Thursday, November 10, 2011

11-11-11 దైవాను సంధానమునకు చక్కని రోజు...

సంఖ్యా శాస్త్ర ప్రకారము 11, 22 మరియు 33 చాలా ముఖ్యమైన సంఖ్యలు. దానిని మాస్టరు నెంబర్లు అంటారు. ఇది మనిషి యొక్క బాహ్య ప్రపంచానికి, లోపలి ప్రపంచానికి వారధిగా పనిచేస్తాయి. మనిషి తన అంతరంగములోనికి ప్రయాణము చేయుటకు సంఖ్యల యొక్క తరంగములు బాగా ఉపయోగపడతాయి. మనిషి తనలోని ఊహాశక్తిని, శ్రద్ధను, ఆధ్యాత్మికత మొదలగునవి పెంచుకొనుటకు ఇవి చాలా దోహదమును అందిస్తాయి.

ఈరోజున 11-11-11 మూడు 11లు రావటము ఎంతో ముఖ్యమైన రోజు. శతాబ్దమునకు ఒక్కసారి ఇటువంటి ఆవకాశము వస్తుంది. ఇటువంటి రోజును వృధా చేయకుండా మనస్సును దైవముతో అనుసంధానము చేసుకొన్నచో చక్కని అనుభూతిని పొందుటకు అవకాశము కలదు. మానసిక ప్రశాంతతను పొంది జీవితమున అభివృద్దిని పొందుటకు అవకాశమును ఇచ్చు రోజు. దైవ సంబంధమైన కార్యక్రమములకు ఉపయోగించవలసిన రోజు.

అందరూ ఈరోజుని తప్పక సద్వినియోగము చేసుకొని దైవానుభూతిని పొందవలెనని కోరుకుంటున్నాను.

Wednesday, November 2, 2011

యోగ జీవితమునకు ప్రాథమిక అర్హతలు

యోగజీవనమును సాగింపదలచిన వారు ఈ క్రింది విషయములను పరిశీలించుకొనవలెనని పరమ గురువు మైత్రేయుల వారు తెలియచేసి యున్నారు.


1. దప్పికకు నిలువగలవా?

2. ఆకలిని ఓర్చుకొనగలవా?

3. వేసవిని భరింపగలవా? అట్లే శీతలమును భరింపగలవా?

4. రోజుల తరబడి వర్షించుచు సూర్యరశ్మి కలుగనిచో సహింపగలవా?


పై విషయములయందు నీకు చిరాకు కలుగుట లేదు కదా! కలుగనిచో ప్రాథమిక సంసిద్ధత నీకు ఉన్నదని తెలియును. కాలమును, దేశమును, సన్నివేశములను బట్టి సమతుల్యము నెరుగనివాడు యోగసాధన చేయజాలడు. అట్టివాని యోగజీవన మొక కలయే. తనయందు అవసరములను బట్టి వలసిన సర్దుబాట్లు గావించుకొనుచు జీవింపనివాడు యోగ పరీక్షయందు విఫలుడే. జీవన వాతావరణము ఎప్పుడును అనుకూలముగ ఎవ్వనికిని యుండదు. ప్రతికూలముగా నున్నను కూడ సమతుల్యము కోల్పోని వాడే యోగసాధన కర్హత సంపాదించును.

Monday, October 17, 2011

ఆరోగ్యాన్ని అందించే - సూర్య స్తోత్రమ్

సుమారు 20 సంవత్సరాల క్రితం ఒక వార పత్రికలో చూసి వ్రాసుకున్న సూర్య స్తోత్రం. మనందరికి తెలిసినదే సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఐశ్వర్య ప్రదాత. కర్మ సాక్షి. ప్రత్యక్ష నారాయణుడు. సమస్త సూర్యమండలానికి వెలుగును ప్రసాదించే దైవము. అటువంటి సూర్యారాధన సమస్త రోగములను హరించి ఆరోగ్యమును అందిస్తుంది.

రోగగ్రస్తుడైన శ్రీకృష్ణ కుమారుడు సాంబుడు తన తండ్రి ఆజ్ఞానుసారము సూర్య ధ్యానములో ఉండగా అక్కడ సూర్య స్తోత్రము అతనికి దర్శనమిచ్చినట్లుగా వారపత్రిక లోని వ్యాసము తెలియచేసింది.

మిత్రులందరికి ఉపయోగపడవలెనని దానికి ఇక్కడ అందిస్తున్నాను.

సూర్య స్తోత్రమ్


1. ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహున్నత్తరాం దివందేవః |
హుద్రోగం మమ సూర్యో హరిమాణంచాశు నాశయతు ||

2. నిమిషార్దే నైకేనద్వే చశతేద్వే సహస్రేద్వే |
క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాథాయ ||

3. కర్మజ్ఞానఖదశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ |
ద్వాదశధ యో విచరతి సద్వాదశ మూర్తి రస్తు మోదాయ ||

4. త్వం యజుఋక్సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః |
త్వం విశ్వం త్వం హంసః త్వం భానో! పరమహంశ్చ ||

5. శివరూపాత్ జ్ఞానమహం త్వత్తోముక్తిం జనార్దనాకారాత్ |
శిఖి రూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిశ్చామి ||

6. త్వచిదోషా దృశిదోషా హృదిదోషా యోఖిలేంద్రి యజుదోషాః |
తాన్ పుషా హతదోషః కించిదోషాగ్ని నా దహతు ||

7. తిమిరమివ నేత్రతిమిరం పతలమివాశేషరోగ పటలం నః |
కాచమివాధినికోశం కాలపితా రోగశూన్యతాం కురుతాత్ ||

8. యస్య సహస్రాంశోరభీషులేశో హిమాంశు బింబ గతః |
భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః ||

9. యేన వినాంధం తమసం జగదేతత్, యత్ర సతి చరాచరం విశ్వం |
ధృతబోధం, తం నళినీభర్తారం హర్తారం ఆపదామిళే ||

10. వాతాశ్మరీగదార్శః త్వగ్దోషమహోదర ప్రమేహాంశ్చ |
గ్రహణీ భగందరాఖ్యా మహారుజోపి త్వమేవ హంసి ||

11. ధర్మార్థ కామమోక్ష ప్రతిరోధిన ఉగ్రతాప వేగకరాన్ |
బందీ కృతేంద్రియ గణాన్ గదాన్ విఖండయతు చండాంశుః ||

12. త్వం మాతా త్వం శరణం త్వం దాతా త్వం ధనః త్వమాచార్యః |
త్వం త్రాతా త్వం హర్తావిపదాం; అర్క! ప్రసీద మమ ||

ఫలశృతి

ఇత్యార్యాద్వాదశకం సాంబస్య పురో నభాస్థ్సలాత్పతితం
పఠతాం భాగ్య సమృద్థిః సమస్త రోగక్షయస్స్యాత్ ||

Thursday, September 22, 2011

కర్మ చేస్తూ కర్మ బంధము లేకుండా జీవించుట

కర్మ - అంటే మనోవాక్కాయములతో చేసే పని. కానీ భౌతికముగా చేసేదే పని అని దాని వల్ల కర్మ బంధాలు ఏర్పడాతాయి అని, ఫలితాలు అంటుతాయి అని కొందరి వాదన. కనుక పని మానేస్తే ఫలితాలు అంటక మోక్షము వస్తుంది అని కొందరి వాదన. కానీ భగవద్గీతలో భగవానుడు జ్ఞానయోగములో కర్మ చేస్తూ కూడా చేయని వానివలే ఎలా ఉండాలి, ఫలితములు అంటకుండా ఎలా ఉండాలి అని చెప్పియున్నాడు. అది ఎట్లా చేయవచ్చో తన జీవితములో ఆచరించి చూపించాడు.

చేసే పని జీవుని బంధించకుండా, మరల కర్మ పుట్టకుండా, ప్రారబ్ద కర్మ పరిష్కారము అయ్యే విథముగా ముక్తసంగుడై జీవించటానికి అవసరమైన విషయాలను జ్ఞానయోగము నందు తెలియపరచటము జరిగింది. సూత్రములను పాటించు వారికి కర్మ బంధము ఉండదు. కర్మలు చేయటము ఉంటుంది, కానీ అవి బంధించవు. ఇవి ఆచరించగలమా లేదా అనే మీమాంస కలవారు ఆచరించలేరు. ఎదో ఒక దానిని ఆచరించటము మొదలు పెట్టినచో అదే మిగతావాటిని ఒక్కొక్కటిగా దగ్గరకు చేర్చును. అవేమిటో ఒకసారి చూద్దాం....

1. కర్మల యందు కామ సంకల్పము లేకుండా చూసుకొనుట. కర్తవ్య కర్మను మాత్రమే చేయుట. యజ్ఞార్థము జీవించుట.

2. అందరియందు ఉన్న "నేను" అను ప్రజ్ఞ తనకు తానే పనిచేసుకుంటున్నాడు అనే జ్ఞానం కలిగి జీవించుట. జ్ఞానాగ్ని కర్మలన్నింటిని కాల్చివేస్తుంది.

3. కర్మఫలములను ఆశించకుండా జీవించుట. ఫలితములు వచ్చినా వలసింత అందుకొని ఇతరములను త్యాగము చేయట.

4. తృప్తిగా జీవించుట.

5. ఎవరిని ఆశ్రయించక నిరాశ్రయుడై జీవించుట. ఇతరములను ఆశ్రయించక దైవమును ఆశ్రయించుట.

6. ఆశలేక జీవించుట.

7. చిత్తమును నియమించి ఉంచుట. స్థిర చిత్తము కలిగి ఉండుట.

8. అపరిగ్రహము - దేనినీ ఊరక పొందే మనస్సు లేక ఉండుట.

9. శరీర శ్రమ చేస్తూ ఉండుట. తను చేయవలసిన పనికి ఇతరులపై ఆథారపడక తన పని తాను చేసుకొనుట. ఎక్కువ సౌఖ్యములకొరకు చూడకుండుట.

10. దొరికిన దానితో సంతృప్తి పొందుట.

11. ద్వందములకు అతీతముగా జీవించుట. ద్వందములు అనగా సుఖదుఃఖములు, శీతోష్ణములు మొ||

12. అసూయ లేకుండుట.

13. పనులు అవటము, అవకపోవటము నందు సమభావము కలిగివుండుట.

14. అయిపోయిన విషయములందు, రాబోవు విషయములందు ఆసక్తి లేక జీవించుట.

15. "నేను" అను ప్రజ్ఞను సమస్తమునందు దర్శించి జీవించుట.

16. సమస్తమును బ్రహ్మమునకు అర్పణము చేసి జీవించుట.

జీవితము నందు ఇటువంటి వాటిని ఆచరించకుండా ఎన్ని పూజలు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా ఉపయోగము ఉండదు. పూజైనా, ప్రార్థనైనా మొదలు పెట్టక ముందే దాని ఫలితము ఊహిస్తాము. చేస్తున్నంత సేపూ ఫలితము గురించి ఆలోచిస్తాము. ఊహించినది దొరకనిచో మళ్ళీ పూజవంక చూడము. ఎవరన్న్ ఫలానా పూజ చెయ్యండి అంటే... ఏమి పూజలు లెండి ఎన్ని చేసినా ఉపయోగమా పాడా...అంటూ దీర్ఘాలు తీస్తాము. అంటే కర్మ చేస్తున్నాము అంటే ఫలితమాసించే. ఇక కర్మ చుట్టుకోక ఏమవుతుంది. కర్మలు చేస్తూ కర్మలంటకుండా జీవించుటకొరకు కావలసిన స్థిరత్వాన్ని మనసుకు అందివ్వమని దైవన్ని ప్రార్థించాలి. పై సూత్రములన్నీ ఆచరించుట సాథ్యము కాదు. ఎదో ఒకదానిని శ్రద్దగా అనుస్యూతము చేస్తూవెళ్ళినచో తప్పక స్థిరత్వము లభిస్తుంది. అదే ఒక్కొక్కటిగా మితగా వాటిని ఆచరణలోనికి తీసుకు వస్తుంది. జీవుడు వేసుకున్న ముడులను ఒక్కొక్కటిగా తొలగిస్తాయి. ప్రపంచములో ఉంటాము కాని ప్రపంచము చేత బంధింప బడము. అన్నీ ఉంటాయి కానీ ఏదీ కూడా బంధించదు. అదే నిజమైన మోక్షము. మోక్షము అంటే వచ్చేది కాదు. ఉన్నది పోతే మిగిలేది. ఏది పోతే బంధము పోతే..

నిజమునకు ప్రపంచములోని విషయము కూడా బంధించదు. జీవుడు దానితో ఏర్పరుచుకున్న సంబంధము వల్ల అది జీవుని బంధిస్తుంది. పై వాటిలో ఒక్కదానిని ఆశ్రయించినా మనకు బయట పడటానికి మార్గము దొరుకుతుంది. మనిషి జీవన్ముక్తుడవుతాడు.