Monday, July 20, 2009

గాయత్రి2

గాయత్రి1 కు తరువాతి వివరణ....


ధ్యానము చేయటం అంటే స్విచ్ వేయటం వంటిది. వేస్తే భర్గోదేవుడు సవితృ అనే దేవుడ్ని వెలిగిస్తాడు. వెలిగిస్తే సవితృ అనే దేవత మొత్తం వెలుగుగాశిరస్సు నుండి దిగివచ్చి శరీరమంతా ప్రవేశిస్తుంది. అలా వెలుగు ప్రవేస్తే శరీరం కాంతివంతమవుతుంది. కళ పెరుగుతుంది. రంగు కూడా మారుతుంది.ఇలా లోపలి వెలుగు పెరగటం వల్ల విపరీతమైన ఆకర్షణ ఉంటుంది. వారి నుండి కాంతి ప్రసారము జరుగుతుంది. కారణం గాయత్రి వెలుగు.


"
ఓమ్ తత్సవితు ర్వరేణ్యం భర్గో దేవస్య థీమహి థియః యోనః ప్రచోదయాత్" "మా" బుద్దులను ప్రచోదనము చేయు గాక! సామూహికముగా గాయత్రిచేసిన మంచి ఫలితముల నిచ్చును. దీని వలన తిరుగులేని మంచి జీవితము ఏర్పడును.


ప్రతి మనిషిలోను పదార్దము (Matter), దానిని నడిపించే శక్తి (Force) ఉన్నది. శక్తి వలననే దేహము కదులు చున్నది. శక్తిని ప్రేరేపించిపనిచేయించే దానిని ప్రజ్ఞ (Consiousnes) లేక చైతన్యము అంటారు. ప్రజ్ఞ నుండి అందిన ఆదేశము మేరకు శక్తి దేహమును పనిచేయించును. ఈమూడింటిని నడిపేటువంటి దాన్ని నడుపుతుంది గాయత్రి. అందువల్ల గాయత్రి మంత్రములో ముందు మూడింటిని తలుస్తాము. "ఓమ్భూర్భువస్సువః" భూ: అనగా పదార్దము (matter), భువః అనగా శక్తి (force), సువః అనగా మనలో వున్న చేతన లేక ప్రజ్ఞ (consiousnes).దాన్ని ప్రచోదము చేసి నడిపించేది సవితృ దేవత. సవితృ దేవతను వెలిగించేది భర్గోదేవుడు.


గాయత్రి చేయుటవలన మొత్తం సృష్టికే దైవమైన భర్గోదేవుడు మనలోనికి వెలుగుగా దిగివస్తాడు. వెలుగు మన బుద్దులను ప్రచోదనము చేస్తే బుద్దిమన తెలువిని, మన శక్తిని, మన శరీరాన్ని అవి నడిపిస్తాయి. మనలో మూడు లోకలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. నాభికి క్రింద వున్నదిభూలోకము. నాభికి కంఠమునకు మద్య వున్నది శక్తిమయ లోకములు. కంఠము నుండి భ్రూమద్యము వరకు వున్నవి సువర్లోకము అని చెబుతారు. మూడు లోకములని పరిపాలించే దైవము వెలుగుగా భ్రూమద్యము నందు ఉన్నాడు. వెలుగుగా ఉండే దైవము వెలగకుండా కూడా సహస్రారమునందు ఉన్నాడు అని భావము చేసి మొత్తం వెలుగుని ధ్యానము చేస్తూ పాదముల వరకు దింపుకొని రావాలి. మంత్రము చేసినప్పుడల్లా ఇలాభావము చేయాలి. శిరస్సు నుండి దిగిన వెలుగు భ్రూమద్యము చేరి అక్కడి నుండి అది మొత్తము శరీరం అంతా వ్యాపించి అంటే చేతి వేళ్ళ చివరివరకు, కాలి వెళ్ళ చివరి వరకు కూడా చేరి మొత్తం దేహమంతా వెలుగుతో నిండినట్లు భావన చేయాలి. అంటే వెలుగు స్నానం అన్నమాట. షవరు క్రిందస్నానం చేసినట్లు. మామూలు స్నానము నీటితో చేస్తే, స్నానము వెలుగు స్నానము. అది బాహ్య శుద్దికి, వెలుగు స్నానము అంతఃశుచికి.ఇటువంటి వెలుగు స్నానం ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి జాతి, మత, కుల, వర్గ విభేదములు ఎమీ లేవు. ఆడా వారు కూడా మగవారిలా గాయత్రిమంత్రము చేసుకోవచ్చు. దీనిని మన ఋషులే అంగీకరించారు. అనేక దేశములలో ఎంతో మంది గాయత్రి మంత్ర గానము చేయుచున్నారు.


అలా వింటూ పైన చెప్పిన విధంగా భావిస్తూ గాయత్రి చేసి కన్నులు మూసి ధ్యానించాలి. అప్పుడు వెలుగు లోపల నుండి ఒక జలపాతం లాగా శిరస్సునుండి ముఖం లోకి, కళ్ళలోకి, చెవులు, ముక్కు, మెడ ఇలా మధ్యగా ఒక కాంతి రేఖ వలే దిగుతూ ప్రక్కల కూడా వెలుగుతో నింపు తున్నట్లు ధ్యానంచేయాలి.


గాయత్రి మంత్ర గానము వల్ల జనించిన శబ్ద తరంగములు పరిసరములను పరిశుబ్రపరచును. లోపలి ధ్యానము వల్ల అంతరంగము పరిశుద్దమగును.షట్చక్రములలో చెప్పబడిన కమలములు వికసించాలంటే లోపల వెలుగు ధ్యానము అవరసరము. కమలము వికసించటానికి సూర్యుని కాంతి కావలెనుకదా? అలగే లోపలి కమలములు వికసించటానికి మనం చేసే వెలుగు ధ్యానము అవసరము. అప్పుడు అన్ని చక్రములు కూడా కమలములై అవివిచ్చుకొని జీవుడు ఆనందమయుడవుతాడు.


త్రిసంధ్యలలో గాయత్రి మంత్ర ధ్యానము చేయవలెనని పెద్దలు తెలిపారు. సూర్యోదయ సమయంలో ఒకసారి, మధ్యాహన్నం సూర్యుడు నడినెత్తిపైఉన్నప్పుడు ఒకసారి మరియు సాయత్రం సూర్యాస్తమయ సమయంలో ఒకసారి చేయవలెను. కుదరని వారు రోజుకు ఒక్కసారైనా గాయత్రిని గానముచేసిన మంచి ఫలితముల నిచ్చును. సూర్యోదయ సమయంలో గాయత్రిని జపించి దినచర్య ప్రారంభిస్తే చాలా మంచిది.

24 అక్షరముల గాయత్రి మంత్రము పంక్తి (line)కి ఎనిమిది అక్షరములుగా మూడు పంక్తులలో ఇవ్వబడినది. గాయత్రి ఛందస్సు అనగా ఎనిమిదిఅక్షరముల పంక్తి. ఎనిమిది అక్షరములలో మద్యలో ఆపకుండా ఉఛ్చరించవలెను. ఎనిమిది అక్షరములు ఐన తరువాత ఆపకుండా ఉండకూడదు.అది ఒక నియమము.


తత్సవితు ర్వరేణ్యం
భర్గో దేవస్య థీమహి
థియో యోనః ప్రచోదయాత్


"
ఓమ్" తో మొదలు పెట్టవలయును. ఓంకారమే బ్రహ్మము. "భూర్భువసువః లోకములను వెలిగించు సవిత అనే వెలుగు నన్ను వరించి(కౌగిలించుకొని) నా యందు బుద్ది ప్రచోదనము చేయవలెనని సమస్త వెలుగులకు మూలమైన భర్గోదేవుని ధ్యానము చేయుచున్నాను(ము)." అనుభావము మంత్రము గానము చేసే ప్రతిసారీ భావము చేయవలెను. గాయత్రియే మనలోని సంకల్ప శక్తి. మన చైతన్యమును నడిపించేది గాయత్రి.


గాయత్రి ధ్యానము సకల శుభములను అందించును. బుద్దిని ప్రచోదనము చేసి జీవితమును ఆనందమయము చేయును. మనిషికి విచక్షణ పెరిగిసమాజోభివృద్దికి పాటుపడును. తద్వారా ప్రపంచమున శాంతి వృద్ది పొందును.