Monday, October 17, 2016

"పోతన భాగవతం" లోని మరికొన్ని పద్యాలు


7-46-ఉ.
మచ్చిక వీరికెల్ల బహుమాత్రముఁ జోద్యము దేహి పుట్టుచుం
జచ్చుచు నుంటఁ జూచెదరు చావక మానెడువారిభంగి నీ 
చచ్చినవారి కేడ్చెదరు చావున కొల్లక డాఁగ వచ్చునే
యెచ్చటఁ బుట్టె నచ్చటికి నేఁగుట నైజము ప్రాణికోటికిన్.

7-49-ఆ.
ధనము వీథిఁ బడిన దైవవశంబున
నుండు; పోవు మూల నున్న నైన
నడవి రక్ష లేని యబలుండు వర్ధిల్లు
రక్షితుండు మందిరమునఁ జచ్చు.

7-51-సీ.
పాంచభౌతికమైన భవనంబు దేహంబు
పురుషుఁడు దీనిలోఁ బూర్వకర్మ
వశమున నొకవేళ వర్తించు దీపించుఁ
దఱియైన నొకవేళఁ దలఁగి పోవుఁ
జెడెనేని దేహంబు జెడుఁగాని పురుషుండు
చెడ డాతనికి నింత చేటులేదు
పురుషునకిని దేహపుంజంబునకు వేఱు
గాని యేకత్వంబు గానరాదు

7-51.1-ఆ.
దారువులఁ వెలుంగు దహనుని కైవడిఁ
గాయములఁ జరించు గాలిభంగి
నాళలీనమైన నభము చాడ్పున వేఱు
దెలియవలయు దేహి దేహములకు.

ప్రహ్లాద చరిత్రలోని పద్యములు

7-123-శా.
పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాస లీ
లా నిద్రాదులు చేయుచుం దిరుగుచున్ లక్షించుచున్ సంతత
శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృ తాస్వాద సం
ధానుండై మఱచెన్ సురారిసుతుఁ డే త ద్విశ్వమున్ భూవరా!

7-130-క.
"చదువనివాఁ డజ్ఞుం డగు
జదివిన సదసద్వివేక చతురత గలుగుం
జదువఁగ వలయును జనులకుఁ
జదివించెద నార్యులొద్ధఁ జదువుము తండ్రీ!"

7-167-మ. నవవిధ భక్తి
తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్ సత్యంబు దైత్యోత్తమా!

7-170-సీ.
కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే? ;
పవన గుంఫిత చర్మభస్త్రి గాక
వైకుంఠుఁ బొగడని వక్త్రంబు వక్త్రమే? ;
ఢమఢమ ధ్వనితోడి ఢక్క గాక
హరిపూజనము లేని హస్తంబు హస్తమే? ;
తరుశాఖ నిర్మిత దర్వి గాక
కమలేశుఁ జూడని కన్నులు కన్నులే? ;
తనుకుడ్యజాల రంధ్రములు గాక;
చక్రిచింత లేని జన్మంబు జన్మమే
తరళ సలిల బుద్బుదంబు గాక
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే
పాదయుగముతోడి పశువు గాక.

7-171-సీ.
సంసారజీమూత సంఘంబు విచ్చునే? ;
చక్రిదాస్యప్రభంజనము లేక
తాపత్రయాభీల దావాగ్ను లాఱునే? ;
విష్ణుసేవామృతవృష్టి లేక
సర్వంకషాఘౌఘ జలరాసు లింకునే? ;
హరిమనీషా బడబాగ్ని లేక
ఘనవిప ద్గాఢాంధకారంబు లడగునే? ;
పద్మాక్షునుతి రవిప్రభలు లేక;

నిరుపమాపునరావృత్తి నిష్కళంక
ముక్తినిధిఁ గానవచ్చునే? ముఖ్యమైన
శార్ఙ్గకోదండచింతనాంజనము లేక
తామరసగర్భునకు నైన దానవేంద్ర!

7-181-ఉ.
"అచ్చపుఁ జీకటింబడి గృహవ్రతులై విషయప్రవిష్టులై
చచ్చుచుఁ బుట్టుచున్ మరలఁ జర్వితచర్వణు లైన వారికిం
జెచ్చరఁ బుట్టునే పరులు చెప్పిన నైన నిజేచ్ఛ నైన నే
మిచ్చిన నైనఁ గానలకు నేఁగిన నైన హరిప్రబోధముల్.

7-182-ఉ.
కాననివాని నూఁతగొని కాననివాఁడు విశిష్టవస్తువుల్
గానని భంగిఁ గర్మములు గైకొని కొందఱు కర్మబద్ధులై
కానరు విష్ణుఁ, గొంద ఱటఁ గందుఁ రకించన వైష్ణవాంఘ్రిసం
స్థాన రజోభిషిక్తు లగు సంహృతకర్ములు దానవేశ్వరా!

7-214-సీ.
కంటిరే మనవారు ఘనులు గృహస్థులై
విఫలులై కైకొన్న వెఱ్ఱితనము
భద్రార్థులై యుండి పాయరు సంసార
పద్ధతి నూరక పట్టుబడిరి
కలయోనులం దెల్ల గర్భాద్యవస్థలఁ
బురుషుండు దేహి యై పుట్టుచుండుఁ
దన్నెఱుంగఁడు కర్మతంత్రుఁడై కడపట
ముట్టఁడు భవశతములకు నయిన

దీన శుభము లేదు దివ్యకీర్తియు లేదు
జగతిఁ బుట్టి పుట్టి చచ్చి చచ్చి
పొరల నేల మనకుఁ? బుట్టని చావని
త్రోవ వెదకికొనుట దొడ్డబుద్ధి.

Friday, February 20, 2015

శ్రీమద్భాగవతము నందు శుక యోగీంద్రుడు చేసిన దైవ గురు ప్రశంస

శ్రీమద్భాగవతము నందు పరిక్షిత్ మహరాజుకు భాగవతము తెలియజేయుట ప్రారంభము చేస్తూ శుక యోగీంద్రుడు చేసిన దైవ గురు ప్రశంసగజేంద్రమోక్షము ఘట్టములోని పద్యముల వలే ఇవి కూడా అంతర్యామి అయిన పరమేశ్వరుని కీర్తిస్తాయిప్రతిరోజు పఠించినచో భక్తి, జ్ఞాన, వైరాగ్యములు కలిగి యోగమునందు సాథకుని మనస్సు, బుద్ది స్థిరపడును పద్యములు శ్రీమద్భాగవతము నందలి 2 అధ్యాయములో 58 పద్యము నుండి 69 పద్యము వరకు ఉంటాయి.

2-58-.
పరుఁడై, యీశ్వరుఁడై, మహామహిముఁడై, ప్రాదుర్భవస్థానసం
హరణక్రీడనుఁడై, త్రిశక్తియుతుడై, యంతర్గతజ్యోతియై,
పరమేష్టిప్రము ఖామరాధిపులకుం బ్రాపింపరాకుండు దు
స్తర మార్గంబునఁ దేజరిల్లు హరికిం దత్త్వార్థినై మ్రొక్కెదన్.

2-59-.
మఱియు సజ్జనదురితసంహారకుండును, దుర్జన నివారకుండును సర్వరూపకుండును, బరమహంసాశ్రమ ప్రవర్తమాన మునిజన హృదయకమల కర్ణికామధ్య ప్రదీపకుండును, సాత్వతశ్రేష్టుండును, నిఖిల కల్యాణ గుణ గరిష్టుండును, బరమ భక్తియుక్త సులభుండును, భక్తిహీనజన దుర్లభుండును, నిరతిశయ నిరుపమ నిరవధిక ప్రకారుండును, నిజస్వరూపబ్రహ్మవిహారుండును నైన యప్పరమేశ్వరునకు నమస్కరించెద.

2-60-.
విభువందనార్చనములే విభుచింతయు నామకీర్తనం
బే విభులీల లద్భుతము లెప్పుడు సంశ్రవణంబు సేయ దో
షావలిఁ బాసి లోకము శుభాయతవృత్తిఁ జెలంగు నండ్రు నే
నా విభు నాశ్రయించెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్.

2-61-.
పరమేశు పాదయుగ మెప్పుడు గోరి భజించి నేర్పరుల్
లోపలి బుద్ధితో నుభయలోకములందుల జడ్డుఁ బాసి, యే
తాపము లేక బ్రహ్మగతిఁ దారు గతశ్రములై చరింతు; రే
నా పరమేశు మ్రొక్కెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్.

2-62-.
తపములఁ జేసియైన, మఱి దానము లెన్నియుఁ జేసియైన, నే
జపములఁ జేసియైన ఫలసంచయ మెవ్వనిఁ జేర్పకున్న హే
యపదములై దురంతవిపదంచితరీతిగ నొప్పుచుండు
య్యపరిమితున్ భజించెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్.

2-63-.
యవనవ్యాధ పుళింద హూణ శక కంకాభీర చండాల సం
భవులుం దక్కిన పాపవర్తనులు నే భద్రాత్ము సేవించి భా
గవతశ్రేష్ఠులఁ డాసి శుద్ధతనులై కళ్యాణులై యుందు రా
యవికారుం బ్రభవిష్ణు నాదు మదిలో నశ్రాంతమున్ మ్రొక్కెదన్.

2-64-.
తపముల్ సేసిననో, మనోనియతినో, దానవ్రతావృత్తినో,
జపమంత్రంబులనో, శ్రుతిస్మృతులనో, సద్భక్తినో యెట్లు
బ్దపదుండౌనని బ్రహ్మ రుద్ర ముఖరుల్, భావింతు రెవ్వాని
య్యపవర్గాధిపుఁ డాత్మమూర్తి సులభుండౌఁ గాక నాకెప్పుడున్.

2-65-.
శ్రీపతియు యజ్ఞపతియుఁ బ్ర
జాపతియున్ బుద్ధిపతియు జగదధిపతియున్
భూపతియు యాదవశ్రే
ణీపతియున్ గతియునైన నిపుణు భజింతున్.

2-66-.
అణువోగాక కడున్ మహావిభవుఁడో, యచ్ఛిన్నుఁడో, ఛిన్నుఁడో,
గుణియో, నిర్గుణుఁడో, యటంచు విబుధుల్ గుంఠీభవత్తత్త్వమా
ర్గణులై యే విభుపాదపద్మ భజనోత్కర్షంబులం దత్త్వ వీ
క్షణముం జేసెద రట్టి విష్ణుఁ బరమున్ సర్వాత్ము సేవించెదన్.

2-67-.
జగదుత్పాదనబుద్ధి బ్రహ్మకు మదిన్ సంధింప నూహించి యే
భగవంతుండు సరస్వతిం బనుప నా పద్మాస్య దా నవ్విభున్
మగనింగా నియమించి తద్భువన సామ్రాజ్యస్థితిన్ సృష్టిపా
రగుఁ జేసెన్ మును బ్రహ్మ; నట్టి గుణి నారంభింతు సేవింపఁగన్.

2-68-సీ.
పూర్ణుఁ డయ్యును మహాభూతపంచకయోగ;
మున మేనులను పురములు సృజించి
పురములలోనుండి పురుషభావంబున;
దీపించు నెవ్వడు ధీరవృత్తిఁ
బంచభూతములను పదునొకం డింద్రయ;
ములఁ బ్రకాశింపించి భూరిమహిమ
షోడశాత్మకుఁడన శోభిల్లు జీవత్వ;
నృత్త వినోదంబు నెఱపుచుండు

2-68.1-తే.
నట్టి భగవంతుఁ డవ్యయుం డచ్యుతుండు
మానసోదిత వాక్పుష్ప మాలికలను
మంజు నవరస మకరంద మహిమ లుట్ట
శిష్టహృద్భావలీలలఁ జేయుఁగాత.

2-69-.
మానధనుల్, మహాత్ములు, సమాధినిరూఢులు, యన్ముఖాంబుజ
ధ్యాన మరంద పానమున నాత్మ భయంబులఁ బాసి ముక్తులై
లూనత నొంద; రట్టి మునిలోకశిఖామణికిన్ విశంక టా
జ్ఞానతమోనభోమణికి సాధుజనాగ్రణి కేను మ్రొక్కెదన్.

Friday, April 11, 2014

నేను నేనైన నేను

నేను నేనైన నేను

శిష్యుడు:  గురువుగారూ.. మీరు దేవుని చూశారా?
గురువు:  చూశాను, చూస్తున్నాను.
శిష్యుడు:  ఎక్కడ?
గురువు:  ఇక్కడే, నా ఎదురుగానే ఉన్నాడు.
శిష్యుడు:  నేనా?
గురువు:  అవును నేనే.
శిష్యుడు:  నేను నేనా.... అంటే మీరు అవును నేనే అంటున్నారు. నాకు అర్థము కాలేదు కొంచెము వివరించండి గురువుగారూ..

గురువు:  అవును నీలో, నాలో ఉన్న నేనే అసలైన దైవము.  అతడు సర్వాంతర్యామి.  సమస్త భూతములలో, జీవులలో నేనై అంతర్యామిగా వెలుగుతున్నాడు. మనము ఏ కక్ష్యలో నుండి మాట్లాడుతున్నామో ఆ ప్రతిఒక్కటి కూడా నేను గానే వ్యవహరింపబడుతుంది.  శరీరము గురించి చెపుతున్నప్పుడు, నేను అంటాము.  మనస్సు గురించి చెపుతున్నప్పుడు, నేను అంటాము.  ధర్మాధర్మ విచక్షణ చేస్తున్నప్పుడు నేను అంటాము.  ఇలా అనేక సారు నేను, నేను అని చెపుతాము.  కానీ ఇన్ని నేనులుగా ఉన్నవాడికి మూలమైన ఒక నేను ఉన్నది.  అది ప్రతి ఒక్క జీవునిలోనూ  అంతర్యామిత్వము చెంది ఉంటుంది.  అది అన్నిటికి మూలమైన తత్వము.  నీలో, నాలో అందరిలో జీవించి ఉండుటకు మూలమైన తత్వము.  అది అసలైన నేను.  

శిష్యుడు:  కొంచెము వివరించండి గురువుగారు...

గురువు:  ఎవరైనా "నేను" అని ఎలా అనగలుగుతున్నారు?  దేని వల్ల అనగలుగుతున్నారు?  జీవుడు చైతన్య స్వరూపుడు, ప్రజ్ఞా స్వరూపుడు కనుక అనగలుగుతున్నాడు.  చైతన్యానికి మూలము ఏది? అది పరతత్వము.  ఆ తత్వము ప్రకృతికి అతీతమై వెలుగును.  ఆ తత్వము ప్రకృతిచే చేయబడిన విభాగముల (పురములు) యందు దిగివచ్చును కనుక అతనిని పురుషుడు అంటారు.  అతడే పరమ పురుషుడు లేక ప్రధాన పురుష నాయకుడు.  ప్రకృతి, పురుషుడు అను భేధము మాయ వలన పుట్టును. మాయ అతని నుండి క్రీడ కొరకై పుట్టును.  ప్రకృతి నుండియే సృష్టి విభాగములన్నియు పుట్టును.  ఈ విభాగమునకు మూలమైన మొదటి ప్రకృతిని ప్రధానమందురు. అదే మూల ప్రకృతి.  దాని యందు పురుషుడు జీవుడై దిగి వర్తించును.  అతడు విడదీయ వీలుకాని వాడు.  అతని యందు విభాగములు ఉండవు.  తనకు తానే వెలుగు కనుక అతడు వెలిగింప బడడు. అతడు సూక్ష్మ స్వరూపుడు.  వానికి ఇతర వస్తువులుండవు.  కనుక రెండు వస్తువుల నడుమ ఉన్న భేధముచే విడదీయబడడు.  అతడు వస్తువుల మంచి చెడ్డలతో సంబంధము లేని వాడు.  వ్యక్తుల మంచి చెడ్డలతో సంబంధము లేనివాడు.  కలుగుచున్న భావములు, జరుగుచున్న సృష్ట్యాది కర్మలు వానికి పట్టవు.  ఈ ప్రపంచము అంతా వాని మయము.  అట్టివానిని భాగవతమున నారాయణుడు అంటారు.  నారములు అనగా జీవ జలములు.  వాని యందు జీవులకు ఆరోహణ, అవరోహణలను (జనన, మరణములు) కలిగించు తత్వము కనుక దానిని నారాయణుడు అంటారు.  ప్రకృతి, పురుషుడు రెండునూ నారాయణుని యందు వర్తించును కనుక నారాయణుడు ప్రధానమునకు, పురుషునకు నాయకుడు.  వానిని ఆశ్రయించిన మనస్సు కలవాడుగా నుండును కనుక ప్రకృతి పురుషులకు అతీతుడుగా ఉండును.    వాని పేరు "నేను".  అట్టి నేను భగవంతుడు.  అతడే దైవము.  కనుక నీలో, నాలో అందరిలో నేనై వెలుగొందుతున్న వాడే దైవము.  సమస్తమునకు అతడే మూలము. 

అన్నిటి యందు అతడున్నాడు కనుక మనస్సున కందినంతవరుకు వానిని కల్పించుకొని వాని యందు భక్తిని ప్రయోగించి, ఆ పరమ పురుషుని దర్శించి అతనిగా జీవించుటను పరతత్వము సిద్దించుట అంటారు.  అట్లు సిద్దించిన వారు భాగవతోత్తములు.  వారికి మోక్షము నందు ఆసక్తి ఉండదు.  సమస్త సిద్ధులు వారిని ఆశ్రయించి ఉండును.  నిరంతరమైన ఆనందము వారికి సమకూరును.  వారికి మోక్షము నందే ఆసక్తి లేనందున లెక్కలకు, కొలతకకు అందనిదగు స్థితి వారి వశమై ఉండును.  సర్వ శుభలక్షణములు ఆ స్థితియందు ఇమిడి ఉండును కనుక మోక్ష స్థితిని వారు అప్రయత్నముగా పొందుతున్నారు.  వారిని కాల చక్రము మింగదు.  వారు నిత్యులై సాటిలేని సుఖానుభవమున నుందురు.  అట్టి స్థితి మోక్ష స్థితి.  మోక్షమనగా కోరిక వల్ల కలిగేది కాదు, కోరికలు లేక నిరంతరము తనయందు తాను రమిస్తూ నేనైన నేనుగా జీవించు స్థితి.  అట్టి వాడు సమస్తమునందు తనను తాను దర్శించును.  నీయందు నేను, నాయందు నేను ఒకడే కనుక "అవును నేనే" అన్నాను అని గురువు తను చెప్పినది శిష్యునికి అవగతము అగుటకు మౌనమును ప్రసాదించెను.