Tuesday, May 17, 2011

"పోతన భాగవతము" లోని కొన్ని పద్యాలు

శ్రీకృష్ణుడి గురించిన పద్యాలు కొన్ని....

శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోక

క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో

ద్రేకస్తంభకు కేళి లోల విలసదృగ్జాల సంభూత నా

నా కంజాత భవాండ కుంభకు మహా నందాంగనా డింభకున్ !!

( ఇది భాగవతం లో నాందీ పద్యం లాంటిది)


అమ్మా మన్ను తినంగ నే శిశువునో ? యాకొంటినో ? వెర్రినో ?

నమ్మంజూడకు వీరి మాటలు మదిన్; నన్నీవు కొట్టంగ వీ

రిమ్మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్య గం

ధమ్మాఘ్రాణము జేసి నా వచనముల్ తప్పైన దండింపవే !!


నల్లని వాడు పద్మ నయనంబుల వాడు కృపా రసంబు పై

జల్లెడు వాడు మౌళి పరి సర్పిత పింఛము వాడు నవ్వు రా

జిల్లెడు మోము వాడొకడు చెల్వల మాన ధనంబు దెచ్చెనో

మల్లియ లార మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే ?!!


అలాంటి పద్యమే శ్రీరాముని గురించి :

నల్లని వాడు, పద్మ నయనంబుల వాడు, మహాశుగంబులున్

విల్లును దాల్చు వాడు, గడు విప్పగు వక్షము వాడు, మేలు పై

జల్లెడు వాడు, నిక్కిన భుజంబుల వాడు, యశంబు దిక్కులన్

జల్లెడు వాడు నైన రఘుసత్తము డిచ్చుత మా కభీష్టముల్ !!


అరయన్ శంతను పుత్రుపై విదురుపై నకౄరుపై కుబ్జ పై

నరుపై ద్రౌపది పై కుచేలుని పయిన్ నంద వ్రజ శ్రేణిపై

పరగన్ గల్గు భవత్కృపా రసము నా పై కొంత రానిమ్ము నీ

చరణాబ్జంబులె నమ్మినాను జగదీశా ! కృష్ణ ! భక్త ప్రియా !


హరియను రెండక్షరములు

హరియించును పాతకంబు నంబుజనాభా !

హరి నీ నామస్మరణము

హరి హరి పొగడంగ తరమె హరి శ్రీ కృష్ణా !


శ్రీ కంఠ చాపు ఖండన

పాకారి ప్రముఖ వినుత భండన విలస

త్కాకుథ్స వంశ మండన

రాకేందు యశో విశాల రామ నృపాలా !


కిటియై కౌగిట జేర్చెను,

వటుడై వర్ధిల్లి గొలిచె, వడి కృష్ణుండై

ఇట పద చిహ్నములిడె, క్రిం

దటి బామున నేమి నోచితమ్మ ధరిత్రీ?!


కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి

గగన భాగంబెల్ల గప్పికొనగ

నురికిన నోర్వక యుదరంబులో నున్న

జగముల వ్రేగున జగతి గదల

జక్రంబు జేపట్టి చనుదెంచు రయమున

బైనున్న పచ్చని పటము జార

నమ్మితి నాలావు నగుబాటు సేయక

మన్నింపు మని క్రీడి మరల దిగువ


గరికి లంఘించు సింహంబు కరణి మెరసి

నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు

విడువు మర్జున యనుచు మద్విశిఖవృష్టి

దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు


ప్రహ్లాద చరిత్ర లోని కొన్ని పద్యాలు..

చదువని వాడజ్ఞుండగు

చదివిన సదసద్వివేక చతురత గలుగున్ !

చదువగ వలయును జనులకు

చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ !


చదివించిరి నను గురువులు

చదివితి ధర్మార్ధ ముఖ్య శస్త్రంబులు నే

చదివినవి గలవు పెక్కులు

చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ !!


ఇందు గలడందు లేడని

సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెందెందు వెదకి జూచిన

అందందే గలడు దానవాగ్రణి వింటే !!


మందార మకరంద మాధుర్యమున దేలు

మధుపంబు బోవునే మదనములకు !

నిర్మల మందాకినీ వీచికల దూగు

రాయంచ సనునె తరంగిణులకు !

లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు

కోయిల సేరునే కుటజములకు !

పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక

మ్మరుగునే సాంద్ర నీహారములకు !


అంబుజోదర దివ్య పాదారవింద

చింతనామృత పాన విశేష మత్త

చిత్త మే రీతి నితరంబు చేర నేర్చు

వినుత గుణ శీల మాటలు వేయు నేల !!


కమలాక్షు నర్చించు కరములు కరములు

శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ

సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు

శేషశాయికి మ్రొక్కు శిరము శిరము

విష్ణు నాకర్ణించు వీనులు వీనులు

మధువైరి దవిలిన మనము మనము

భగవంతు వలగొను పదములు పదములు

పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి


దేవదేవుని జింతించు దినము దినము

చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు

కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు

తండ్రి! హరి జేరుమనియెడి తండ్రి తండ్రి!


పీఠిక లో సరస్వతీ స్తుతి మొదలైన పద్యాలు..

బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్

కూళల కిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్

హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూలకౌ

ద్దాలికులైన నేమి నిజ దార సుతోదర పోషణార్థమై !!


కాటుక కంటి నీరు చను కట్టు పయింబడ నేల యేడ్చెదో

కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల యో మదంబ యో

హాటక గర్భు రాణి నిను నాకటికిన్ గొని పోయి యెల్ల

ర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భరతీ !!


క్షోణి తలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత

శ్రోణికి చంచరీక చయ సుందర వేణికి రక్షితామర

శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్

వాణికి నక్ష దామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్ !!


శారద నీరదేందు ఘన సార పటీర మరాళ మల్లికా

హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం

దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ సుభా

కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ !!


అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె

ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా

యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్


పలికెడిది భాగవతమట

పలికించెడి వాడు రామ భద్రుండట నే

పలికిన భవ హర మగునట

పలికెద వేరొండు గాథ పలుకగ నేలా !!


ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో

విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేయునో ఈశ్వరుం

డనుకూలింప దలంచునో దలపడో ఆర్యా మహా దేవియున్

నను రక్షింప నెరుంగునో యెరుగదో నా భాగ్య మెట్లున్నదో !!


నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్

మిమ్ము బురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటిపె

ద్దమ్మ, దయాంబురాశివి గదమ్మ, హరిం బతి జేయుమమ్మ, నిన్

నమ్మిన వారి కెన్నడును నాశము లేదు గదమ్మ, యీశ్వరీ!


భారత వర్ష జంతువుల భగ్యమదేమని చెప్ప వచ్చు నీ

భారత వర్షమందు హరి పల్మరు బుట్టుచు జీవ కోటికిన్

ధీరత తోడ తత్వ ముపదేశము జేయుచు చెల్మి సేయుచున్

ఆరయ బాంధవాకృతి కృతార్ధుల జేయుచు నుండు నెంతయున్ !!


బాలుండీతడు కొండ దొడ్డది మహా భారంబు సైరింపగా

జాలండో యని దీని క్రింద నిలువన్ శంకింపగా బోలదీ

శైలాంబోనిధి జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నా

కేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్ !!


హాలా హల భక్షణం లోనివి ...

కంటే జగముల దుఃఖము

వింటే జల జనిత విషము వేడిమి ప్రభువై

యుంటకు నార్తుల యాపద

గెంటింపగ ఫలము గాదె కీర్తి మృగాక్షీ !!


మ్రింగెడి వాడు విభుండని

మ్రింగెడిదియు గరళ మనియు మేలని ప్రజకున్

మ్రింగుమనె సర్వ మంగళ

మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో !!


కదలం బారవు పాప పేరులొడలన్ ఘర్మాంబు జాలంబు వు

ట్టదు నేత్రమ్ముల చెమ్మ వోదు నిజ జూటా చంద్రుడున్ గందడున్

వదనాంభోజము వాడదా విషము నాహ్వానించుచో డాయుచో

పదిలుండై కడి సేయుచో దిగుచుచో భక్షించుచో మ్రింగుచోన్ !!