Wednesday, August 3, 2011

మత మార్పిడి -తప్పెవరిది...మార్చేవాడిదా? మారేవాడిదా?..


ప్రాచీన సాంప్రదాయములో మతము లేదు. ఉన్నది థర్మమే. అది సనాతన మానవ థర్మము. దాని విలువలు సమస్త మానవ జాతివి. తనను తాను ఉద్దరించుకొనవలెనన్న ప్రతి మానవుడు కూడా థర్మమును అనుసరించవలసినదే.

మతము మనిషి మతి నుండి పుట్టినది. మన వాజ్ఞ్మయములో హిందూ అన్న పదము లేదు. ఉన్నది సనాతన థర్మమే. ప్రస్తుతము మనకు కాపాడుకోవలసినది దీనినే. థర్మమును వీడి ఏమి చేసినా అది కర్ర విడిచి సాము చేసినట్లే.

తన మతము మీద సరియైన విశ్వాసము, అవగాహన లేని వాడే మతము మారుస్తాడు లేక మారుతాడు. మతము మార్చేవాడిని ఏమీ చేయలేము. మహాఐతే దుమ్మెత్తి పోస్తాము, లేకపోతే చివరికి పాశవికంగా ప్రవర్తిస్తాము. మారే వాళ్ళగురించి ఆలోచించాలి. అసలు వాళ్ళు మతము ఎందుకు మారుతున్నారు. అది తెలుసుకోవాలి. డబ్బు ఆశ చూపించటము వల్లనైతే అది మార్చేవాడి తప్పు ఎలా అవుతుంది. మార్చాలనుకున్న వాడు ఎప్పుడూ ఎదో ఒక ఆశ చూపించి ఇతరులను మార్చాలనే ప్రయత్నిస్తాడు. కాని మారాలనుకునే వాడు ఆలోచించాలి. తను ఎందుకు మతము మారాలి అని ఆలోచించాలి. తన మతములో లేనిది ఇతర మతములో ఏమున్నది అని ఆలోచించాలి. అందర్ని ఎందుకు మార్చలేరు? కొందరే ఎందుకు మత మార్పిడులకు గురి అవుతున్నరు? అంటే బలహీనుల్ని, తన మతము పైన సరియైన అవగాహన, విశ్వాసము లేని వారిని మార్చ గలుగుతున్నారు. మారే వాడు లేకపోతే మార్చేవాడు ఎమీ చేయలేడు. ఎవరినా బాథలో వున్నప్పుడు కాని, అనారోగ్యముగా వున్నప్పుడు కాని, ఆర్థికముగా ఇబ్బందులలో వున్నప్పుడు కానీ వారి పరిస్థితిని అవకాశముగా తీసుకొని వారికి ఆశచూపి మతము మారుస్తుంటారు. అప్పుడు అలాంటి వారికి బాథ అయినా, అనారోగ్యము అయినా మతము మారటము వల్ల ఉపశమించవు...భగవంతుని అనుగ్రహముతో మాత్రమే మనకు శాంతి లభించగలదు అని

తెలియచేయాలి. వారికి తగిన ఉపశమనము కలిగించాలి. అప్పుడే ఈ మత మార్పుడులను కొంతైనా ఆపగలము.

దానికి మనము ఏమి చేయాలి అని ఆలోచించాలి. ప్రజలలో సరియైన అవగాహన కల్పించాలి. మన మతము యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయాలి. దానికి ప్రభుత్వ సహకారము కూడా కావాలి. ముందు మనవంతు కృషి మనము చేయాలి. అలా చేయాలి, ఇలా చేయాలి అని తర్కించుకుంటూ, వాళ్ళని వీళ్ళని నిందించుకుంటూ కూర్చుంటే పని జరగక పోగా మతము మార్చేవాడు మార్చుకుంటూ పోతాడు. చివరికి మనకు మిగిలేదు మన చర్చే.

ముందు మన ప్రాచీన ఋషులు ఏమి అందించారో అది మనము అవగాహన చేసుకోవాలి. పదిమందికు తెలియచేయగలిగే దశకు చేరుకోవాలి. దానికి తగిన సాథన కావాలి. గ్రంథాలు, ఉపనిషత్తులు చదివి, ఆచరించక ఇతరులకు చెప్పే హక్కు ఎక్కడినుండి వస్తుంది. ఇతర మతస్తులతో ఎప్పుడైనా చర్చించవలసి వస్తే ముందు మీ గ్రంథాలలో ఏమిచెప్పారో మీకే పూర్తిగా తెలియదు, మమ్మల్ని ప్రశ్నస్తారా అని అంటే ఏమి సమాథానము చెపుతాము. చదివి ముక్కున పట్టి అప్పచెప్పినట్లు చెపితే ఎవడికి ఎక్కుతుంది. మన ఋషులు చెప్పినవి మనము ఎందుకు గౌరవిస్తున్నాము... వారు వాటిని ఆచరించి చూపించారు కనుక. శుష్క వేదాంతము చెప్పేవాని మాటలు ఎవరు వినరు, వానిని ఎవరు గౌరవించరు. మాటలు తప్ప చేతలు లేవు అని ఈసడించుకొంటారు.

ఆ మతము వాడు మతము మారుస్తున్నాడు, ఈ మతము వాడు మతము మారుస్తున్నాడు అని ఊక దంపుడు ఉపన్యాసములు ఇస్తున్నామే.. ఒకవేళ వాళ్ళు... మీ భగవద్గీత సారాంశము ఏమిటి?, రామాయణము చెపుతున్న థర్మాలు ఏమిటి?, మహాభారతములో చెప్పిన థర్మ సూక్ష్మములు ఏమిటి?, అసలు మీ మతము యొక్క గొప్పతనము ఏమిటి?... భాగవతము ఏమి బోథించింది?.. మేము మా మత ప్రచారము ఎందుకు చేసుకోకూడదు? నచ్చినవాళ్ళు మా మతములో చేరితే తప్పు ఏమిటి?.... మొదలైన ప్రశ్నలు వేస్తే సమాథానము ఏమి చెబుతాము..మనము చదివినవి బట్టీ పట్టి వాళ్ళ ముందు అప్పచెబుతామా! లేకపోతే మా ఋషులు గొప్పవారు.. వాళ్ళు ఇలా చెప్పారు.. అలా చెప్పారు... మా సంస్కృతి గొప్పది.. భగవంతునికి మా మతము అంటే ఇష్టము అందుకే భారతదేశములో పుట్టాడు అని భగవంతునికి మతము అంటగడతామా...

సరే మీ ఋషులు గొప్పవారు...వారు అందించిన వాజ్ఞ్మయము గొప్పది... కానీ మీరు ఏమి చేశారు.. వాళ్ళు చెప్పినవి ఏమి సాథన చేశారు.. ఆచరించారు..అనుభూతిని పొందారు.. అని అడిగితే సమాథానము చెప్పగల దమ్ము మనదగ్గర వుందా? ఆచరణ శూన్యమైన జ్ఞానము నిరర్థకము. తెలుసుకొన్న జ్ఞానాన్ని సాథన చేసి అనుభూతి పోందిన వాడు మాత్రమే సమాథానము చెప్పగలడు. అటువంటి వాడు చెప్పిన మాట అక్షరమై (నశింపనిదై) అవతలి వాడిని ఆలోచింప చేస్తుంది. అవతలి వాడిలో భయము పుట్టిస్తుంది.

ఆచరించి, అనుభూతిని పొంది భావితరాల వారికి మార్గదర్శకతను అందించిన వారు మతమును పట్టుకొని వేలాడలేదు. మత మార్పిడులు అన్ని కాలాలలోనూ వున్నవి. ప్రస్తుతము కలి ప్రభావము ఎక్కువగా ఉండటము వల్ల "దూరపు కొండలు నునుపు" అన్న నానుడి వలే తన మతములో లేనిది పర మతములో వున్నది అన్న భావనతో మతము మారుతున్నారు. దీనిని మత వ్యభిచారము అంటారు. వారికి నిష్కృతి లేదు.

మతము మారుస్తున్న వాళ్ళను దూషించి, హింసించి మత మార్పిళ్ళను ఆపలేము. మతము మారుటకు సిద్థపడుతున్న వారిలో సరియైన అవగాహన పెంచాలి. తన మత ఔన్నత్యాన్ని తెలియచేయాలి. ప్రపంచానికి హిందూ మతము అందించినదేమిటో తెలియచేయాలి. వారిలో థైర్యమును కలిగించాలి. నమ్మకము పెంచాలి. దానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. మతము మార్చేవాడు ఎంత పట్టుదలతో పనిచేస్తున్నాడో మనము కూడా అంత పట్టుదలతో మన మతాన్ని, థర్మాన్ని కాపాడుకోవాలి. మత మార్పిడి చేస్తున్నవాడి చెంప పగులగొట్టి "కబడ్దార్" అని హెచ్చరించ గలిగే స్థాయికి ప్రతి హిందువూ తయారు కావాలి. అంతటి దమ్ము కావాలి అంటే హిందూ మతము, దాని థర్మము, ఔన్నత్యము తెలుసుకొని ఏ స్థాయిలోనైనా చెప్పగలిగి వుండాలి. ముందు నీ మతములో చెప్పిన సత్యాన్ని గ్రహించు, అంతే కాని వీలయినంత మందిని చేర్చుకుంటే గొప్ప మతము అవదు అని ఎదిరించగలగాలి. ఎదిరించటము అంటే కొట్లాడటము కాదు. తెలియచేయగలగాలి. ఎవరో ఎదో చేస్తారు అని ఎదురు చూడకూడదు. మన ప్రయత్నము అనుస్యూతము సాగించాలి.

మతము మారేవాడు బలహీనుడు. మార్చేవాడు బలవంతుడు. గత 2 లేక 3 శతాబ్దములుగా మనజాతి మానసికముగా బాగా బలహీనపడినది. కనుకనే భారత దేశములో మత మార్పిడులు ఎక్కవైనాయి. కావలసినది శారీరక బలము కాదు.. మానసిక బలము. మా మతములో లేని మీ మతములే ఏమున్నది? మేము ఎందుకు మతము మారాలి అని ప్రతి ఒక్క హిందువూ ప్రశ్నించ గలగాలి. అప్పుడే మత మార్పులను తిప్పి కొట్టగలము.

ప్రపంచమును రక్షించటానికి దాని తల్లి, తండ్రి వున్నారు. దానికి మనము తన్నుకోనక్కరలేదు..మనల్ని మనం రక్షించుకుందాం..ఇతర మతస్తుల వలే దయచేసి మత ప్రచారము వద్దు.. ధర్మ ప్రచారము చేయండి.. అదే రక్షిస్తుంది... మతము కాదు...మనకు థర్మమే మతము.. మతమే థర్మము.

"ధర్మో రక్షితి రక్షితః" అన్నారు.. "మతో రక్షితి రక్షితః" అనలేదు.

ఎక్కడ ఎక్కువగా మతము మార్చబడుటకు అవకాశము కలదో అక్కడ ఎక్కువగా అవగాహన కలిగించాలి. చర్చల కంటే కార్యాచరణమే ఎక్కువ ఫలితాలనిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ పూనాలి. కార్యరంగములోనికి దిగాలి. అప్పుడే మన సంస్కృతిని కాపాడుకోగలము.