Tuesday, April 17, 2012

దేహమునందలి పంచభూతముల పవిత్రీకరణ.


మానవ దేహము పంచభూతములతో చేయబడినది. అన్ని వేళళా దానిని పవిత్రముగా ఉంచుకొనవలెను. పవిత్రమైన దేహము స్వచ్ఛమైన జీవితమునకు వాహికయై ఉంటుంది. వాహనము సరిగా ఉన్నప్పుడే ప్రయాణము సాఫీగా సాగుతుంది. జీవుని ఉన్నతికి మంచి దేహము అవసరము. తరచూ అనారోగ్యమును అనుభవించే దేహము జీవునికి ఆత్మానుభూతిని అందివ్వదు. మంచి పనికి మంచి దేహము అవసరము. అది అనేక మంచి పనులను చేయించును. దేహము జీవుని ప్రయాణమునకు ఆటంకము కారాదు. అందుకు దేహమును శ్రద్దగా ఆరోగ్యముగా ఉంచుకొనవలెను. దినచర్యలో ప్రతిఒక్కరు తప్పక ఆచరించవలసిన విథులలో ఇది ఒకటి. దేహములోని పంచభూతములను ఎలా పవిత్రీకరించుకొనవలేనో చూద్దాం....

"పృధివాపస్తేజోవాయురాకాశము"లను పంచభూతములు అంటారు. పృథివి = భూతత్వము, ఆపస్సు = నీరు, తేజస్సు = అగ్ని లేక వేడిమి, వాయువు = గాలి మరియు ఆకాశము.

పృథివీ తత్వము: శరీరములోని ద్రవ్యము పృథివీ తత్వము నుండి వచ్చినది. శరీరమునకు అందించే ఆహారము కూడా భూమి నుండి వచ్చినదే. మనము తినే ఆహారము వల్లనే శరీరములోని ధాతువుల యొక్క నాణ్యత పెరుగుతుంది. శక్తిని, పుష్టిని పెంచేటటువంటి ఆహారమును మాత్రమే స్వీకరించవలెను. అతిగా తినుట వలన తమస్సు పెరిగి అనారోగ్యము కలుగుటకు అవకాశము కలదు. శరీర ధాతువులు యొక్క నాణ్యత పెరుటకు, ఆరోగ్యమును పోందుటకు, శక్తిని పొందుటకు, ఉత్సాహముగా ఉండుటకు సరియైన ఆహారము, సరియైన సమయములో, సరియైన చోట, తగినంత ఆహారమును మంచి మనస్సుతో స్వీకరించవలెను. కూరగాయలు, పళ్ళరసములు, పళ్ళు, ఆకుకూరలు, పప్పు ధాన్యములు మొదలగునవి మంచి ఆహారము. మొలకెత్తిన ధాన్యములు శరీరమునకు కావలసిన మంచి శక్తిని, పోషణను అందిస్తాయి. ఆహారమునందు శ్రద్ద ఉన్నచో అది శరీరమును పవిత్రీకరించును. ఆహారముద్వారా శరీరమును పవిత్రీకరించుట సనాతనమైన విథానము. సరియైన మంచి దృక్పథముతో ఆహారమును స్వీకరించి సాథకుడు శరీరమును పవిత్రీకరించుకొనును. జ్ఞానేంద్రియము వాసన, కర్మేద్రియము ముక్కు.

నీటి తత్వము: నీరు మనుష్యులను, దేవతలను కూడా పవిత్రీకరించును. శరీరమును లోపల, బయట శుభ్రపరచుటకు తగినంత నీటిని ఉపయోగించవలెను. 2 లేక 3 లీటర్ల నీరు త్రాగుటకు, 20 నుండి 30 లీటర్ల నీరు స్నానమునకు (రోజుకు రెండు సార్లు) ఉపయోగించవలెను. రక్తము, జీర్ణావయములు, మూత్రావయవములు, కిడ్నీలు మొదలగునవి నీటివల్ల పరిశుభ్రము చెందుతాయి. మలబద్దము మొదలైనవి తగ్గుతాయి. స్నానపానాదుల యెడల సరియైన అవగాహన కలిగి ఉండవలెను. దీనివలన శరీరములోని ద్రవపదార్థము అంటే రక్తము, నీరు మొదలుగునవి శుద్దిచేయబడతాయి. కనుక సాథకుడు స్వచ్ఛమైన, తగినంత నీటి ద్వారా మంచి ఆరోగ్యమును పొంది తనలోని ఆవేశములకు సంబందించిన నీటి తత్వమును పరిశుద్ది చేసుకొనును. జ్ఞానేంద్రియము రుచి, కర్మేద్రియము నాలుక.

అగ్ని తత్వము: ప్రతిరోజూ సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో 60 నుండి 90 నిమిషాలపాటు శరీరమునకు సూర్యరశ్మి సోకునట్లు ఉండవలెను. సమయములో వచ్చు సూర్యకిరణములు శరీరమునకు కావలసిన వేడిని, ఉష్ణోగ్రతను ఇచ్చును. మనము నివసించు గదులలో కావలసినంత వెలుతురు వచ్చునట్లు ఏర్పాటు చేసుకొనవలెను. చీకటి గదులలో, విధ్యుత్ దీపముల మధ్య ఎక్కువకాలము ఉండు వారి శరీర ఉష్ణోగ్రతలలో మార్పు వచ్చును. ఉష్ణోగ్రత నియంత్రించిన (air-conditioning) గదులలో ఎక్కువగా ఉన్నచో కూడా శరీర ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు ఉండుటచే అది శరీర ఆరోగ్యమునకు హానిచేయును. అగ్నితత్వము శరీరమునందలి వేడిని నియమించుటకు, శరీరమును ఋతువులననుసరించి సూర్యరశ్మి తగులునట్లు చేయవలెను. ఉచ్ఛ్వాస, నిశ్వాసములచే జనించిన అగ్ని శరీరమునకు ప్రాణశక్తిని అందించును. దీనిని పెంపొందించుటకు ఉభయ సంధ్యలలో సూర్యరశ్మి సోకునట్లు వ్యాయమము చేయవలెను. ప్రాణాగ్ని పెంపొందుటవలన అది శరీరమును అనారోగ్యములనుండి కాపాడును. దానివలన సాథకుడు ఎల్లవేళళా అప్రమత్తుడై, ఉత్సాహము, చురుకుదనము కలిగి ఉండును. జ్ఞానేంద్రియము రూపము, కర్మేద్రియము కన్ను.

వాయు తత్వము: ఐదు రకములైన ప్రాణముల ద్వారా వాయువు శరీరము నందు పనిచేస్తుంది. ప్రాణ, అపాన, వ్యానము, ఉదానము, సమానము అను పంచ ప్రాణములు శరీరము నందు సంచారము చేస్తూ ఉంటాయి. ప్రాణాయామము ద్వారా శరీరమునందలి వాయువును పరిశుద్ది చేసుకొనవలెను. సాథారణముగా మనము ఎక్కువ ఉపిరి పీల్చము. మన ఊపిరితిత్తులకు ఉన్న పూర్తి సామర్థ్యమును ఉపయోగించుకొనము. మనకు కేవలము 4 వంతు మాత్రమే మన ఊపిరితుత్తులను ఉపయోగించుకొంటున్నాము. ఉచ్ఛ్వాస సరిగా లేనప్పుడు నిశ్వాస కూడా సరిగా ఉండదు. మనము ఎక్కువగాలిని పీల్చినప్పుడు కావల్సినంత ప్రాణశక్తి అందింపబడి మనలోని మాలిన్యములను నిశ్వాసద్వారా బయటకు నెట్టగలదు. ప్రాణాయమము వలన చక్కని ప్రాణశక్తి ప్రసారము జరుగును. సరియైన ప్రాణప్రసారము లేకపోవుటవలన శరీరమునకు రకరకములైన జబ్బులు వచ్చుటకు అవకాశము కలదు. నెమ్మదిగా, మృదువుగా, సాథ్యమైనంత సేపు, సమాన వేగముతో ప్రతి ఉదయము 24 నిమిషములు చేయు ప్రాణాయామము శరీరముము పరిశుద్దిగావించును. నోటి దుర్వాసన, నాసిక యందు దుర్వాసన మొదలగునవి అనారోగ్య సూచనలు. దుర్వాసనలు లేనిచో శరీరమునందలి వాయువు పరిశుద్దిగావింపబదినది అని అర్థము. శరీరమునందలి అగ్ని, వాయుతత్వము కలసి పనిచేయును కనుక ప్రాణాయామము వలన అగ్నిని కూడా పరిశుద్ది చేసుకొనవచ్చును. జ్ఞానేంద్రియము స్పర్శ, కర్మేంద్రియము చర్మము.

ఆకాశ తత్వము: మనలోని శబ్దము ఆకాశ తత్వమును చూసించును. సరియైన ఆలోచన, సద్భాషణములతో నిర్మలమైన నీలాకాశము వలే మనలోని ఆకాశతత్వమును పరిశుద్ది చేసుకొనవచ్చును. మన మాట మన ప్రకాశమును తెలియచేస్తుంది. సాధారణముగా ధ్వని వేరు, శబ్దము వేరు. శబ్దమునకు ఒక పుట్టుక స్థానము కలిగి అది తరంగములుగ ప్రయాణిస్తుంది. కానీ, ధ్వని అనేక శబ్ద తరంగములు కలిసి ఉంటుంది. పదిమంది ఒకచోట చేరి అందరూ ఒకేసారి మాట్లాడుతూ ఉంటే అప్పుడు పుట్టేది ద్వని. భరించుట కష్టము. కానీ ఒకరే మాట్లాడుతూ ఉంటే అది అతని ద్వారా వచ్చే శబ్దతరంగాలు. శబ్దము వల్ల జ్ఞానము, ధ్వని వల్ల అజ్ఞానము పెరుగుటకు అవకాశము కలదు. ఆధ్యాత్మిక సాథకుడు తన నాలుకను చక్కని శబ్దములను ఉచ్చరించుటకు వాడవలేను. మంచి ఆలోచనల వలన మంచి మాటలు, మంచి మాటలు మాట్లాడుట వలన మంచి ఆలోచనలు కలుగుతాయి. వేదపారాయణ, మంత్రోచ్ఛారణము, ఓంకారమును ఉచ్చరించుటవలన మనోమయలోకము పరిశుద్ది చెంది చక్కని ఆలోచనలు కలుగుటకు అవకాశము ఉంటుంది. దివ్యప్రణాళిక అందింపబడి ఆచరించుటకు వీలుకలుగును. సరియైన ఉచ్చారణతో కూడిన త్రికరణశుద్ది వలన సూక్ష్మశరీరము లేక దివ్యదేహము లేక ఆకాశ శరీరము ఏర్పడును. దీని వలన స్థూలదేహము వదిలిననూ జీవించి ఉండుట తెలియును. సాథకుడు నిరంతర ప్రజ్ఞానుభూతి కలిగివుండగలడు. జ్ఞానేంద్రియము శబ్దము, కర్మేంద్రియము చెవి.

మనస్సు: ఒక్క సత్యభాషణము వలనే మనస్సు పరిశుద్దమవుతుంది. అదియే నిజమైన సమర్పణము. దీని వలన మనిషి నిజమైన ఆనందమును పొందగలడు. సత్యమును మించిన ధర్మము లేదు. సత్యధర్మమును పాటించువానికి అభివృద్దే కాని, ఆటంకములు లేవు. దైవము యొక్క కృపను పరిపూర్ణముగా పొందగలడు. మహాభారతమున ధర్మజుని సత్యపాలనము అదియే తెలియచేస్తుంది. మాయ అంటదు. స్వార్థము దరిచేరదు. సాథకుడు మనస్సు, బుద్ది పరిశుద్దమై దైవము యొక్క వాహిక కాగలడు.

విథముగా ఆథ్యాత్మిక సాథకుడు తనలోని పంచభూతములను, మనస్సును పవిత్రీకరించుకొనవలెను.

Courtesy : Master K.P.K