Thursday, March 29, 2012

సద్గురు సమక్షమున స్వభావము

దేవాలయమునకు కాని, సద్గురు సమక్షమునకు కాని వెళ్ళినచో మనకు తెలియని ఎదో ఒక ప్రశాంతత ఉంటుంది. సమయములో ఎంతో ఊరట పోందుతాము. హాయిగా ఉంటుంది. ఎప్పుడూ ఇలాగే ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకు? ప్రశాంతత ఇతర సమయాలలో ఎందుకు ఉండదు? కారణము ఏమిటి? అటువంటి ప్రశాంతతను కోల్పోవుటకు గల కారణమేమి? స్వభావము. జీవుని యొక్క స్వభావమే కారణము. సాథారణముగా దైవీ స్వభావము యొక్క సమీపములో జీవుని స్వభావము తన ఉనికిని కోల్పోతుంది. ఎప్పుడైతే స్వభావము యొక్క ప్రభావము ఉండదో అప్పుడు జీవుడు తనకు తానుగా దైవము యొక్క సాన్నిధ్యములో ప్రశాంతముగా ఉంటాడు. సాన్నిధ్యము దూరమైనప్పుడు తిరిగి స్వభావము పనిచేస్తుంది, కనుక తిరిగి యధాప్రకారము ప్రవర్తిస్తాడు. ఎంతటి దుర్మార్గుడైనా దైవసాన్నిధ్యములో కొంత ప్రశాంతత పొందుతాడు. సద్గ్రంధ పఠనము వల్ల కూడా ప్రశాంతత వస్తుంది.

పెద్ద వెలుగులో చిన్న వెలుగు ఎలా ఇమిడిపోతుందో అలా దైవము లేక సద్గురు సాన్నిధ్యములో జీవుని స్వభావము తన ప్రభావము లేక ఉంటుంది. అసలు స్వభావము అంటే ఏమిటి? "స్వ"భావము. అంటే తన సోంత భావము. తనకు నచ్చినవి, నచ్చనివి. బాగా ఆలోచిస్తే సమస్త భావములు, ఆలోచనలు, పనులు, మాటలు అన్నీ కూడా రెంటిని అనుసరించే ఉంటాయి. నచ్చినవారితో ఒకరకంగా, నచ్చనివారితో ఇంకోరకంగా ప్రవర్తిస్తాము, మాట్లాడతాము. ఆలోచన లేక భావము మంచిదే అయినా అది మన స్వభావము ద్వారా మార్పుచెంది బయటకు వ్యక్తము అవుతుంది. స్వశ్చమైన నీరు చిలుము పట్టిన గొట్టము ద్వారా వచ్చినట్లు. నీరు వచ్చిన వాహికననుసరించి కదా వాటి నాణ్యత. స్వభావము నిర్మలమైనచో నిర్మలమైన భావములు, లేనిచో స్వభావముచే ప్రభావితమై బయటకు వస్తాయి. మనకు నచ్చినవాళ్ళే అయినా మనకు నచ్చినట్లు ఉండకపోతే తేడా వస్తుంది. కారణము స్వభావము. అన్ని సందర్బములలో కాకపోయినా కొన్ని సందర్బములలో మన స్వభావము మనకు చాలా ఇబ్బంది, బాధను, చిరాకును కలిగిస్తుంది. ఉదాహరణకు మనము పెంచుకొనే కుక్క మనల్నే కరుస్తుంది....అలా. మీకుక్కే కదండి, కట్టేయండి అంటే... లేదండి, అని నన్నే కరుస్తుంది అన్నట్లు, అని మనల్నే కాదు, ఇతరులను కూడా బాధిస్తుంది. మన ప్రవర్తన మన స్వభావన్ని అనుసరించి ఉంటుంది.

జీవుని స్వభావము జీవునిదే. అది జీవుని పూర్వ సంస్కారముచే ప్రభావితమై పనిచేస్తుంది. అనేక జన్మలలో చేసిన కర్మలచే ప్రభావితమైన స్వభావము జీవుని తనకు బద్దుని చేసుకొని ఆడిస్తుంది. నిజమునకు స్వభావము జీవుని ఆథీనములో ఉండవలెను, కానీ జీవుడు దాని ఆథీనమై అది చెప్పినట్లు ఆడుతూ అనేక అవస్థలు పడుతూ, చస్తూ, బతుకుతూ ఉంటాడు. అభ్యాసవశముచేత అదే నిజమనే భమలో జీవుస్తూ ఉంటాడు. ఎవరు చెప్పినా వినడు. ఎందుకంటే వినాలని అనిపించదు. కానీ అటువంటి వాడు ఎప్పుడైనా, దేవాలయములో కాని, గురువు యొక్క సమక్షములో కానీ ఉన్నచో కొంత ఊరటచెంది తెలియని హాయిని అనుభవిస్తాడు. ఇలాగే ఉంటే బాగుండు, అని భావిస్తాడు. అక్కడనుండి ఇవతలకు రాగానే మళ్ళీ మామూలే... కుక్క తోక వంకర... ఒక్కొక్కసారి.. అబ్బా ఎంత బాగున్నాడు, మనమే అతనిని అపార్థము చేసుకొన్నాము అని అనుకుంటాము.. కానీ సమయము వచ్చినప్పుడు అతని స్వభావము పనిచేసి నేను ఇది... అని తెలియచేస్తుంది. త్రిగుణములలో గుణముచే ఎక్కువగా ప్రభావితము చెంది ఉంటాడో అది స్వభావమును నడిపిస్తుంది. సత్వరజస్తమో గుణములలో ఒక్క సత్వగుణము మాత్రమే జీవునికి శాంతిని కలిగిస్తుంది.

సద్గురువు, తన స్వభావము లేక, దైవీతత్వము నందు నిరంతరము ఉండుట చేత అతని సమక్షములో మన స్వభావము పనిచేయదు. దైవీస్వభావము మనపై ప్రసరించుటచేత మనకు ప్రశాంతత లభిస్తుంది. ద్వందాతీతుడై ఉంటాడు సద్గురువు. సమస్తము నందు అంతర్యామిని దర్శిస్తూ తాను లేక దైవమునకు వాహికయై ఉంటాడు. కనుక అతని సమక్షమున శాంతి లభిస్తుంది. గురువు చెప్పినవి ఆచరించాలి అనిపిస్తుంది. ఎంతో గొప్ప అనుభూతిని పొందాము అని అనిపిస్తుంది. శిష్యుడైతే గురువునకు సమర్పణచెంది ఉంటాడో అతని యొక్క స్వభావము సద్గురువుచే తీర్చిదిద్దబడి ఆనందానుభూతి, శాంతి లభిస్తుంది. ఊరకుక్క లాంటి స్వభావన్ని జాతికుక్కగా మారుస్తాడు. ఊరకుక్క అంటే ఊరికే ఊరంతా తిరిగి వచ్చేది. ఎవరిని చూసినా అరచి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి పనిలేనిది. ఉన్నచోట ఉండదు. కానీ జాతికుక్క అలాకాదు. ఇంటిపట్టున ఉంటుంది. అవసరమైతేనే అరుస్తుంది. లేకపోతే అలా ఉంటుంది. అంటే మన ఆథీనములో ఉంటుంది. ఎంత తేడా? స్వభావములో మార్పురానిదే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎంతమంది గురువులకు పాదనమస్కారములు చేసినా ఉపయోగము లేదు..లేదు..లేదు. ఎందుకంటే అవి చేసినంతసేపు మాత్రమే సరిగా ఉంటున్నాము, తరువాత యథాతథముగా ప్రవర్తిస్తున్నాము. అన్ని వేళలయందును సద్గురు సాన్నిధ్యమును, లేక దైవ సాన్నిధ్యమును భావించినచో స్వభావము సరియగుటకు అవకాశము కలదు. నిరంతర సాన్నిధ్యము వలన మార్పునకు అవకాశము కలదు. సద్గురువు మార్గమును మాత్రము చూపును, సాథన మనవంతు. అప్పుడప్పుడూ కాకుండా సాథన నిరంతరము సాగవలెను. శ్రద్ద, భక్తి రెండునూ చాలా ముఖ్యము. గురువు అందిన సాథన చెప్పినది చెప్పినట్లు చేయవలెను కాని, దానిలో మనకు నచ్చినది చేయరాదు. నచ్చటము, నచ్చకపోవటము అన్నది స్వభావము వల్ల కలిగిన మానసిక రోగములే.

స్వార్థము, సంకుచితత్వము, అసూయ, ద్వేషము, కామము, క్రోధము మొదలగు మానసిక రోగములన్నియు జన్మ సంస్కారములచే, స్వభావము నందు కరుడు కట్టి ఉండుట వలన జీవుడు బంధింపబడి సంసారమున దుఃఖమును అనుభవిస్తున్నాడు. పై చెప్పిన మానసిక రోగములు కుదిరిన పిమ్మట స్వచ్చమైన, శుద్దమైన, నిర్మలమైన స్వభావము కలిగి దైవీతత్వమును ప్రతిబింబింపగలడు. అలలతో కూడిన సరస్సు నిశ్చలమైన ఆకాశమును ప్రతిబింపలేదు. అలలు ఆగిన పిమ్మట అందు కనిపించేదు నిర్మలమైన ఆకాశమే. కనుక స్వభావము నందు మార్పుకు ప్రతి ఒక్కరు చేయవలసినది సద్గ్రంధ పఠనము, సద్గురు సమాశ్రయము. ఎంత సాథన చేసిననూ స్వభావమును దాటుట చాలా కష్టము, కాని సత్సాంగత్యము వల్ల మానసిక రోగములు తగ్గి జీవుడు స్వస్వరూపమును తెలుసుకొనగలడు. అంటే స్వభావమును దాటి తన స్వరూపమును తెలుసుకొనగలడు. అటువంటి వాడు ఇంకొకరికి మార్గదర్శనము చేయించగలడు. జాతిని దైవము వైపు నడిపించగలడు.