Tuesday, July 21, 2009

విదురనీతులు2


విదురనీతులు మరికొన్ని ......


  1. మనిషికి గాయమైనచో కాలక్రమమున గాయము మానును. మనసుకు గాయమైనచో గాయము జీవితాంతము వరకు మాయదు. మానవుడు మాటలతో చేయు గాయములు అస్త్రములకన్న పరుషములు. ప్రియభాషణము చేతకనివారు మౌనము వహించుట ముఖ్యము.
  2. అన్ని ఆధ్యాత్మిక సాధనలకన్న సమభావము మిన్న. సమభావం కలవాడు సమస్తాన్నీ జయిస్తాడు. భర్త ప్రేమను కోల్పోయిన స్త్రీ, ధనము కోల్పోయిన జూదగాడు, మాటను కోల్పోయిన మానవంతుడు నిదురించలేరు.
  3. పొరాడు బుద్ధి, తీవ్రమగు పగ, స్పర్ధను పెంచు గుణము, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపములు, మద్యపానము,సోదరుల నడుమ భేదమును పుట్టించుట వర్జనీయమగు కార్యములు.
  4. జ్ఞానవంతుని మత్సర మావరించుట వెలుగును చీకటి క్రమ్ముట వంటిదే
  5. సాయం సంధ్యయందు చీకటి వెలుగును మ్రింగినట్టు జ్ఞానవంతుని మత్సరమను చీకటి మ్రింగును.
  6. హస్త సాముద్రికవేత్త, దొంగవ్యాపారి, మూఢ విశ్వాసములు కలవాడు, శత్రువు, స్నేహితుడు, నటుడు, వైద్యుడు న్యాయస్ధానమందు సాక్షులుగ నిలుచుట సముచితము కాదు
  7. మంత్ర మననము, అగ్నికార్యము, శాస్ర పఠనము, సత్కార్యములు రక్షణ పొందుటకు సాధనములు. కాని డాంబికముగా ప్రచారముకై చేసినచో మనిషి యందు స్పర్ధ పెరుగును.
  8. ఇళ్లకు నిప్పు పెట్టువాడు, ఇతరుల మనస్సులయందు విషము కల్పించువాడు, విద్యను అమ్ముకొనువాడు, పదునైన ఆయుధములు తయారు చేయువాడు, స్పర్ధను పెంచువాడు, విశ్వసించిన వానిని మోసము చేయువాడు, స్త్రీల నవమానించువాడు, గర్భస్రావములు గావింపువాడు, గురుపత్నిని కామించినవాడు, ఇతరులను అదేపనిగ బాధ పెట్టువాడు, సద్గ్రంధములను తూలనాడు వాడు, లంచగొండియైన అధికారి, గాయత్రిని గానము చేయని బ్రాహ్మణుడు, రక్షింపని క్షత్రియుడు-నేరస్తులు. వీరు శిక్షార్హులు.
  9. చీకటియందు కనుపింపచేయునది అగ్ని. ప్రవర్తన మందు విశదమగునది ధర్మము. చేతలయందు ఆవిష్కరింప బడునది సత్సంకల్పము. అపాయమునందు అవతరించునది ధైర్యము. కష్టముల యందు తెలియబదునది ప్రశాంతత. అత్యవసరమున నిలబడునది స్నేహము. ఇట్లాయా సమయములందు ఆయా గుణములు తెలియబడును. కేవలము మాటల వలన గుణములు తెలియబడవు.
  10. సమస్త కార్యములకు సత్సంకల్పములు ఆధారమైనచో మానవునకు శాంతి దక్కును. లేనిచో అశాంతియే. శాంతము లేక సౌఖ్యము లేదు.
  11. మనసుయందు, మాట యందు మడతలు కలవారు వేదములు వల్లించిననూ, శాస్త్రములు పఠించిననూ, సద్గ్రంధ శ్రవణము గావించిననూ సుఖము లేదు. అట్టివానికి పతనము తప్పదు.
  12. దినమంతయు ధర్మాచరణతో జీవించు సత్పురుషుడు రాత్రి సమయమున సుఖముగా సులభముగ నిద్రించుగలడు.
  13. ధర్మాచరణము వర్షాకాలమునందు ఛత్రము వంటిది.
  14. మధ్యవయసున నొనరించిన సత్కార్యములు ధర్మాచరణము వౄద్దాప్యమున సుఖమగు జీవనము నిచ్చును.
  15. ఆజన్మమూ ధర్మాచరణము గావించువానికి మరణించిన వెనుక గూడ సుఖము, ఆనందము యుండును.
  16. ధర్మాచరణము దైవసాన్నిధ్యము నందించుచుందును. సాన్నిధ్యమునకు ధర్మాచరణమే ప్రధానము.
  17. రక్షణ చేయు రాజు, బోధన చేయ గురువు, సేవలనందించు సేవకుడు, నామమాత్రపు లాభముతో వ్యాపారము చేయు వైశ్యుడు- భువియను ఉద్యానవనమున బంగారు పూవులను పొందుదురు
  18. కర్మలు నాలుగు. శరీరముతో చేయునవి, ఇంద్రియములతో చేయునవి, మనస్సుతో చేయునవి మరియు బుద్ధితో చేయునవి. ఇందొకదానికన్న మరియెకటి అదే క్రమమున శ్రేష్ఠమైనది.
  19. సంస్కారయుతమైన కుటుంబమున జన్మము, రూప సౌందర్యము, ప్రవర్తనమున సత్యము, శాస్త్ర పఠనము, ఆత్మపరిశీలనము, సత్సీలము, మనోబలము, ధైర్యము, మృదుభాషణ, సత్సంపద గల జీవనము స్వర్గ జీవనము. అట్టివానికి భూతల జీవనము స్వర్గము.