Monday, September 14, 2009

త్రిగుణ బంధనము



త్రిగుణ ప్రజ్ఞలు మూడును (ద్రవ్య రూపము, దేవతా ప్రజ్ఞలు, క్రియా రూపమైన ప్రజ్ఞలు) జీవునికి ఆశ్రయములుగా పనిచేయుచున్నవి. వీని ఆశ్రయము వలన జీవుడు మాయతో కూడిన వాడై బంధింప బడుచున్నాడు. మూడు ఆశ్రయములలోనూ మూడు బంధములు ఏర్పడును. పరిస్థితుల ప్రభావము వలన మనకు మన స్వస్వరూపము గుర్తు వుండదు. అంటే తాను కూడా మహా చైతన్యము నందలి భాగమే అని గుర్తు వుండదు. "నేను నేనైన నేను" అని గుర్తు వుండదు. నిద్ర లేవంగానే మనము దైవము ఒడిలోనుండి వచ్చాము అని గుర్తు వుండదు. అది ఒక ఆవరణ. అది సంకర్షణ వ్యూహము. అక్కడ నుండి దేవతారాథనము, దేవతా ప్రజ్ఞలతో అనుసంధానము వల్ల వాటి సహకారము కోరటము జరుగుతుంది. అంటే బుద్ది లోకములలోనికి వస్తాము. దానిని ప్రద్యుమ్న వ్యూహము అంటారు. తరువాత బాహ్య లోకములోనికి మనస్సు ద్వారా వస్తాము. అప్పుడు మనకు దేవతా ప్రజ్ఞలు కాని, మనము ఎక్కడనుండి వచ్చామో కూడా గుర్తు వుండదు. బయటి విషయాల్లో పట్టుబడి వుంటాము. అంతర్ముఖమవ్వాలంటే బాహ్యమే అడ్డు పడుతుంది. కన్నులు మూసుకున్నా బయటి విషయాలే గుర్తుకు వస్తాయి. అంటే బాహ్యము ఒక బంధమును ఇస్తుంది.

తరువాతి బంధము అంతరంలో స్వభావములో వుంటుంది. మూడవ బంధము నేనున్నానే భ్రమ. ఈ మూడు మూడు బంధాలుగా, ఆశ్రయాలుగా ఏర్పడతాయి. ఎవరికి? నాలుగో వాడైన జీవుడికి. ఇవన్నీ జీవుడికి ముసుగుల వంటివి. మన పేరు ఒక ముసుగు. మన రూపం ఒక ముసుగు. మన స్థితిగతులు మరియొక ముసుగు. మన స్వభావం, మనగురించి మనకున్న భావనలు కూడా ముసుగులే. ఈ ముసుగులన్నీ తొలగిస్తే వున్న ఈశ్వరుడే జీవుడు. వీటిని తొలగించుట అంత సులభము కాదు. ఇవన్నీ ముసుగులే అన్న భావన ఎప్పూడు గుర్తు వుండాలి. లేకపోతే మాయ కమ్మివేస్తూ వుంటుంది.

మాయ వల్లనూ, ఈ మూడు బంధముల వల్లనూ మూడు ఆవరణలు ఏర్పడి మూడు శరీరములు ఏర్పడతాయి. అవి ఒకదానిలో ఒకటి వుంటాయి. ఒకటి క్రియా రూపమునకు సంబందించినది. అదే స్థూల శరీరము. సప్త ధాతువులతో కూడిన ఈ శరీరము నందు మనసు, ఇంద్రియములు పనిచేస్తూ వుంటాయి. దీనికి పైన దేవతా ప్రజ్ఞలతో కూడిన ఇంకొక రూపము వుంది. దానినే బంగారు శరీరము అనియు, సూక్ష్మ శరీరము అనియు, దివ్య శరీరము అనియు అంటారు. దివి అనగా వెలుగు. దేవత అనగా వెలుగు రూపము అని అర్థము. ఇది బంగారు కాంతితో వుంటుంది. దీనికి పైన తాను దిగివచ్చిన కారణము (పరిపూర్ణత కొరకు) తో కూడిన శరీరము వుంటుంది. ఇది తెల్లని వజ్ర కాంతితో వుంటుంది. ఇది తాను దిగివచ్చిన కారణము కొరకు మాత్రమే దేవతా ప్రజ్ఞలతో అనుసంధానము చెందినవారికి వుంటుంది. దానిని కారణ శరీరము లేక లింగ శరీరము అంటారు. ఈ మూడును జీవునకు మూడు ఆవరణలు. వీటిని లింగములుగా చేసుకొని ఈశ్వరుడు జీవుడగుచున్నాడు. లింగములనగా చిహ్నములు. గుర్తింపదగినవి. వీటి వలననే జీవుడు వున్నట్లు తెలియును. అనగా జీవుడుగా దేవుడున్నట్లు తెలియును. అన్నిటియందు వర్తిస్తున్న ఈశ్వరుడ్ని దర్శించేవానికే ఇది తెలియును. అనగా ఎవరైతా తాను అను ప్రజ్ఞగా వుంటారో వారికి తెలియును. ఇతరములు కనిపించినచో ఈశ్వరుడు కనిపించడు. "నేను అను పదమునకు అర్థమైన తనకు తెలుయునుగాని, నీవు అను పదమునకు అర్థమైన ఇతరులను గమనించు దృష్టికి అందదు." అని మాస్టరు ఇ.కె గారు భాగవత రహస్య ప్రకాశము నందు తెలియపరచినారు.

మనసు బాహ్యములోనికి పనిచేస్తూ వుంటుంది. దానిని అంతరంలోనికి మళ్ళించుట ప్రధాన కార్యక్రమము. అప్పుడు అది లోపల అద్భుతమైన వెలుగును దర్శించి క్రమంగా బుద్దిలోనికి పెరుగుతుంది. దాన్ని చిత్తము నుండి బుద్దిలోనికి పెరగటం అంటారు. చిత్తము ఇంద్రియ ఆకర్షణల చేత బయటకు వెళ్ళటం చేత దానికి వృత్తులు ఏర్పడతాయి. యోగ శాస్త్ర ప్రకారం ఈ చిత్త వృత్తులని నిరోధించి బుద్దిలోనికి పెరగటమే యోగము నందు మొదటు మెట్టు. మనలోని దేవతలందరిని (అష్ట దిక్పాలకుల్ని, నవగ్రహాల్ని, ద్వాదశ ఆదిత్యుల్ని, ఏకాదశ రుద్రుల్ని, అష్ట వసువుల్ని, త్రిమూర్తుల్ని, త్రిశక్తుల్ని, షట్చక్రాల్ని, అశ్వనీ దేవతలను మొ) లోపల బాగా స్మరించినచో మనకు బయటి విషయములు గుర్తుకు రాక మనసు బుద్ది యంది నిలచుట జరుగును. ఈ దేవతలందరు మనలో ఏ ఏ కేంద్రములలో వున్నారో అవి తెలియాలి. సాధారణంగా మనము అందరి దేవతలో కూడిన ఒక ఆవు బొమ్మ కాలండెర్ చూస్తూ వుంటాం. మనలో కూడా దేవతలందరూ అలానే వుంటారు.

దేవతా స్థానములు
సూర్య, చంద్రులు కుడి, ఎడమ కన్నులుగా వున్నారు. అగ్ని మూడవ కన్నుగా వున్నాడు.
మిత్రా, వరుణులు కుడి, ఎడమ నాసికలుగా వున్నారు. నాసిక యందు వాయువు వున్నాడు.
ఫాల భాగము నందు శివుడు, దానికి పైన కుబేరుడు, ఈశానుడు వున్నారు.
కుడి చెవి యందు బుధుడు, ఎడమ చెవి యందు బృహస్పతి (గురుడు) వున్నారు.
నాలుక కొన యందు సరస్వతి, పై కంఠము నందు వాగీశ్వరి ( వాక్కు) అను దేవత, కొంచము దిగువన నకుళీ వాగీశ్వరి ( భావమయ వాక్కు) అను దేవత వుంటారు.
హృదయము నందు విష్ణువు, మెడ వెనక మూపురము వంటి ప్రదేశములో బ్రహ్మ, ఉదరము నందు అగ్ని వున్నారు.
ముఖము ఇంద్రుడిగా వున్నది. మాటలోని చేతన అగ్నిగా వున్నది. శిరస్సు అంతా కూడా దివ్య లోకంగా భావించాలి. ఏడు కేంద్రములలో సప్త ఋషులు వున్నారు. ఇడ, పింగళ, సుషుమ్న నాడుల యందు అష్ట దిక్పాలకులు వున్నారు. శిఖ యందు వేనుడు వున్నాడు. పైన ఇంద్రా విష్ణు వున్నాడు.

సప్త ఋషులు వారి స్థానములు:
అత్రి --> సహస్రార కేంద్రము (త్రిగుణాతీతమైన తత్వము)
భృగువు --> ఆజ్ఞా కేంద్రము (భృగు అనగా వెలుగు) గాయత్రి యందు చెప్పబడిన భర్గో దేవుడు.
అంగీరసుడు --> విశుద్ధి కేంద్రము (అవయములు ఏర్పడుట, లోకములు ఏర్పడుట, భగవంతుడు రసమయ స్వరూపుడై వుండుట, ప్రాణము, చేతనము)
వశిష్టుడు --> అనాహత కేంద్రము (శాంతముగా, ఆనందముగా, సంతోషముతో పరితుష్టిగా, తృప్తితో పరిపూర్ణ జ్ఞానముతో నివసించువాడు)
పులహుడు --> మణిపూరక కేంద్రము (పులిసే వాడు. కోరికలతో వూరే వాడు, కోరికలను, ఆలోచనలను కలిగించువాడు)
పౌలస్త్యుడు --> స్వాథిస్ఠాన కేంద్రము (ఇంద్రియ ప్రజ్ఞ, ఇంద్రియ లోలత్వమును కలిగించు వాడు. ఇంద్రియము లేనిదే అనుభూతి లేదు.)
క్రతువు --> మూలాధార కేంద్రము (క్రమ బద్దమైన జీవితమును అనుగ్రహించువాడు)

గ్రహములు వాటి స్థానములు
సహస్రారము నందు బృహస్పతి (అంతర్యామి ప్రజ్ఞ), ఆజ్ఞలో సూర్యుడు, కంఠము నందు బుధుడు, హృదయములో శుక్రుడు, మణిపూరకము నందు చంద్రుడు, స్వాథిస్ఠానములో కుజుడు, మూలాధారము నందు శనిని దర్శనము చేయవలెను.

దిక్కులు
సహస్రారము నందు ఊర్ధ్వమును, ఆజ్ఞ తూర్పును, స్వాథిస్ఠానము నందు ఆగ్నేయమును, హృదయము నందు దక్షిణము, అధమ మూలాధారము నందు నైఋతిని, ఉత్తమ మూలాధారము నందు పడమరను, శిఖ యందు ఉత్తరము, అధస్సును పాదముల యందును దర్శనము చేయవలయును.

అలా సమస్త దేవతా దర్శనము, ఋషి దర్శనము, సప్త గ్రహ దర్శనము, దిక్కులు మనయందు దర్శించి నమస్కరిస్తే మనస్సు అంతర్ముఖమై బుద్ది యందు నిలుస్తుంది. లేనిచో బయటి విషయముల యందే సంచరిస్తుంది. పూజ చేస్తున్నా, స్తోత్రము చదువుతున్నా మనస్సు అంతర్ముఖము అవక కలత చెందుతుంది. ఎదో మనమూ చేశాము అని పిస్తుందే కాని వాటిపై నిలవదు. కారణము సరియైన దేవతారాధానము లేకపోవుటయే.

బుద్ది యందు నిలచినవాడికే త్రిగుణముల తత్వము బోధ పడి వాటికి ఆవల వున్న అంతర్యామిని దర్శించ గలడు.

Tuesday, September 8, 2009

త్రిశక్తులు - వాటి అవతరణము


దైవము అనగా శుద్ద చైతన్య స్వరూపమైన మహా వెలుగు. అది అనంతమైనది. అవధులు లేనిది. శుద్ద చైతన్యము నుండి జీవుల కోరిక మేరకు సృష్టి సంకల్పంబయలుదేరుతుంది. అసలు మూలతత్వానికి సంకల్పంలేదు. అందున్న జీవుల కోరిక వల్ల ఒక సంకల్పం బయటకు వస్తుంది. పరిపూర్ణత పొందటమే జీవుల కోరిక.అపరిపూర్ణతచేత మరల మరల జన్మిస్తూ వుంటాం. పరిపూర్ణత పొందినవారు, అపరిపూర్ణులకు సహాయమందించుటకు భగవంతుని ప్రతినిధులుగా వారు కూడా దిగివస్తారు. వారేగురుపరంపర. వీరు పరిపూర్ణత కొరకు ప్రయత్నించే వారికి సహాయ సహకారములు అందిస్తారు. వీరు అన్ని లోకములలో పనిచేస్తూ వుంటారు. అలాంటి పరిపూర్ణుల గురించిభగవద్గీతలో విభూది యోగంలో భగవంతునిచే తెలియపరచ బడినది. వారే సనకస నందనాదులు, సప్త ఋషులు, ప్రజాపతులు మొ|| వారు. కాబట్టి అసలు సంకల్పము జీవులది. జీవుల సంకల్పము ప్రకారం వారికి పరిపూర్ణులుగా చేయుటకు భగవంతుడు తనను తాను సృష్టించుకొని ఒక మహా చైతన్య స్వరూపుడై వెలుగై నిలుస్తాడు.

మహా చైతన్యమే అన్నిటికి ఆథారము. దాన్నే అదితి అని, గాయత్రి అని, సావిత్రి అని, సరస్వతి అని అంటారు. దాన్నే త్రిగుణములకు అవతల వున్న అమ్మవారుగా, జగన్మాతగాకొలుస్తాము. శుద్ద చైతన్య స్వరూపులమే మనమంతా కూడా. కాని మనం త్రిగుణముల నుండి దిగి వచ్చిన కారణంగా త్రిగుణములలో బంధింపబడి వుంటాము. అది మొదటిబంధము. దాని వల్ల మనకు నేను అను భావము కలుగుతుంది. త్రిగుణములకు మూలము ఇచ్ఛ, జ్ఞాన క్రియా శక్తులు. ఇచ్ఛా పూర్ణమునకు మనము పొందవలసినజ్ఞానము, జ్ఞానము ఆధారముగా క్రియను నిర్వర్తించటము జరుగుతుంటుంది. వచ్చిన ఇచ్ఛకు సరియైన జ్ఞానము లేనప్పుడు చేసిన క్రియలో వున్న అవకతవకల వల్ల మనముబందింప బడుట జరుగును. మూడును జీవుని కొరకు మొదటి సారిగా అవతరించును. ఇవే రజస్సు, సత్వము మరియు తమస్సు లనబడే త్రిగుణములు.

మూల ప్రకృతి నుండి అవి తామసిక, రాజసిక మరియు సాత్విక అహంకారములై పుట్టును. మూడు గుణములను అథిష్టించి వున్నావాడు ఈశ్వరుడు. అనగా మనయందుమూడు గుణములకు ఆవల మనను అథిష్టించి అన్నిటిని నిర్వర్తించుటకు సంసిద్దుడై వున్నవాడు ఈశ్వరుడు. అన్ని భూతములయందు కూడా ఆవిథంగానే వుండి వున్నాడు.అతడు మనయందు వున్నాడు అన్న భావన మనకు బాగా స్థిరపడవలెను. త్రిగుణములకు ఈవల ఈశ్వరునికి ప్రతిబింబములుగా జీవులమై మనముంటాము. నిజానికిమనమున్నామని అనుకోటమేకాని అసలు లేము. అల వుంది అనుకోటమే కాని నిజానికి అది సముద్రమే కదా! గుణములందుకొని అది అలైంది. దానికి పుట్టుక వుంది, వృద్దివుంది మరల మరణము వుంది. అలాగే మనకు కూడా నేనున్నాను అనే భావము పుడుతుంది, పెరుగుతుంది మరల పడిపోతుంది. భావము వెనుక ఈశ్వరుడు వున్నాడు.కనుకనే భాగవతము నందు "అతడు ఈశ్వరుడై వుండగా రజస్సు, సత్వము, తమస్సు అను గుణములు వానినుండి పుట్టుచున్నవి" అని చెప్పబడినది.

రజస్సు వల్ల కార్యము, సత్వము వల్ల కారణము, తమస్సు వల్ల కతృత్వము ఏర్పడుచున్నవి. సంబంధము వలననే ద్రవ్య రూపములుగా పంచ భూతములు పుట్టుచున్నవి. జ్ఞానరూపములుగా దేవతలు పుట్టుచున్నారు. క్రియా రూపములు గా ఇంద్రియములు పుట్టుచున్నవి. జ్ఞాన రూపులైన దేవతలు మనయందు ఆకాశము, వాయువు, అగ్ని, జలము,పృథ్వి అను ద్రవ్య (పదార్థము) రూపములైన పంచ భూతములకు సహాయమందిస్తూ వుంటారు. కేవలం ఇచ్ఛ, జ్ఞానముల వలన అనుభూతి కలగదు. అది క్రియా రూపముపొందినపుడే కలుగుతుంది. ఇచ్ఛ వున్నంత కాలము క్రియ వుంటుంది. ఇచ్ఛ మనలని మనం పరిపూర్ణులను చేసికొనుటకు భగవంతునిచే ఇవ్వబడినది. దీని కొరకే జన్మించుటజరుగుతుంది. శాశ్వతమైన ఆనందము పొందవలెననే ఒక భావము నుండి కలిగిన ఇచ్ఛ వలన మరల మరల జన్మించటము జరుగుతూ వుంటుంది. ఇచ్ఛని నిర్వర్తించుకొనుటకుజ్ఞానము, జ్ఞానమును నిర్వర్తించుకొనుటకు శరీరము ఇవ్వబడినవి. క్రియా రూపములో ఇంద్రియములు, శరీరము లేకపోతే మనము అనుభూతిని పొందలేము. మనస్సు,శరీరము మరియు ఇంద్రియములు మూడును పదార్థమునకు సంబంధించినవే. వాటిని అనుసరించి కార్యము నిర్వర్తించుటకు జీవుడు వాటిలోనికి దిగివచ్చును. ఈశ్వర తత్వముత్రిగుణముల ద్వారా పత్యేకముగా ఇంద్రియములలోనికి దిగివచ్చినపుడు సంకర్షణుడు అంటారు. అప్పుడే తాను, ఇతరులు అనే వేరు భావము కలుగుతుంది. అతడే జీవుడు.జీవుడు అనగా స్పందనాత్మక చైతన్యము. ఆనందము కొరకు అన్వేషించువాడు. అనేక ఇతర విషయములలో తనకన్నా భిన్నముగా వున్నవాటిలో ఆనందము కొరకు అన్వేషించి,చివరకు తను ఎక్కడనుండి పుట్టుకొచ్చాడో దానితో అనుసంధానము చెందితే తప్ప ఆనందము లభించదు అని తెలుసుకోవటం జరుగుతుంది. దానికొరకే దైవారాథనము, దానితోతాదాత్మ్యము చెందుట. అందుకొరకు దైవముచే ఇవ్వబడినవే ఇచ్ఛా, జ్ఞాన క్రియా శక్తులు. మూడునూ భగవంతుని శక్తులే.

ఇది ప్రతిరోజూ మనకు జరుగును. ఇచ్ఛ కారణముగానే మనము నిద్ర లేవటము జరుగుతుంది. లేకపోతే మనము దైవముతోనే వుంటాము. నిద్ర లేచిన తరువాత బుద్ది లోకములలోదేవతా ప్రజ్ఞలతో అనుసంధానము వలన, ఇచ్ఛను నిర్వర్తిచుటకు కావలసిన జ్ఞానము ఏర్పడుతుంది. అక్కడినుండి పదార్థమయమైన మనస్సు, ఇంద్రియములలోనికి దిగివచ్చినిర్వర్తించుట జరుగుతుంది. అలా మూడు స్థితులలో దైవముతో వున్న ప్రజ్ఞ, పదార్థమయ లోకములలో జీవుడుగా ప్రవర్తించుట జరుగును. ఇక్కడనుండి మరల అదే మూడుస్థితులలో జీవుడు దైవమును చేరగలడు. మనస్సు నుండి బుద్దిలోనికి, అక్కడ నుండి తాను లేక నేను అనే ప్రజ్ఞగా విశ్వాత్మకమైన ప్రజ్ఞతో అనుసంధానము చెందటముజరుగుతుంది. దీనినే త్రివిక్రమత్వము అంటారు. మూడు అడుగులలో జీవుడు దేవుడవగలడు.

మనము నిద్ర నుండి లేవంగానే మనకు గుర్తు వచ్చేది నేను, నేనున్నాను అని. అంతకు ముందు నిద్రలో అది మనకు గుర్తులేదు. అప్పుడు మనం ఎక్కడ వున్నాం? అప్పుడుమనమెవరు? తెలియదు. కారణము, నేను అను భావము లేని స్థితి అది. నేనున్నాను అని తెలియుట మూల భావము. అప్పుడు నేనేమి చేయవలయునని భావించి జ్ఞానమునుపొందటము తరువాత స్థితి. పొందిన జ్ఞానముతో కార్యమును నిర్వర్తించుట చివరి స్థితి. అక్కడి నుండి జీవుని స్వభావము ననుసరించి జీవితము నడపబడుతుంది. అంటే జీవితముఅనే మహా వృక్షము నేను అనే పునాది నుండి బయలు దేరుతుంది. ఇలా నేను అనుకోవటమే అహంకార మనబడుతుంది. అంటే మూలము కంటే వేరుగా వున్నానన్న భావము.అలా కాక అన్నిటికి మూలమైన శుద్ద చైతన్యమే నేనుగా వున్నది అని భావించటం భక్తి అవుతుంది. నేను లేని స్థితి, మేల్కాంచి నేనున్నానను స్థితి, జ్ఞానము పొందు స్థితి తరువాతనిర్వహణ స్థితి అను నాలుగు స్థితులలో సమస్తము ఏర్పరచబడినది. ఇది మనలోనూ, సృష్టిలోనూ ఏర్పరచబడినది.