Thursday, October 15, 2009

మాట - దానివల్ల లాభ నష్టములు


సృష్టిలోని జీవరాసులలో మాట లేక భాష మనిషికి భగవంతుడిచ్చిన వరం. దేవతలకు కూడా వాక్కు లేదు. వాక్కు వల్ల మనిషి ఊర్థ్వమునకు ఎదగవచ్చు, లేకఅధస్సులోకి జారవచ్చు. వాక్కును సరస్వతి అంటారు. సరస్వతి అనగా ప్రవహించునది. మనలో కూడా అది వాక్ప్రవాహమై వుంటుంది. అది అంతర్వాహిని. మనమువాక్కును చూడలేము, గ్రహించగలము. భాష బాహ్యములోనికి రాకముందు నుండి కూడా వుంటుంది. భావమై వుంటుంది. భావములకు మూలమైన స్థితి నుండిభావముగా దిగివచ్చి, అక్కడినుండి అది భాషతో కూడి బాహ్యములోనికి మాటగా వ్యక్తము అవుతుంది. ఇవియే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులు. మొదటభావము ఏర్పడినప్పుడు అది స్వచ్చమైనది. మలినములులేక నిర్మలముగా వుంటుంది. కాని అది దిగినకొలది జీవుని గుణ స్వభావమువల్ల అనేక విథములుగామార్పులు చెంది బయటకు వ్యక్తమవుతుంది. ప్రవహించుచున్న నీరు స్వచ్ఛమైనదైననూ అది ప్రవహిస్తున్న మార్గమునందు మలినములున్నచో నీరు మలినమైబయటకు వచ్చును కదా!.. భావము కూడా అంతే.

పంచభూతములలోని ఆకాశము యొక్క తన్మాత్ర శబ్దము. ఇది వాయు సంచారము వల్ల ఏర్పడుతుంది. మనయందు వాయువే శబ్దమునకు ఆథారము. ప్రాణ, అపాన,వ్యాన, ఉదాన, సమాన ప్రాణములుగా మనయందు వాయువు యొక్క గమనము వుంటుంది. ఇవే పంచ ప్రాణములు. అందు అపాన వాయువు వల్ల మనకు మాట లేకశబ్దము ఏర్పడుతుంది. మనము లోపలికి పీల్చునది ప్రాణము, పీల్చినది బయటకు వచ్చునప్పుడు అది అపానము. ఉచ్ఛ్వాసయే ప్రాణము, నిశ్వాసయే అపానము. రెంటిని సమము చేయమని భగవద్గీతలో శ్రీకృష్ణ భవవానుడు "ప్రాణాపాన సమాయుక్తౌ" అని చెప్పియున్నాడు. ప్రాణాయామము నందు సాథకుడు చేయవలసినసాథన ఇదియే. స్థితిని పొందుటకు ముందు పతంజలి యోగమున చెప్పబడిన యమ, నియమములను తప్పక పాటించి ఆసన స్థితిని పొందవలెను.

స్వభావము ననుసరించియే మనము మన చుట్టూ వున్న పరిస్థితులకు ప్రతిస్పందించుట జరుగుతుంది. అది మననుండి వ్యక్తమయ్యే భావములను, భాషను కూడానియంత్రిస్తుంది. అంతఃకరణ శుద్ది వున్నచో భావములు మలినమవ్వక అవి భాషయందు ప్రతిబింబిస్తాయి. సన్మార్గమునందు వున్నవాడు అంతఃకరణ యందు ఎక్కువవుండి, బయటి విషయముల యందు అవసరమునకు తగినంత వుండి దివ్యానుభూతులను పొందుతాడు. అంతఃకరణము లోనికి ప్రవేశించుట యోగ మార్గము. దానినిశుద్ది పరచుకొనుటకు చేయునదే తపస్సు. అంతర్ముఖము అయిన వానికే లోలోపల వున్న దివ్యశక్తి అవగతమవుతుంది. ఆలోచనలు ఎంత లోతుగా వుంటే అంతఅవగాహన పెరుగుతుంది. లోతు పెరగాలంటే లోపలికి వెళ్ళాలి. కనుక అంతర్భావన ముఖ్యము. మనస్సుయొక్క అంతర్భావనలో గురువు లేక దైవము ప్రతిష్టించివుండవలెను. అంతర్ముఖము అయిన వానికి మౌనము పెరుగుతుంది. ఒక్క భౌతికమైన మౌనము సరిపోదు, మానసిక మౌనము కూడా ముఖ్యము. మానసికమేశ్రేష్టము. అవసరమున్నంత వరకే మాట్లాడటము జరుగుతుంది. అటువంటి వాని భావములు, భాష నిర్మలమై అతని కర్మలు కూడా దివ్యములై వుంటాయి. అదే త్రికరణశుద్ది.

అవసరముకన్నా ఎక్కువ మాట్లాడుట వలన, అనవసరమైన విషయములోకి మళ్ళింపబడి అవి వికటించి విషపూరితం అవ్వటానికి అవకాశము ఏర్పడుతుంది. అప్పుడుఅమృతమైన వాక్కులను అందివ్వవలసిన నాలుక పామువలే విషముకు కక్కుతుంది. విషమంటే విషపూరితమైన వాక్కులు. ఇవి ఇతరులను బాధించగలవు. భాషతోఇతరులను బాధపెట్టేవాని ప్రార్థనలు దైవమును చేరవు. కనుక ప్రతిఒక్కరూ భాషయందు నియంత్రణ కలిగి దానియందు తగిన శిక్షణనిచ్చుకోవాలి. భాషయందు నియంత్రణలేని వాని నాలుక వేయి నాలుకలై ప్రవర్తిస్తుంది. వానికి తెలియకుండానే ఒకటి, వేయిగా చీలిపోతుంది. వీళ్ళు విన్నది విన్నట్లు చెప్పరు. ఒక్కొక్కరికి ఒకలా చెబుతారు.ముందు పొగిడి, వెనక తిట్టటం చేస్తూవుంటారు. అలా విషపూరితమైన వాక్కులు కలిగినవారి గొంతు పాడై పోతుంది. గొంతులోనే అమృతము, విషము వున్నాయి. ఎలాచేసుకుంటాము అన్నది మన భాషణము మీద ఆథారపడి వుంటుంది. సరదాగా మాట్లాడవచ్చు, కానీ భావము యందు బలముగా వున్నచో అది చేతలలోకి కూడాప్రసరిస్తుంది. చేతలలోకి దిగిన భావము మరింత విషపూరిత మవ్వటానికి అవకాశము వుంటుంది. విషపూరితమైన నాలికలు కలిగిన పాము కన్నా ఒక నాలిక కలిగి వేయివిధములుగా మాట్లాడు మనిషి చాలా ప్రమాదకరము. కనుక భాషను ఎప్పుడూ సరిచూసుకుంటూ వుండాలి.

మాట మనిషిలోని సంస్కారమును తెలియచేస్తుంది. కొందరు మాట్లాడితే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది. కొందరి మాట్లాడుతుంటే అక్కడ వుండాలని అనిపించదు. చీకటిలోకూడా దారి చూపించగలిగినది శబ్దము. చీకటిలో వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఎక్కడెక్కడ వున్నారో మాట వల్ల తెలుస్తుంది. కనుకనే మాట లేకపోతే మనిషి అంథతమస్సులోకి ప్రవేశించేవాడు అని వేద వాక్యము. మనిషిలోని భావమే మాట. అది వ్యక్తపరచుటకు మాటే అక్కరలేదు వ్రాసి కూడా వ్యక్తపరచ వచ్చును. మాట, రాత,చేతల ద్వారా భావవక్తీకరణ చేయవచ్చును. ఇందు దేని వల్లనైనా ఇతరులకు బాధ కలిగించవచ్చును. మనిషి మనస్సులోని భావమే వీటిని నియంత్రిస్తుంది. కనుక భావశుద్ది ఎంతో అవసరము.

భాషతో ఇతరులను అనేక విథములైన ఉద్వేగములకు గురిచేయవచ్చును. ముఖ్యముగా కోపము వచ్చినప్పుడుకాని, దుఃఖము కలిగినప్పుడుగాని మనిషి అనేకఉద్వేగములకు లోనై పరుషమైన మాటలు మాట్లాడుటకు అవకాశము వుంటుంది. అప్పుడు అంతరాంతరములలో వున్న భావోద్వేగములు బయటపడతాయి. వాటివల్లమాట్లాడినవానికి, ఇతరులకు కూడా హాని కలుగవచ్చు. కనుక సమయములో జాగ్రత్త ఎంతో అవసరము. మనిషి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములకుబానిస ఐనప్పుడు తన స్వాథీనము నందు లేక ప్రవర్తిస్తాడు. తనయందు తనకు స్వాథీనము లేనివాడు స్వామిత్వమును పొందలేదు. స్వామిత్వము లేనిదే నియంత్రణకుదరదు. అతిగా మాట్లాడు వాని ప్రజ్ఞ ఊర్థ్వగతి చెందక సమాంతరముగా ప్రవహిస్తుంది. అప్పుడు అతడు మానవుడైననూ భూమిపై సమాంతరముగా ప్రాకు జీవి ప్రవర్తనకలిగివుంటాడు. అంటే కాళ్ళు వున్ననూ పాకుతున్నట్లు పామువలె. మాట నియంత్రణ లేని మానవుడు రెండు నాలుకల పాముతో సమానము. అటువంటి వారుఎప్పుడైనా కాటు వేయవచ్చు. అటువంటి వారితో జాగ్రత్తగా ప్రవర్తించవలెను. దూరముగా వుంటే మరీ మంచిది. తప్పనిచో అప్రమత్తులై వుండుట మంచిది.

మాటలో సంయమనము లేనివాడు సాథనకు పనికిరాడు. సత్యమును గ్రహించలేడు. జ్ఞానమును పొందుటకు అర్హతను పొందలేడు. మనిషిలోని పశుప్రవృత్తి తగ్గాలంటేమాట యందు స్వామిత్వమును పొంది వుండవలెను. పైథాగరస్ అను గ్రీకు యోగి మొదట తన శిష్యులకు మూడు సంవత్సరములపాటు భౌతిక, మానసిక మౌనమునుశిక్షణగా ఇచ్చేవాడట. మాటయందు, ఆలోచనయందు, చేతయందు కూడా శుద్దత కలిగివుండ వలెనని ఎప్పుడూ తన శిష్యులను హెచ్చెరించేవాడు. ముని అనగామననముచేత మౌనము వహించినవాడు. సదా భగవంతుని గురించి మననము చేయువాడు సహజముగా మౌనముగా వుండును. అనవసర ప్రసంగములు వుండవు.అట్టివాడు తననే కాక ఇతరులను కూడా నియంత్రించగలడు.

కనుక మాటయందు సంయమనము సాథించుట ప్రతిఒక్కనికి ముఖ్యమైన లక్ష్యము కావలెను. "మాటను జయించినవాడు లోకమును జయించవచ్చును" అనువాక్యము లోకవిదితమే కదా! ఇలా ఎంతైనా చెప్పుకొనపచ్చును....

మాట ఎలా వుండాలి అనే విషయాన్ని తర్వాత చూద్దాం......