడే పరమపురుషుడు. సర్వాంతర్యామి. జీవుడు ఆచరిస్తున్న సమస్త కర్మలు అంటకుండా అతీతుడై తనకు తానుగా ఉన్నవాడు. ప్రకృతియందలి ప్రతి అణువునందు ఉన్నాడు. సమస్తము అణువుల సమాహారమే. ఎన్ని నగలు ఉన్ననూ అందున్నది బంగారమే కదా! ఒక్కొక్క నగకు ఒక్కొక్క పేరు, అకారము ఎలావున్నాయో అలాగే ఒకేఒక చైతన్యము ఇన్నిరకములుగా వర్తిస్తున్నది.

ఇతరులను చూసినప్పుడు గుణముల ద్వారా ప్రవర్తిస్తున్న వాడిని చూడకుండా ఎవని ఆథారముగా వాడు ఉన్నాడో వానిని దర్శించినచో సర్వాంతర్యామి సాథన కొనసాగును. శబ్ద, స్పర్శ, రూప, రస గంథాలకు ఆథారమైన వానిని గ్రహించాలి. జ్ఞానేంద్రియముల ద్వారా ప్రపంచమును గమనిస్తున్న వానిని దర్శించుటకు ప్రయత్నము చేయవలెను. చూస్తున్న వానిలో చూసేవాడు ఎవరు? ఎలా చూడగలుగుతున్నాడు? అసలు చూడటము అంటే ఏమిటి? అన్న ప్రశ్నలు కలిగి అన్నికి ఆథారమైన శుద్ద చైతన్యాన్ని దర్శించగలగాలి. మొదట తనయందు దర్శించి తరువాత వానిని అందరియందూ దర్శించి సాథన చేయవలెను. ఒకేఒక చైతన్యము అనేకవిథములుగా ప్రవర్తిస్తున్నదని గ్రహించవలెను. ఆవిథముగా దర్శించినవానికి సృష్టిలో దైవము ఏవిథముగా ఉన్నాడో తెలుస్తుంది.