Friday, March 9, 2012

టెలీఫోను - అథిక ప్రసంగాలు

Over Communicative Syndrome

Over Talking Syndrome

1876 లో అలెగ్జాండర్ గ్రహంబెల్ టెలిఫోన్ కనిపెట్టినప్పుడు, రాబోవు తరాలలో మానవజాతి దీనివల్ల ఎంత అభివృద్ది చెందుతుందో ఆలోచించాడే కాని, విచ్చలవిడిగా వాడి మానసిక రోగానికి గురి అవుతారని ఊహించి వుండడు. గత పది సంవత్సరాలలో పెరిగిన టెలిఫోన్ కంపెనీలు మరియు వాటి వాడకము వల్ల తెలుస్తుంది. ఎన్ని కుంభాకోణాలు వెలుగుచూపాయో ప్రత్యేకంగా చెప్పుకొనవలసిన పనిలేదు. ఉపయోగపడ వలసిన వస్తువుచేత ఉరి తీయబడుతున్నామన్నమాట. టెలిపోన్ అన్నది లేనప్పుడు మనుషుల మధ్య సమాచారము ఎంత అవసరమో అంతే వుండేది. అదీ ఉత్తర ప్రత్యుత్తరముల ద్వారా. ఎంతటి సంతోషకరమైన విషయమైనా, విచారకరమైన విషయమైనా తెలియటానికి సమయము పట్టేది. అది కొంత లోపమైనా ఆనందము వేరుగా వుండేది. కానీ ప్రస్తుతము అనుక్షణము సమాచారము అందింపబడుతూ, అవసరానికి మించి మాట్లాడుతూ ఎంత సమయాన్ని వృథా చేస్తున్నామో ఎవరూ ఇంకొరికి చెప్పనవసరము లేదు.

పూర్వము ఎక్కడో ఒకచోట మాత్రమే... అంటే పోస్టాఫీసులోనో, లేక ఎవరైనా ధనికుల దగ్గరో, ఆఫీసులలోనో మాత్రమే ఫోను సౌకర్యము వుండేది. కానీ ప్రస్తుతము మొబైల్ పరికరములు పెరిగినతరువాత ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఫోన్ వుంది. దాంతో సమాచారము మెరుపులా ప్రపంచము అంతా వ్యాపిస్తోంది. దానివల్ల ఎంత లాభము వుందో అంత నష్టము కూడా వుందన్న సంగతి మరిచిపోయాము. అవసరానికి మించి మాట్లాడుతున్నాము. "అతి సర్వత్ర వర్జయేత్" అన్నది ఉపనిషద్వాక్యము. అతిగా మాట్లాడటము అనర్థదాయకము. మాట ఎంతో విలువైనది. దానికన్నా విలువైనది సమయము. అవసరానికి మించి మాట్లాడుటవలన సమయము, శక్తి రెండూ వృధా అవుతాయి. ప్రశాంతతనిచ్చే నిశ్శబ్దాన్ని కోల్పోతాము. అతిగా తింటే ఆహారము కూడా విషమవుతుంది.

ఫోను దొరికితే చాలు గంటలు, గంటలు మాట్లాడతాము. అందులో ఎంతవరకు అవసరము. 99% అనవసర ప్రసంగమే వుంటుంది. అవసరమైన విషయము అయిపోగానే... ఎదో ఒకటి మాట్లాడాలని మొదలు పెడతాము. మీ కుక్క ఎలా వుందండి?... మొన్న అది బాల్కనీలో వుంది అన్నారు.... ఇంట్లోకి వచ్చిందా? తరువాత ఎలావుంది? మీ పిల్లి బాగా గోకుకుంటోంది అన్నారు... గజ్జి తగ్గిందా? డాక్టరుకు చూపించారా? ఏమన్నాడు? మందులు సరిగా వాడండి.... అలా ఊదర కొడతారు. ఇందులో ఎదైనా పనికొచ్చేది వుందా? ఎందుకు అంటే .. ఎమీలేదు అతనితో కొంచెము అలా వుంటూవుంటే ఎప్పుడైనా అవసరము రావచ్చు... అందుకని...అని చెప్పేవాళ్ళూ వున్నారు. అవసరము దాటిన మాటలన్నీ ఇలాగే వుంటాయి. ఆడవాళ్ళు మొదలు పెట్టారంటే అంతే...చుట్టూ వున్నవాళ్ళు చచ్చారంతే... రోజూ మాట్లాడుకున్నా గంటలు, గంటలు మాట్లాడగలరు. నిశితంగా పరిశీలిస్తే అసలు అన్ని విషయాలు ఎలా తడతాయా అని పిస్తుంది. ఫోనులో గంట మాట్లాడి.. వెంటనే కలిశారనుకోండి... మళ్ళీ మొదలు.. ఎంత ఓపిక? ఎంత ఖాళీ సమయము? వాళ్ళకో నమస్కారం. Incoming Free, Locals Free ఇంక మాట్లాడుకోక ఏమి చేస్తారు. అదేమంటే తోచదు అంటారు. బద్దకము వదలి ఎదో ఒక పని చేసుకునే వాళ్ళకి తోచకపోవటము వుండదు. అలాంటి వాళ్ళకు ఫోను చేస్తే, ఇప్పుడు కొంచెము పనిలో వున్నాను మళ్ళీ చేయండి అని పెట్టేస్తారు. ఎప్పుడు చేసినా అవసరానికి మించి మాట్లాడరు. అలాంటి వాళ్ళు తక్కువగా కనబడతారు.

పెద్దవాళ్ళ దగ్గరనుండి పిల్లల వరకూ కూడా cell ఫోన్ వాడుతున్నారు. పిల్లలు కూడా అతిగా మాట్లాడుతూ ఎటు వెళుతున్నారో తెలియకుండా పోతున్నది. ఎక్కువగా ఒంటరిగా వుండటానికి ఇష్టపడుతున్నారు. దీనివల్ల కుంటుంబములలో పిల్లలకు, పెద్దలకు దూరము పెరుగుతోంది. దానికి తోడు cell phone లో internet. అది మరీ దరిద్రము. ఎంత దుర్వినియోగమవుతోందో ఊహకందనిది. సమాచార వ్యవస్థ పెరిగినందుకు ఆనందించాలో, ఏడవాలో తెలియని ఒక సందిగ్దావస్తలో ప్రస్తుతము మానవుడు కొట్టుమిట్టాడుతున్నాడు. తను తీసుకున్న గోతిలో తానే పడి పైకి రాలేక చస్తున్నాడు. బంగారపు కత్తిని తయారుచేసి దానితో పొడుచుకొని, ప్రాణముపోయి చస్తున్నానన్న విషయము మరచి బంగారపు కత్తితో పొడుచుకున్నాను అహా.. అని సంబర పడుతున్నాడు. ఆలాంటి వాడిని ఏమనాలి? సమయము దాటి పోయినది... ఏమీ చేయలేము అని జాలి పడటము తప్ప. తను తయారుచేసుకున్న సాంకేతిక పరిజ్ఞానమే తనను దహించివేస్తోందన్న సంగతి మానవుడు గ్రహించనంత వరకూ ఎవ్వరూ బాగుచేయలేరు.

అసలీ తప్పంతా cell phoneదే కదా! అదే లేకుంటే అందరూ బాగుండేవారే కదా అని అనుకోవచ్చు. తప్పు వస్తువుది ఎట్లా అవుతుంది. దాని ఉపయోగించే వాడిదే తప్పు. కత్తిని ఉపయోగించి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు శిక్షార్హుడు ఎలా అవుతాడు. అదే కత్తితో హత్య చేసిన వాడు శిక్షింపబడతాడు. అప్పుడు తప్పెవరిది. కత్తిదా... ఉపయోగించినవాడిదా? సృష్టిలో మానవునికి అందింపబడినది ఏదీ కూడా పనికిరానిది కాదు. కానీ దాన్ని సరియైన పద్దతిలో ఉపయోగించుకోవలసినది మానవుడే. వాడుకోవటము తెలియకపోతే దానికే బలి అవుతాడు.

అతిగా మాట్లాడటము కూడా ఒక జబ్బే. దానికి ఇంతవరకు వైద్యశాస్త్రము మందు కనిపెట్టలేదు. ఒకవేళ జబ్బుకు పేరు పెట్టవలసి వస్తే దానికి Over Talking Syndrome అని పెడితే బాగుంటుంది. Over Communicative Syndrome అని కూడా అనవచ్చు. కానీ ఇది సమాచార మాధ్యమలకు వర్తిస్తుంది. అల్లోపతి, యునాని, హోమియోపతి, ఆయుర్వేదము మొదలగు వైద్యశాస్త్రము జబ్బును తగ్గించలేదు. ఒక్క యోగశాస్త్రము మాత్రమే దానిని పూర్తిగా నిర్మూలించగలదు. విచిత్రమేమిటంటే ఇది ఒక జబ్బు అని మనకి తెలియదు. మనకుంది అని అసలు తెలియదు. తెలిస్తే కదా మందు వాడేది. అంతా విష్ణుమాయ. ఎందుకండీ... టెలిఫోనులో అలా మాట్లాడుతూ సమయాన్ని వృధా చేస్తారు అని అంటే... అవతలి వారికి కోపము వస్తుంది. అదో గోల మళ్ళీ...

ప్రతి ఒక్కడూ థనము పొదుపు చెయ్యలని ఆలోచిస్తాడే కాని, అంతకన్నా విలువైన మాటను పొదుపు చెయ్యాలని ఆలోచించడు. ఎందుకంటే మాట భగవంతునిచే మానవునికి ఇవ్వబడిన వరం. అంతేకాని కష్టపడి సంపాదించుకున్నది కాదు కదా! థనాన్ని తాను సంపాదించాను అన్న భ్రమలో దాన్ని పొదుపు చెయ్యాలి అని ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని మరచి ఎలావుంటుందో తెలియని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వుంటాడు. ఎంత విచిత్రం? ఎంత అజ్ఞానం? భౌతికలోకంలోనే ఇంత మాట్లాడుతుంటే... ఇక మానోలోకంలో ఎలావుంటారో? ఎన్ని రకాల ఆలోచనలతో సతమతమవుతుంటారో? ఎవ్వరూ ఎవరినీ మార్చలేరు. ఎవరికి వారు తెలుసుకొని మారవలసినదే.

ఇలా ఎంత రాసినా అంతము లేదు. సమస్తము నిశ్శబ్దము నుండే వచ్చింది. జ్ఞానము కావాలంటే నిశ్శబ్దాన్ని అలవాటు చేసుకోవాలి. అది ఒక్క మౌనము వల్లనే సాధ్యము. మానసిక మౌనము కలవానికే భౌతిక మౌనము సాధ్యము. ఆలోచనా ప్రవాహములో కొట్టుకొని పోయేవాడు మౌనముగా వుండలేడు. ఒకవేళ మౌనవ్రతము పాటించినా అది భౌతికమే కానీ మానసికము కానందువల్ల రక్తపోటు వస్తుంది. అవసరమైనంత వరకే మాట్లాడి సమయాన్ని, శక్తిని వృథా చేసుకోకూడదని ఎవరికి వారే ఆలోచింకోవాలి.