Wednesday, April 13, 2011

నిద్ర - యోగ సాధన

నిద్ర జీవికి ప్రకృతిచ్చిన వరం. ప్రతి జీవీ నిద్ర పోతుంది. నిద్రపోని జీవి ఎక్కువ కాలము జీవించలేదు. నిద్రలో ఎమవుతుందో ఎవరికీ తెలియదు. కాని నిద్ర పోయినట్లు మాత్రము తెలుస్తుంది. అదెట్లా? అసలు నిద్ర అంటే ఏమిటి? బాహ్యాన్ని మరచి మనస్సు, ఇంద్రియములు వెనకకు మరలి పొందే ఒక విశ్రాంతి స్థితి.

ఒక జీవి నిద్రించేటప్పుడు జరిగే భౌతిక పరమైన మార్పులని ఆధునిక శాస్త్రము గుర్తించ గలుగుతోంది. కానీ నిద్రించే సమయంలో జరిగే విషయాలు నిద్రించేవానికి ఎందుకు తెలియవు అంటే దానికి సమాధానము లేదు. శరీరములో ప్రాణ ప్రక్రియ జరుగుతునే వుంటుంది, రక్త ప్రసరణ జరుగుతునే వుంటుంది. భౌతికంగా జరిగేవన్నీ మామూలుగానే జరుగుతున్నట్లు తెలుస్తుంది. కానీ నిద్రించే వాడి మనస్సు ఏమైంది? వాడేమయ్యాడు? నిద్రపోతున్నప్పుడు అక్కడికి పాము వచ్చినా వాడికి ఎందుకు తెలియలేదు? అలాంటి వాటికి ఆధునిక శాస్త్రము సమాధానము చెప్పలేదు. కనుక తప్పక మనము యోగ శాస్త్రమును ఆశ్రయించక తప్పదు.

సమస్త సృష్టి ఒకేఒక చైతన్యముచే నిండివున్నది. చైతన్యముకన్నా ముందు దాని స్థితి సత్యము. అది నిర్వచింపలేని స్థితి. దానినే బ్రహ్మము అంటారు. "సత్ చిత్ ఏకంబ్రహ్మ" అదే చైతన్యము మనలను కూడా నడిపిస్తున్నది. అది త్రిగుణాత్మకము అయినప్పుడు జీవునిగా దిగివస్తుంది. అదే మనము. దానినుండే మనస్సు, ఇంద్రియాలు, బుద్ది సమస్తము దిగివచ్చాయి. కనుక దానిని తెరవెనుక ప్రజ్ఞ (Background Consciousness) అంటారు.

నిద్ర ఎలా వస్తోంది? మెలకువ రావటం అంటే ఏమిటి?

మసస్సు ఇంద్రియములు అధారంగా పనిచేస్తుంది. శరీరము మనస్సు ఆధారంగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా జీవుడు ఆధారంగా పనిచేస్తాయి. మరి జీవుడో? అతడు మరెవరో కాదు.. చైతన్య స్వరూపుడే. దానినే ప్రకృతి అనికూడా అంటారు. ప్రకృతే జీవులకు నిద్ర స్థితి కల్పిస్తుంది, మరల మెలకువ స్థితిని కలిగిస్తుంది. నిద్ర, మెలకువ కూడా రెండు వేరువేరు స్థితులు. ఇది తెలిసిన వారు యోగులు, సిద్ధులు. వారు నిద్రలో కూడా మెలకువ స్థితిని కలిగి వుంటారు. అంటే నిద్రలో వారు ఎలావున్నారో తెలిసి వుంటారు. ఎక్కడికి వెళ్ళారో కూడా తెలిసి వుంటారు. అంటే మనలో వుండే చైతన్యమే మనకు నిద్రని కల్పించి, నిద్రలో శరీరమునకు కావలసిన శక్తిని, విశ్రాంతిని సమకూర్చి మరల మేల్కొలుపుతుంది. రెండూ తగ్గిపోగానే నిద్ర వస్తుంది.

ఎవరైనా నిద్రలోనికి జారినపుడు శరీరము, మనస్సు, ఇంద్రియములు మొదలైన వన్నీ కూడా వాటి వాటి కార్యక్రములను స్తంభింపచేసి విశ్రాంతిలోకి వెళ్ళిపోతాయి. అయితే అవి విశ్రాంతి ఎక్కడ తీసుకుంటున్నాయి అంటే పైన చెప్పిన విశ్వాత్మక చైతన్యములో. అంటే తనలోనే. ఐతే అప్పుడు జీవుడు ఏమి చేస్తున్నట్లు? శరీరంలోనే వుంటాడా లేక బయటకు వెళ్ళిపోతాడా? బయటకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే తనను బంధించేవన్నీ కూడా విశ్రాంతి తీసుకుంటున్నాయి కదా! చివరికి తన స్వభావము కూడా! అప్పుడు మిగిలింది జీవుడు, వాని వాసనలు. అవే వాడిని నడిపిస్తాయి. ప్రాణసూత్రమాధారంగా జీవుడు శరీరం నుండి బయటకు వస్తాడు. అంతకు ముందు నిద్రలోనికు వెళ్ళేముందు ఎటువంటి భావములతో వున్నాడో అటువంటు భావమయ లోకములలో విహరిస్తాడు. అవే కలలుగా రకరకములైన భావోద్వేగాలకు గురి అవుతాడు. కొన్ని గుర్తు వుంటాయి, కొన్ని వుండవు. తిరిగి మళ్ళీ మెలకువ వచ్చే సరికి అదే ప్రాణ సూత్రాన్ని ఆధారం చేసుకొని దేహంలోనికి ప్రవేశిస్తాడు. శరీరము, మనస్సు, ఇంద్రియములతో అనుసంధానము చెంది వున్నపుడే జీవుడు పరిసరములను గుర్తించగలుగుతాడు. నిద్రలో అవి లేవుకనుక చుట్టూ జరిగేవి తెలియదు. నిద్రలోనికి వెళ్ళేముందు వున్న చివరి భావమే మళ్ళీ మెలకువ వచ్చిన తరువాత వుండే మొదటి భావము కూడా.

నిద్రని కనుక సరిగా అర్థము చేసుకొంటే సృష్టి కూడా అర్థము అవుతుంది. నిద్ర ప్రళయము. మెలకువ సృష్టికి మొదలు. మెలకువ వచ్చిన తరువాతనే మనము ఉన్నట్లు తెలుస్తుంది. అంటే అంతకు ముందు లేమా? ఉన్నాము. ఉన్నట్లు తెలియని స్థితిలో వున్నాము. అంటే ఉన్నట్లు తెలియని స్థితిలో నుండి, ఉన్నట్లు తెలిసే స్థితిలోనికి దిగివస్తున్నాము. దీనినే ఒకటిగా వున్నది రెండుగా మారటము అంటారు. తెలియటమే నేనున్నానని తెలియుట. ఇలా విశ్వాత్మ చైతన్యములోనుండి వేరుగా మేల్కాంచి నేనున్నాను అని తెలియుటనే అహంకారము అంటారు. అలా మేల్కాంచిన నేను తన ప్రణాళిక ప్రకారము దిన చర్యలోనికి దిగుతుంది. దీనినే తెలివి రావటము అని కూడా అంటారు. తెలివి ఆధారముగా మనస్సు, ఇంద్రియములు, శరీరములతో తన ప్రణాళికకు కార్యరూపమును కలిగించును. విథముగా ఒకటిగా ఉన్న వాడు మూడుగా (మొత్తము నాలుగు) వర్తిస్తాడు. అలాగే దైవము కూడా సృష్టిలో నాలుగు విధములైన వ్యూహములతో (వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ద) దిగివస్తాడు. మన ప్రణాళిక చిన్నది, ఆయన ప్రణాళిక పెద్దది.

వాసుదేవుడు: అంతటా నిండి వున్న విశ్వాత్మ చైతన్యము.
సంకర్షణ : వేరుగా మేల్కాంచిన స్థితి (అహంకార ప్రజ్ఞ) జీవాత్మ.
ప్రద్యుమ్న: బుద్ది ప్రజ్ఞ.
అనిరుద్ద: మనస్సు, ఇంద్రియములలో వున్న ప్రజ్ఞ.

ప్రతిరోజూ నిద్ర మెలకువ రాగానే, అంటే పూర్తిగా మెలకువ వచ్చి, ఇక మనం చెయ్యాల్సిన పనుకు గుర్తుకు రాక ముందు స్థితిలో మనం ఎక్కడ నుండి లేచాము. ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాము? మనల్ని ఎవరు నిద్ర లేపారు? ఇలాంటి ప్రశ్నలు వేసుకొని కొంత యోచన చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే నిద్రలోనికి వెళ్ళేటప్పుడే దానికి కావలసిన పునాది వేసుకోవాలి. అదెలా?

నిద్రలోనికి వెళ్ళేముందు నాది, నావి అనే వాటినన్నిటిని వదిలేసి వాటికి వీడ్కోలు చెప్పి నేనుగా నిద్రపోవాలి. అంటే పేరు, ఆస్థి, కుటుంబము, బంధువర్గము అలా అలా... అన్నీ... ప్రస్తుతానికి వాటితో పనిలేదు. నిద్రలో వాటి అవసరము కూడా లేదు కనుక వాటి గురించి ఆలోచింపక వాటికి ఆధారమైన నేనుగా మిగిలాలి. చివరకు శరీరము కూడా నేను కాదు. నిద్ర పోయిన తరువాత దానితో కూడా అవసరము లేదు కనుక దాని గురించి కూడా ఆలోచన మాని నేనైన నేనుగా, అంతటా నిండి వున్న నేనులో నేనుగా నిద్రలోనికి జారుకోవాలి. నాది, నావి అన్నీ వదిలేస్తే మిగిలేది నేనే. అలా నేనుగా నిద్రించిన వాడు తిరిగి నేనుగానే నిద్ర లేస్తాడు. ఎలా నిద్రలోనికి వెళ్ళాడో తెలిసిన వాడికే ఎలా మేల్కాంచాడో తెలుస్తుంది.

కనుక యోగ సాధనలో ఉన్నవాడు నిద్రా సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. నిద్రలో తను విశ్వాత్మ చైతన్యముతో కలసి వుంటాడు కనుక అదే భావనతో నిద్రించాలి. తను నమ్మిన గురువునో, దైవాన్నో ధ్యానము చేసి, నిద్రలో తన మనస్సు, ఇంద్రియములు వారికి అడ్డు ఉండవు కనుక తనకు కావలసిన బోధలు కాని, మార్పులు కాని అందించమని ప్రార్థన చేసి మనస్సును వారికి సమర్పణచేసి, ఉచ్ఛ్వాస, నిశ్వాసలను గమనిస్తూ నిద్రించాలి. మేల్కాంచిన తరువాత కూడా నేను లేచాను అని కాకుండా దైవమే తన రూపంలో మేల్కాంచాడు అని భావన చేసి దిన చర్యలోనికి ఉపక్రమించాలి. అలా ప్రతిరోజూ సాథన చేసిన వానికి కొంతకాలానికి దైవానుగ్రహమువల్ల తను నిద్రలో ఏం చేస్తున్నాడో తెలుస్తుంది. ఎక్కడికి వెలుతున్నాడో తెలుస్తుంది. అంతవరకు తనకు తెలియని ఎన్నో లోకాలను చూడగలుగుతాడు. దేహము లేకపోయినా తను ఉన్నట్లు తెలుస్తుంది. కనుక మరణం అంటే భయం పోతుంది. ఎందుకంటే శరీరం పోయినా తను ఉంటాడు కనుక. విషయాన్ని అనుభవపూర్వకముగా తెలుసుకొన గలుగుతాము.

ఇలాంటి ఉత్సాహముతో నిద్రించినవాడు అంతకు మించిన ఉత్సాహముతో మేల్కాంచుతాడు. అలాకాక అనేక సమస్యలను గురించి అలోచిస్తూ నిద్రించినవాడు అదే సమస్యల యొక్క భావనతో నిద్ర లేస్తాడు. సమస్యలు ఉన్నా వాటిని రేపటి కోసము ఎదురుచూడమని తను మాత్రము దైవముతో అనుసంధాము చెంది నిద్రించినవాని సమస్యలకు చక్కని పరిష్కారము కూడా దొరుకుతుంది.

కనుక అందరూ నిద్రను చక్కని యోగ సాథనగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.