Wednesday, October 7, 2009

కర్మ - స్వభావము


కర్మ అనగా జీవునిచే చేయబడిన పని. త్రిగుణముల ద్వారా దిగివచ్చిన ఈశ్వరుడు జీవుడై ప్రప్రంచమున వర్తించును. దానివలన తాను వేరుగా వున్న భావన కలిగిప్రపంచ విషయముల పట్ల ఆకర్షణ చెంది తన స్వస్వరూపము మరచును. తనకు కలిగిన ఇచ్చను పూర్తి చేసికొనుటకు తను పొందిన జ్ఞానమును ఉపయోగించి క్రియద్వారా ఇచ్చాపూర్ణముకొరకు ప్రయత్నము చేయును. కొన్ని సందర్భములలో సరియైన జ్ఞానమున్ననూ తనకు నచ్చిన విథముగా చేయదలచి కర్మ బంధమునచిక్కుకొనును. కర్మ యజ్ఞార్థమైనచో అది బంధవిముక్తి కలిగించును. ఫలితమాసించినచో కర్మ బంధించును. అందుండి స్వభావమేర్పడి అది జీవుని మరింత బంధించును.ఇది మనుష్యునకు మాత్రమే. మిగిలిన జంతుజాలమంతయు ప్రకృతి ఆథీనమై విచక్షణా జ్ఞాన బుద్ది లేక వుండును కనుక వాటికి కర్మ బంధము లేదు. ప్రకృతిలో ఒక్కమానవునికే స్వేశ్చతో కూడిన విచక్షణా జ్ఞానముండుటచే అతడు చేయు కర్మలకు ఫలితములు ఇవ్వబడినాయి.

అలా పూర్వ అనుభవముల వలన ప్రతి జీవిలో ఒక్కొక్క అనుభూతి, ఆశయములు, అభిప్రాయములు, భావములు వుండును. భయము అలాంటిదే. కొందరిలో ఎందుకోతెలియని భయము వుంటుంది. కొందరికి ఎక్కువగా కోపము వస్తుంది. గర్వము, అభిమానము, మోస బుద్ది మొదలైనవి కూడా అలాంటివే. ఇవన్నీ కూడా జీవునిలోపేరుకుపోయిన మురికి అన్నమాట. ఇవన్నీ కూడా జీవుని దైవము వైపు చేయు ప్రయాణమునకు అవరోథములే. దైవమును కూడా చేయనీయవు. ఇవి అన్నీ కూడాఎవరికి వారు తమ ధృడమైన సంకల్పముతో తొలగించుకొనవలెను. అందుకు కావలసిన సహాయము కొరకు దైవమును ప్రార్థించవలెను. అప్పుడు జీవునికి హానిచేయువన్నీ కూడా తొలగింపబడి అతనికి శ్రేయస్సును కలిగించేవి అందింపబడతాయి.

తను వేరుగా వున్నానన్న భావమే అజ్ఞానపు తొలి మెట్టు. అదే మనల్ని పదార్థము వైపు నెట్టి వేస్తుంది. దైవము కంటే తాను వేరుకాదన్న భావము దైవము వైపునడిపిస్తుంది. వేరన్న భావము పదార్థము వైపు నడిపిస్తే వేరు కాదన్న భావము దైవము వైపు నడిపిస్తుంది. పైన చెప్పిన వివిథ రకములైన అసురీ భావములను మనస్వభావము నుండి తొలగించుకొనుటకు త్రికరణ శుద్దిగా, ధృడ సంకల్పముతో, ఆర్తితో దైవమును ప్రార్థించవలెను. అప్పుడు అవి దైవ స్పర్శ వల్ల ప్రేరేపింపబడి జీవునిపైతిరుగుబాటు చేయును. దాని వల్ల శారీరకముగా అతనికి అస్వస్థత కలుగ వచ్చును. ఐననూ శ్రద్ధను వీడరాదు. అదే అతనికి ప్రరీక్ష. అంటే ఇంట్లో బాగా దుమ్మువున్నదనుకోండి, అప్పుడు బాగా ఎక్కువ clean చెయ్యవలసి వున్నది కదా! అలాగే మనలో ఎంత మురికి వుంటే అంత cleaning అవసరమన్నమాట. దానిలోభాగముగానే కొన్ని సందర్భములలో జీవునికి అనేక అవాంతరములు ఏర్పడుతూ వుంటాయి. ఒక్కోసారి థన నష్టము రావచ్చు, ఒక్కొసారి బంధు నష్టము రావచ్చు లేకఉద్యోగము పోవచ్చు...ఇలా ఎన్నో జరగవచ్చు. ఇవన్నీ కూడా cleaningలో భాగమే అని అన్నిటిని దైవమునకు సమర్పణచేసి వుండాలి. భగవంతుని సహాయముఎప్పుడూ వుంటుంది. అది మన శ్రద్దను అనుసరించి. తొలగింపబడేవన్నీకూడా మనలో లోలోతుల్లో బాగా పేరుకుపోయినవే. వాటిని పెకళించి వేయాలి. పాములు,తేళ్ళూ, పులులు, సింహాలు.... ఇలాంటి ఎన్నో భావాలు మన అంతరాంతరాలలో వుండి మన పురోగతికి అవరోథము కలిగిస్తాయి. పులులంటే భయంకరమైన కోరికలు,తేళ్ళంటే ఇంకొకరిని కుట్టే స్వభావము, తిట్టే స్వభావము, సింహమంటే హింసించే స్వభావము. పాములంటే విషపూరితమైన ఆలోచనలు. వీటితో పాటు కొన్నిసాథుజంతువులవంటి మంచి భావములు కూడా వుంటాయి. ఇదంతా చూస్తుంటే అడవిలాగా వుంది కదా! అడవే మరి. కాకపోతే ఏమిటి. ఒక్కసారి ఎవరికి వారుఆలోచించుకుంటే చాలా భయము వేస్తుంది. ఇవనీ కూడా అజ్ఞానపురిత పూర్వ కర్మ వలన ఏర్పడినవే. అటువంటి అడవిని నందనోద్యాన వనముగా మార్చాలంటే ఎంతోశ్రమ, శ్రద్ద కావాలి. అవి కలగాలంటే గొప్ప సంకల్ప శక్తి ఎంతో అవసరము. మనము సిద్ధమైనపుడు భవవంతుని సహాయము ఎప్పుడూ వుంటుంది. మనము readyఅవటము కోసమే అతడు ఎదురుచూస్తూ వుంటాడు. వీటిని తొలగించటమే కర్మ ప్రక్షాళము. అది అంత శులభము కాదు.

అసలు ఇలాంటివి మనలో వున్నాయని తెలియాలి. వాటిని మనంతట మనం పెకళించటం చాలా కష్టము. అందుకు సహాయము చేసే వాడే సద్గురువు. సద్గురువు అనగాదైవముచే పంపించబడి, తమను తాము ఉద్దరించుకొనుటకు సిద్దపడిన వారికి సహాయము చేయువాడు. అతనికంటూ సొంత ప్రణాళిక ఏమీ వుండదు. దైవ ప్రణాళికే అతనిప్రణాళిక. జీవుని స్వభావముననుసరించి అతనికి శిక్షణనిచ్చును. అందరికీ ఒకేలా వుండదు. స్వయంప్రకాశము కలిగిన జీవుని చుట్టూ పేరుకుపోయి, బలిష్టమైనమందపాటి గోడ వలే వున్న మురికి అంతటిని తొలగించి అతనికి పారదర్శకతను కలిగించును. ఇది అతనికి అందించు శిక్షణ ద్వారా చేయును. అప్పుడు జీవుడునిర్మలమై తన సహజ కాంతిలో ప్రకాశించును. అద్దము ద్వారా ఆకాశమును చూసినచో, చూసిన వాని ప్రతిబింబము కనపడును. అదే తాను వేరుగా వున్నాననే భావన.కాని గాజు పలక ద్వారా చూసినచో ఆకాశము కనపడును. అంటే తాను వేరుగా లేక అంతటా నిండివున్న దానిని దర్శించును. సద్గురువును ఆశ్రయించిన వానికి కర్మనుత్వరగా తొలగించుకొనుటకు చక్కని మార్గము దొరకును. మొదట గురువు తనను చాలా భాధ పెడుతున్నాడని శిష్యుడు భావించుట సహజము. అది తనను ఉద్దరించేపనిలో భాగమే అని తెలియాలి. అలా కొంత కాలము తరువాత గురువు యొక్క కరుణ, అమృతత్వము తెలుస్తుంది. శిక్షణ భరించలేక కొందరు మధ్యలోనే గురువునివిడచి వెళ్ళిపోతారు. అలాంటి వారు మరికొంతకాలము వేచి వుండవలసినదే.

చేసిన కర్మ ననుభవించుటకే జన్మించుట జరుగుతుంది. అందరూ కారణ జన్ములే. కానీ కొందరు వారి వారి ఇష్టానుసారము జన్మిస్తూ వుంటారు. వారు కర్మ బంధము లేనివారు. కర్మ జీవులను ఉద్దరించుటకు వారు దిగివస్తారు. వారే గురుపరంపర. వీరి సంఖ్య చాలా తక్కువ. ఎక్కువ శాతము కర్మ ననుభవించుటకు తప్పక జన్మించవలసివుంటుంది. అనుభవించవలసిన దానిని తప్పించుకొనుట ప్రకృతిలో కుదరని పని. కానీ సద్గురు చరణాశ్రయము వలన అతని శిక్షణలో భృక్తము (past karma)రహితము కావింపబడుటకు అవకాశము కలదు. దానికి ఎంతో శ్రద్ద, భక్తి అవసరము.

తన కొరకు చేయు కర్మ బంధిస్తుంది.. ఇతరులకొరకు నిస్వార్థముగా చేయునది బంధమును తొలగిస్తుంది.