Thursday, May 31, 2012

క్షమాగుణము మానవునికి అత్యుత్తమైన ఆభరణము


క్షమ..భగవంతుని అనంత కళ్యాణగుణాలలో ముఖ్యమైనది.  కరుణ కలిగిన వాడే క్షమా గుణాన్ని ప్రదర్శించగలడు.  బుద్ది జీవుడైన మానవుడు తప్పక కలిగి ఉండవలసినది క్షమా గుణము.  గుణములన్నిటిలోనూ అత్యుత్తమైనది.   అది లేనివాడు మనిషి కాలేడు. ఇతరుల దోషాలను క్షమించగలిగి ఉండాలి.  ఎవరి ఆలోచన వారికి సరియైనదే.  కానీ అది ఇంకొకరి ఆలోచనతో విభేదించినపుడు మనస్పర్దలు కలుగుతాయి.  వాటిని పెంచుకొని సంబంధములు పాడుచేసుకొనకూడదు.  ఒకరి పొరపాట్లను ఒకరు క్షమించుకొనగలిగి ఉండాలి.  క్షమ వల్ల మనిషికి వికాసము కలుగుతుంది.  శాంతి లభిస్తుంది. 

క్షమాగుణము మానవునికి అత్యుత్తమైన ఆభరణము.  ఇది జ్ఞానము కంటే కూడా శ్రేష్టమైనది. సత్పురుషులు క్షమను సహజముగానే కలిగి ఉంటారు.  కరుణ, సహనము, క్షమ కలిగిన వారిని ఎవరూ ఏమీ చేయలేరు.  ఇవి గొప్ప ఆయుథములు.  వీటిని ధరించినవారు దేనెనైననూ, ఎవరినైననూ జయించగలరు.  ఎటువంటి కార్యమునైననూ సాథించగలరు. యోగులు, జ్ఞానులు, సద్గురువులు మొదలైనవారు అందరిని క్షమిస్తారు.  అది వారి స్వభావము.  కానీ రాజైనవాడు అందరిని క్షమించకూడదు.  రాజధర్మము ప్రకారము ఎవరిని క్షమించాలో, ఎవరిని శిక్షించాలో నిర్ణయించుకొని వాటిని అమలు చేయాలి. 

ఏ మతమునందైనా ప్రార్థనా సమయములో తన తప్పులను క్షమించమని దైవాన్ని వేడుకొనటము జరుగుతుంది.  అప్పుడు ఒకవేళ దైవము ఎందుకు క్షమించాలి అంటే ఏమని సమాథానము చెప్పగలరు.  నీవు ఎంతమందిని క్షమించగలిగావు?  నీవు ఎవరి పొరపాట్లనుకుడా సహించవు, క్షమించవు, అటువంటప్పుడు నేను నిన్ను, నీ తప్పులను, పొరపాట్లను ఎందుకు క్షమించాలి అని అడిగితే సమాథానము లేదు.   కానీ ఎవరు ఎలా ప్రవర్తించినా క్షమించగలిగినవాడు దైవము.  నీవు కరుణా సముద్రుడవు కనుక మా తప్పులను క్షమించు అని ప్రార్థన చేయాలి. మన ఎడల ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా, పొరపాటుచేసినా మనస్పూర్తిగా క్షమించగలిగినవాని ప్రార్థనను దైవము స్వీకరిస్తాడు. 

పిల్లల తప్పులను పెద్దలు క్షమిస్తారు.  కానీ పెద్దవాళ్ళు ఎమైనా పొరపాటు చేస్తే తాము పెద్దవాళ్ళమయ్యాము అనుకొనే పిల్లలు వాళ్ళను నానా యాగీ చేస్తారు.  దుర్భాషలాడతారు. చాలా భయంకరముగా మాట్లాడతారు.  అది చాలా పెద్ద తప్పు.  అని క్షమార్హము కాదు. దాని ఫలితము అనుభవించవలసినదే.  విషయ పరిజ్ఞానము అంతకంతకు పెరుగుతోంది. అటువంటప్పుడు ఒకవేళ పెద్దల విషయంలో వారు ఎమైనా పొరపాటు అనిపిస్తే అది పిల్లలు గమనిస్తే దానిని వారు నొచ్చుకొనకుండా తెలియచేయాలి, లేదంటే మౌనము వహించి క్షమించగలిగి ఉండాలి.  అలా ఉండగలిగే వాడే దైవము యొక్క క్షమను, రక్షణను పొందగలడు. 

అపహరించిన సీతను తనకప్పగించి తన తప్పును తెలుసుకొన్నచో రావణాసురుని క్షమించి వదిలేస్తాను అని శ్రీరాముడు అన్నట్లు శ్రీమద్రామాయణము చెబుతుంది. యుద్దములో తొలిరోజున ఓడిపోయిన రావణాసురుని దయతలచి మళ్ళీ రేపురా అని తిరిగి పంపించిన దయార్ద్రహృదయుడు శ్రీరాముడు.  ఆయన క్షమాగుణము అంత గొప్పది.  ఎంతో మంది భక్తుల కథలలో కూడా క్షమను వారు ఎలా ప్రదర్శించారో తెలుస్తుంది.  అందరిలో దైవాన్ని చూడగలినవాడు సహనము, కరుణ కలిగి ఇతరుల దోషాలను క్షమించగలుగుతాడు.

క్షమ అనే ఖడ్గముతో ఇతరుల ఎడల మనకున్న అభిప్రాయములను తెగనరకి శాంతిని పొందవచ్చును.  క్షమించలేని వాడు వాటి వలలో చిక్కుకొని శాంతిలేక మరణించును. సహనము కలిగినవాడు సమస్త కర్మను దగ్దము చేసుకొనగలుగును. నిజమునకు క్షమించగలిగిన వాడే క్షమార్హుడు.  ఇది ఎవరికి వారు చేయవలసిన సాథన.  సమాజము ఎలా ఉన్నా ఎవరికి వారు సాథన చేయవచ్చును.  ఎవరి ఆకలికి వారే తినాలి అన్నది ఎంత నిజమే ఇది కూడా అంతే.  కనుక ప్రతి ఒక్కరూ సహనము కలిగి ఇతరుల దోషాలను క్షమించగలిగి శాంతికి పోందురుగాక.