Friday, January 20, 2012

గురువు యొక్క ఆవశ్యకత

గురు అనగా పెద్దది లేక బరువైనది అని అర్థము కలదు. మన సౌరమండలములో కూడా సూర్యుని తరువాత గురువే పెద్ద గ్రహము. జ్ఞానములో పెద్దవానిని గురువు అందురు. తల్లి తొలి గురువుగా మొదలు పెట్టిన జీవితములో తండ్రి మలి గురువు. తరువాత విద్యాభ్యాసము.. అక్కడి వారు విద్య నేర్పే గురువులు. ఇంకా అనేకానేక మంది ద్వారా మనము అనేక విషయములను తెలుసుకొని శిక్షణ పొందుతూ వుంటాము. కనుక గురువు యొక్క ఆవశ్యకత జీవితములో తొలగింపలేనిది. పైన చెప్పబడిన వారందరూ కూడా శిక్షణ గురువులు. అలాకాక జీవుని ఉద్దరించి ఆధ్యాత్మిక మార్గములోనికి మళ్ళించి, తన నిజస్వరూపమును తెలుసుకొని భగవంతుని చేరటానికి దీక్షను అందించే వాడు సద్గురువు. అటువంటి సద్గురువుయొక్క ఆవశ్యకత ఎంతో అవసరము. శిక్షా గురువులు ఎంతమందైనా ఉండవచ్చు, కాని దీక్షా గురువు మాత్రము ఒక్కడే ఉంటాడు. జన్మ జన్మలకు అతడే మార్గనిర్దేశము చేస్తాడు.

భౌతిక ప్రపంచములో చిక్కుకొని పోయిన జీవుని, అంతరంగములోనికి మరల్చి అమరత్వము వైపుకి నడిపించేవాడు గురువు. దైవముతో అనుసంధానము కలిగివుండేవాడు గురువు. మార్గము తెలిసినవాడు మాత్రమే మార్గమును చూపగలడు. తను దైవమును చేరి, తనతోటి జీవులకు మార్గమును చూపి వారిని తనంతటి వారుగా ఉద్దరించుటకు దిగివస్తాడు. నిరంతరము ఇతరుల శ్రేయస్సును కోరేవాడు గురువు. అంథకారములో అలమటిస్తున్న శిష్యునికి తాను వెలుగై తన వెంటనడిపిస్తాడు. తాను నమ్మిన గురువుని మనసా, వాచా కర్మణా అనుసరించటమే శిష్యుని కర్తవ్యము. గురువు అందించిన దీక్షను అందుకొని దానియందు జీవితమును గురువుకు సమర్పణ చేసుకొని తరించవలసిన బాధ్యత శిష్యునిపై ఉన్నది.

యుద్ద సమయములో మమకార బంధములో చిక్కుకొని దిక్కు తోచక దుఃఖించే అర్జునికి జ్ఞాన బోధ చేసి కర్తవ్యము వైపుకు నడిపించిన యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు జగద్గురువు. అతడు యోగులకే యోగి. సమస్త జ్ఞానమును భగవద్గీత రూపమున మానవాళికి అందించిన శ్రీకృష్ణుడు సమస్త గురువులకు గురువు. అతడు చూపిన మార్గము మోక్షమార్గము.

భారతదేశము ఎంతో మంది సద్గురువులకు పుట్టినిల్లు. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రమణ మహర్షి, అరవింద మహర్షి, షిరిడి సాయి, అక్కల్కోట మహరాజ్, బాబాజి, లహరి మహాశయులు, యుక్తేశ్వర్ గిరి, పరమహంస యోగానంద, మాస్టర్ సి.వి.వి, మాస్టర్ యమ్.యన్ (మైనంపాటి నరహింహారావు), మాస్టర్ .కె (ఎక్కిరాల కృష్ణమాచార్య), వేటూరి ప్రభాకర శాస్త్రి ఇలా ఎందరో సద్గురువులు ఎంతో మందికి స్పూర్తిని ప్రసాదించి ఆధ్యాత్మిక మార్గములో నడిపించి తరింపచేశారు.

తమస్సులో వున్న శిష్యుని రజస్సులోనికి, రజస్సులో వున్న వానిని సత్వములోనికి, సత్వములో వున్న వానిని నిత్య సత్వములోనికి మరల్చి యజ్ఞార్థముగా జీవితమును తీర్చిదిద్దు వాడు సద్గురువు.

గురువు బ్రహ్మగా శిష్యుడు తనని తాను తీర్చిదిద్దుకొనుటకు కావలసిన కల్పనా శక్తియై వుంటాడు. నేను మారాలి. బంధముల నుండి బయట పడాలి. బాధలనుండు విముక్తుడను అవ్వాలి, ఇతరుల శ్రేయస్సుకు పాటు పడాలి అనేటటువంటి సరియైన దృక్పథము శిష్యునిలో పెరిగి దానికి కృషి చేసే విథముగా గురువు శిష్యునికి శక్తిని అందిస్తాడు.

గురువే విష్ణువుగా తనను మార్పు చేసుకొనుటకు కావలసిన జ్ఞానమును శిష్యునికి అందిస్తాడు. ఎటువంటి సాథన చేయాలి, ఎటువంటి విషయముల యందు శ్రద్ద, భక్తి కలిగివుండాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి ఆహార వ్యవహారములు కలిగివుండుట వలన తన సాథన కొనసాగుతుంది అనేటటువంటి జ్ఞాన శక్తిని ప్రసాదిస్తాడు. దైవమునకు సంబందించిన జ్ఞానమును, సమస్త సృష్టి విజ్ఞానమును కూడా అనుగ్రహించ గలిగిన శక్తి కలిగివుంటాడు.

గురువు మహేశ్వరుడుగా శిష్యునికి ఆచరణాత్మకమైన ఆలోచనా శక్తిని అందిస్తాడు. అందిన ఆలోచన, పొందిన జ్ఞానము ఆధారముగా శిష్యుడు తన జీవితమును పండించుకొనును. గురువే పరబ్రహ్మము అనగా గురువే దైవము. అతడే నారాయణుడు. అంతర్యామి. సమస్త సృష్టికి ఆధారమైన తత్వము. అతడే ఈశ్వరుడు. అపరిమితుడు. సచ్చిదానంద స్వరూపుడు.

జీవుడు ముక్తిని పోందటానికి అనేక మార్గాలను మన వాజ్మయము చెప్పినది. జీవుడు తనకు తానుగా సాథన చేసి ప్రారబ్ద కర్మను తొలగించుకొని మోక్ష స్థితిని పొందుటకు ఎంతో శ్రమ పడవలసి ఉన్నది. కాని సద్గురు సమాశ్రయము వలన కావలసిన సమస్త సాథన కొనసాగును. శిష్యుని జీవలక్షణమును అనుసరించి అతనికి తగిన సాథననిచ్చి అతనిని ఉద్దరించగల సదుపాయము సద్గురువు వద్ద కలదు. సాథన చేస్తున్నామన్న విషయము తెలియకుండా శిష్యుని చేత కావలసిన సాథన అంతా చేయించగలడు గురువు. కొంతకాలము గడచిన తరువాత తిరిగి చూసుకొన్నచో మనలో వచ్చిన మార్పును గమనించ వచ్చును. గురు సన్నిధికి చేరకముందు ఎలా వున్నామో, తరువాత ఎలా వున్నామో. మన ఆలోచనలో మార్పు, మాటలో మార్పు - అంటే మాట్లాడే విథానము - ఎవరికి ఎటువంటి ఉద్వేగము కలిగించని మాటలు మరియు సేవాత్మకమైన కర్మాచరణము మొదలైన మార్పులు మనలో మనకి తెలియకనే ఏర్పడతాయి.

మనము అనుసరించే గురువు ద్వారా అంతర్యామి దైవాని దర్శించాలి. మనకు శిక్షణనిచ్చే భాగంలో గురువు చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. అప్పుడు మనము అతనిని వదల కూడదు. బంగారానికి మెరుగురావాలి అంటే కొలిమిలో కాలక తప్పదు. శిల శిల్పముగా మారాలంటే ఉలి దెబ్బలు తినక తప్పదు. శిష్యుడైనా అంతే. తాను వెలుగై ఇంకొంతమందికి దారి చూపించాలంటే శ్రమకోర్చక తప్పదు. అలకాక గురువులను మార్చుతూ ఉన్నట్లైతే మరింత దిగజారిపోతాడు. అలా మార్చటాన్ని గురువ్యభిచారము అంటారని ఒకచోట విన్నాను. సర్వకాల సర్వావస్థలయందు గురువుకు సమర్పణ చెంది ఆశ్రయించివున్న శిష్యుడు గురువు అనుగ్రహము పొంది ఆత్మానుభూతిని పోందగలడు.

గురుమార్గములో త్వరితగతిన సాథనలో అభివృర్దిని పొందుటకు అవకాశము కలదు. కనుగ జీవితమున గురువు యొక్క ఆవశ్యకత ఎంతైనా వున్నది. గురువే దైవము అని నమ్మి గురువుననుసరించిన వాని సమస్తము కరతలామలకము అవుతుంది.