Monday, November 23, 2009

మాట ఎలా వుండాలి...

"అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం యత్ | స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ||" అని భగవానుచే భగవద్గీత యందు చెప్పబడి యున్నది. అనగాఇతరులకు బాధ కలిగించకుండా సత్యము, ప్రియము, హితము అయిన సంభాషణ సాగించటం, వేదాధ్యయనం చేయడం వాక్కుకు సంబందించిన తపస్సు అంటారు. ఇంకొకరితో తనభావములను వ్యాక్త పరుచుటకు వాక్కే ప్రధానమైనది. మాట అవసరమైనంత వరకే మాట్లాడాలి. అనవసర ప్రసంగము చేయరాదు. రాత్రి పడుకోబోయేముందు రోజు ఏమేమిమాట్లాడాము అని ఆలోచిస్తే చాలా సార్లు ఎక్కువ శాతము అవసరానికి మించి మాట్లాడినట్లు తెలుస్తుంది. కావున మాటయందు పొదుపు ఎంతో అవసరము. సమయము దొరికితేఎదో ఒక అవసరము లేని విషయము మీద విపరీతముగా తర్కములు, వితండవాదములు చేస్తూవుంటాము. ధనమును ఎలా పొదుపుచేయాలా అని ఆలోచిస్తాము, కానీ దానికన్నవిలువైన మాటను పొదుపు చేయము. ఆలోచించి అవసరము అయినంతవరకే మాట్లాడవలెను. అది కూడా ఎలా వుండాలంటే......
"సత్యం బ్రుయాత్, ప్రియం బ్రుయాత్, నబ్రుయాత్ సత్య మప్రియం" అని వేద వాక్యము. అనగా సత్యమునే పలుకవలెను. అది ప్రియముగా పలుకవలెను. సత్యమును అప్రియముగా పలుకరాదు. ఇది మొదటగా ఆచరించవలసినది. అలా మాట్లాడుటకు చాలా సాథన, నైపుణ్యత అవసరము. మాట్లాడునది సత్యమే ఐననూ అది ఇతరులను బాధపెట్టకూడదు. అసలుబాధ పెట్టే గుణము సత్యమునకు లేదు. సాధారణముగా మనము ఇది సత్యము అని చెప్పునడు అందు మన అభిప్రాయము కూడా కలిసి వుంటుంది. అది మొత్తము సత్యముఅవనవసరములేదు. కానీ మన అభిప్రాయము కూడా వుండుటవలన అది సత్యము అని నమ్మివుంటాము. అటువంటి దానిని ఇతరులకు చెప్పునపుడు అది ఎంతో రమ్యముగావారికి బాధను కలిగించకుండా చెప్పవలెను. అది సత్యమైనంత మాత్రమున కుండ బద్దలు కొట్టినట్లు చెప్పకూడదు.
కొందరు మాట్లాడేది సత్య భాషణమే ఐననూ వారికి చాలా కోపము, అసహనము కలిగిస్తుంది. అది ఎలా సాథ్యము? మాట్లాడేది సత్యమైతే కోపము, విసుగు, అసహనము ఎందుకుకలుగుతాయి? ఎప్పుడైనా అలాంటివి ఎవరికైనా కలుగుతుంటే అది వారి అభిప్రాయము మాత్రమే కానీ అందు సత్యము లేదు అని గహించాలి. అభిప్రాయము అనేది వ్యక్తి యొక్క స్వభావము నుండి అతడు గ్రహించినది. అది సత్యము కంటే భిన్నమైనది. అభిప్రాయములు కొన్ని సత్యమైననూ, మరికొన్ని వ్యక్తి యొక్క లోదృష్టి ననుసరించి వికారముచెంది వుంటాయి. నిజమునకు సత్యము చాలా విశాలమై, మార్పు చెందక, అన్ని ప్రదేశములలో, అన్ని కాలముల యందు నిండి వుంటుంది. ఇది తెలిసి మాట్లాడేవాని మాటఆహ్లాదమును కలిగిస్తుంది. ఇతరులను బాధించదు. చాలా మంది తమ అభిప్రాయములనే సత్యముగా వక్రీకరించి చాలా ఉద్వేగముతో మాట్లాడుతూ వుంటారు. అది వారికే కాకఇతరులకు కూడా హాని చేస్తుంది. కనుక సత్యమును గ్రహించి మాట్లాడవలెను. అలా మాట్లాడేవాని మాట అవతలి వారికి ఎంతో ఉపశమనమును, ఓదార్పును, ఆహ్లాదమును,ప్రశాంతతను కలిగిస్తుంది. అలాంటి వారు ఎంతసేపు మాట్లాడినా విసుగు అనిపించదు. కొందరు మాట్లాడుతుంటే ఇంకెప్పుడు ఆపుతారా అనిపిస్తుంది. ఒకవేళ అధికారముంటేనోరుముయ్! అని అవతలవాడి నోరు మూయించవచ్చు. లేకపోతే భరించక తప్పదు.
మంచి మాట ఒక జీవితమును నిలబెడుతుంది. కాకపోతే జీవితమును కాల్చివేస్తుంది. కొడితే శరీరమునకు దెబ్బతగులుతుంది.. కొంత కాలమునకు మానుతుంది. కానీ మాటమనసుకు తగులుతుంది. గాయము మానటము చాలా కష్టము. ఒక్కోసారి జన్మంతా బాధిస్తుంది. ఒకసారి మాట్లాడిన దానిని వెనకకు తీసుకొనుట సాథ్యపడదు. కనుక ముందు జాగ్రత్త అవసరము. భావశుద్ది కలిగినప్పుడే భాషలో కూడా ప్రశాంతత వుంటుంది.
ఇతరులను సంతోష పరచుటకు అసత్యములను పలుకరాదు. సాధారణముగా అవతలివారి మెప్పును పొందుటకును, వారిని తృప్తి పరచుటకు మనము నమ్మని విషయాలనునమ్మినట్లు మాట్లాడుటకు వెనుకాడము. "ఈరోజు మిమ్మల్ని కలవటం నాకు చాలా ఆనందముగా వుంది" అంటాము. నిజముగా ఆనందము కలిగి మాట్లాడామా, లేక ఎదో అనకపోతే బాగుండదు అని మాట్లాడామా అనే విశ్లేషణను అనుసరించి మన మాటలో సత్యము వున్నదా లేదా అని తెలుస్తుంది. అసత్యాన్ని ప్రియముగా పలకడం వ్యాపారమవుతుంది."అసత్యాన్ని ప్రియముగా పలుకకూడదు. అలాగే సత్యాన్ని అప్రియముగా పలుకకూడదు."
లోపల భావము కలిగిన తరువాత, దానిని వ్యక్త పరచే ముందు దానిని బుద్దికి అందించి, తనకున్న జ్ఞానముతో బాగా ఆలోచించి అది ఇతరులకు హాని కలిగించదు, అవతలి వారిశ్రేయస్సును కోరేదే అని అనింపించినపుడు దాని తన ప్రియభాషణముతో వ్యక్త పరచవలెను. తెలియని విషయములు తెలిసినట్లు కూడా మాట్లాడ కూడదు. లోపల కలిగిన భావముకాక ఇతరములను వ్యక్త పరచేవాడు ద్విస్వభావములు కలిగి త్రికరణ శుద్ది లేక ఎవరూ కూడా నమ్మని స్థితికి దిగజారిపోతాడు. లోపల ఆనందము లేకపోయిననూ బయటకు ఆనందమును ప్రదర్శించువాడు వంచకుడు. భావము, భాషలలో ఏకత్వము లేనివాడు. అంతరములో ఆనందము కలవాని పనులు, మాట చాలా ఆహ్లాదమును కలిగించి సహజత్వము చెంది వుంటాయి. భావములో, మనస్సులో ఆనందము లేనివాని చేష్టలు, మాట, భావములు కూడా ఉద్రిక్తత కలిగి ఉద్వేగభరితమై ఇతరులను బాధిస్తాయి. అటువంటివారి సంతోష ప్రదర్శన సహజత్వము లేక నటన వలే వుంటుంది. సహజమైన ఆనందము కాదు. కృత్రిమమైనది. కృత్రిమత్వానికి ఆనందము అంటించినా అంటదు. దానికి శాశ్వతత్వము లేదు. ఎక్కువగా మాట్లాడేవాడికి వాడేమి చేస్తున్నాడో కూడా తెలియదు. పనికూడా సరిగా చెయ్యడు. వాగుడెక్కువ పనితక్కువ. భావము, మాట, చేస్తున్న కార్యమునందు కూడా సమతుల్యత అవసరము.
భోజన సమయములో ఎక్కువగా మాట్లాడుట వలన దాని రుచిని ఆస్వాదించలేము. మనసు మాటమీద వున్నప్పుడు భోజనం రుచి ఎలా తెలుస్తుంది. అలాగే మనస్సును చీకాకుపరచే మాటలు, ఇంకొకరిని కించపరచే మాటలు, విమర్శలు మొదలైనవి కూడా భోజనము మీద ప్రభావము చూపిస్తాయి. మంచి హాస్యముతో కూడిన మాటలు మాట్లాడవచ్చు.సంతోషమును పెంచే మాటలు మాట్లాడవచ్చు. అలా తిన్న భోజనము ఆనందమును ఇస్తుంది. అలాగే కొందరు మంచి సంగీతము వచ్చేటప్పుడు కూడా మాట్లాడతారు. దానివల్లసంగీతము ఆనందించలేము. మాట్లాడే ముందు ఇవన్నీ గుర్తు వుంచుకున్నచో ఆనందించగలుగుతాము.
మాట్లాడే ముందు వినటము బాగా అలవాటు చేసుకోవాలి. అవతలి వారు చెప్పేది సరిగా విననప్పుడు మనము మాట్లాడేదానిలో సత్యము లేకపోవటానికి అవకాశము వుంటుంది.పూర్తిగా విని అర్థముచేసుకొని సమాథానము తెలిసినప్పుడే చెప్పవలెనుగాని, తెలియకపోయినా ఇష్టము వచ్చినట్లు మాట్లాడాకూడదు. ఇది ఒక సాథనగా చేయాలి. దీనికి ఎంతోసహనము ఓర్పు అవసరము. అలాగే మనము మాట్లాడేటప్పుడు కూడా వినాలి. అంటే మనము ఏమి మాట్లాడుతున్నామో కూడా బాగా వినాలి. అవతలవాళ్ళు మాట్లాడేటప్పుడువినాలి, మనము మాట్లాడేటప్పుడు కూడా వినాలి. అప్పుడే విషయము పూర్తిగా అవగతమవుతుంది. సగం అర్థమైతే విషయాన్ని ధారాళముగా మాట్లాడలేము.. పూర్తి సమాథానముఇవ్వలేము. పూర్తిగా విని, అర్థము చేసుకొని అవసరమైనంతవరకే సమాథానము ఇవ్వాలి.
అవసరము లేనప్పుడు మౌనమే ఉత్తమము. భౌతికమైన మౌనముతోపాటు మానసిక మౌనము కూడా అవసరము. వీటిలో మానసిక మౌనము శ్రేష్టము. మౌనము నందుగల ఆనందమును అనుభవించువాడు, అవసరమున్నప్పుడు అవసరమైనంత వరకే మాట్లాడి తిరిగి మౌనము వహించును. అలా అవసరమైనంతవరకే మాట్లాడి, అదికూడా సత్యమైవుండి, సత్యాన్ని కూడా ప్రియముగా ఇతరుల శ్రేయస్సుకొరకై వుండే వాని వాక్కు సత్యమై, నిత్యమై, శాశ్వతమై వుంటుంది. వారి మాటలు మంతములై జాతిని నడిపిస్తాయి.