Monday, October 17, 2016

"పోతన భాగవతం" లోని మరికొన్ని పద్యాలు


7-46-ఉ.
మచ్చిక వీరికెల్ల బహుమాత్రముఁ జోద్యము దేహి పుట్టుచుం
జచ్చుచు నుంటఁ జూచెదరు చావక మానెడువారిభంగి నీ 
చచ్చినవారి కేడ్చెదరు చావున కొల్లక డాఁగ వచ్చునే
యెచ్చటఁ బుట్టె నచ్చటికి నేఁగుట నైజము ప్రాణికోటికిన్.

7-49-ఆ.
ధనము వీథిఁ బడిన దైవవశంబున
నుండు; పోవు మూల నున్న నైన
నడవి రక్ష లేని యబలుండు వర్ధిల్లు
రక్షితుండు మందిరమునఁ జచ్చు.

7-51-సీ.
పాంచభౌతికమైన భవనంబు దేహంబు
పురుషుఁడు దీనిలోఁ బూర్వకర్మ
వశమున నొకవేళ వర్తించు దీపించుఁ
దఱియైన నొకవేళఁ దలఁగి పోవుఁ
జెడెనేని దేహంబు జెడుఁగాని పురుషుండు
చెడ డాతనికి నింత చేటులేదు
పురుషునకిని దేహపుంజంబునకు వేఱు
గాని యేకత్వంబు గానరాదు

7-51.1-ఆ.
దారువులఁ వెలుంగు దహనుని కైవడిఁ
గాయములఁ జరించు గాలిభంగి
నాళలీనమైన నభము చాడ్పున వేఱు
దెలియవలయు దేహి దేహములకు.

ప్రహ్లాద చరిత్రలోని పద్యములు

7-123-శా.
పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాస లీ
లా నిద్రాదులు చేయుచుం దిరుగుచున్ లక్షించుచున్ సంతత
శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృ తాస్వాద సం
ధానుండై మఱచెన్ సురారిసుతుఁ డే త ద్విశ్వమున్ భూవరా!

7-130-క.
"చదువనివాఁ డజ్ఞుం డగు
జదివిన సదసద్వివేక చతురత గలుగుం
జదువఁగ వలయును జనులకుఁ
జదివించెద నార్యులొద్ధఁ జదువుము తండ్రీ!"

7-167-మ. నవవిధ భక్తి
తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్ సత్యంబు దైత్యోత్తమా!

7-170-సీ.
కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే? ;
పవన గుంఫిత చర్మభస్త్రి గాక
వైకుంఠుఁ బొగడని వక్త్రంబు వక్త్రమే? ;
ఢమఢమ ధ్వనితోడి ఢక్క గాక
హరిపూజనము లేని హస్తంబు హస్తమే? ;
తరుశాఖ నిర్మిత దర్వి గాక
కమలేశుఁ జూడని కన్నులు కన్నులే? ;
తనుకుడ్యజాల రంధ్రములు గాక;
చక్రిచింత లేని జన్మంబు జన్మమే
తరళ సలిల బుద్బుదంబు గాక
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే
పాదయుగముతోడి పశువు గాక.

7-171-సీ.
సంసారజీమూత సంఘంబు విచ్చునే? ;
చక్రిదాస్యప్రభంజనము లేక
తాపత్రయాభీల దావాగ్ను లాఱునే? ;
విష్ణుసేవామృతవృష్టి లేక
సర్వంకషాఘౌఘ జలరాసు లింకునే? ;
హరిమనీషా బడబాగ్ని లేక
ఘనవిప ద్గాఢాంధకారంబు లడగునే? ;
పద్మాక్షునుతి రవిప్రభలు లేక;

నిరుపమాపునరావృత్తి నిష్కళంక
ముక్తినిధిఁ గానవచ్చునే? ముఖ్యమైన
శార్ఙ్గకోదండచింతనాంజనము లేక
తామరసగర్భునకు నైన దానవేంద్ర!

7-181-ఉ.
"అచ్చపుఁ జీకటింబడి గృహవ్రతులై విషయప్రవిష్టులై
చచ్చుచుఁ బుట్టుచున్ మరలఁ జర్వితచర్వణు లైన వారికిం
జెచ్చరఁ బుట్టునే పరులు చెప్పిన నైన నిజేచ్ఛ నైన నే
మిచ్చిన నైనఁ గానలకు నేఁగిన నైన హరిప్రబోధముల్.

7-182-ఉ.
కాననివాని నూఁతగొని కాననివాఁడు విశిష్టవస్తువుల్
గానని భంగిఁ గర్మములు గైకొని కొందఱు కర్మబద్ధులై
కానరు విష్ణుఁ, గొంద ఱటఁ గందుఁ రకించన వైష్ణవాంఘ్రిసం
స్థాన రజోభిషిక్తు లగు సంహృతకర్ములు దానవేశ్వరా!

7-214-సీ.
కంటిరే మనవారు ఘనులు గృహస్థులై
విఫలులై కైకొన్న వెఱ్ఱితనము
భద్రార్థులై యుండి పాయరు సంసార
పద్ధతి నూరక పట్టుబడిరి
కలయోనులం దెల్ల గర్భాద్యవస్థలఁ
బురుషుండు దేహి యై పుట్టుచుండుఁ
దన్నెఱుంగఁడు కర్మతంత్రుఁడై కడపట
ముట్టఁడు భవశతములకు నయిన

దీన శుభము లేదు దివ్యకీర్తియు లేదు
జగతిఁ బుట్టి పుట్టి చచ్చి చచ్చి
పొరల నేల మనకుఁ? బుట్టని చావని
త్రోవ వెదకికొనుట దొడ్డబుద్ధి.