Thursday, August 20, 2009

యజ్ఞార్థ జీవనము (Service oriented life)

నీవు సేవ చేస్తున్నావు అనే విషయం మరచే వరకూ సేవ చేస్తూనే వుండు.

--మాస్టర్ .కె

ప్రస్తుత కుంభ యుగంలో మనచుట్టూ వున్న బృందము లేక సంఘమునే దైవమని చెప్పబడినది. మన చుట్టూ వున్న వారికై చేయు సేవయే దైవమునకు చేయు సేవ. బృందముకుటుంబము కావచ్చు, లేక మనమున్న సంఘము కావచ్చు. "జీవునకు చేయు సేవయే మాథవునకు చేయు సేవ" ఒక్కనిగా వున్న దైవ ధ్యానము నుండి మన చుట్టూ వున్నసంఘ ప్రజ్ఞగా దైవ ధ్యానమును పెంచుకొనవలెను. దైవమును ఒక్క గురువు యందే కాక సమస్తము నందు దర్శించవలేను. అప్పుడు దైవము విశ్వాత్మకుడై జగద్గురువైదర్శనమిచ్చును. అదే సమన్వయమునకు మూల సూత్రము. మానజాతి పరిణామమునకు సంకల్పించిన వరుణుడు ( తత్వము యురేనస్ గ్రహము ద్వారా పనిచేస్తుంది)జీవులకు యజ్ఞార్థ జీవనాన్ని తప్పని సరి చేస్తాడు.

సేవను గూర్చి మనం అనేక చోట్ల చదువుతూ వుంటాం, వింటూ వుంటాం. ఎక్కువగా మాట్లాడే వాడు తక్కువగా పని చేస్తాడని గ్రహించాలి. ఎక్కువగా చెప్పటం వల్ల ఏమీ ఉపయోగంలేదు. తోటి వానికి సహాయమందించటానికి అనేక మార్గములున్నాయి. ఫలితమాసింపక ఇతరులకు సహాయ పడే వాడు ఉత్తమైన అభివృద్దిని పొందుతాడు. అభివృద్ది కోసం సేవచేయరాదు. అందరికన్నా నేను ముందు, అందరికన్నా నాకే ఎక్కువ ఉండాలి అనే భావము యజ్ఞార్థ జీవనానికి పెద్ద అవరోథము. నిస్వార్థ సేవ ఎంత పెరిగిన అంత వెలుగు, అభివృద్దిసేవకునకు పెరుగును. దానికోసం ప్రాకులాడనవసరం లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా యజ్ఞార్థ జీవనానికి పెద్ద పీట వేసినాడు. దైవమును చేరు మార్గముగా చెప్పినాడు.మనలోని కర్మ ప్రక్షాళనకు అదియే సరియైన మార్గము.

ఇటువంటి జీవనమునకు కావలసినది గొప్ప సంకల్ప శక్తి మరియు సంసిద్దత. సేవ చేయవలసినది ఒక్క మానవులకే కాదు. తన చుట్టూ వున్న జంతువులకు, వృక్షములకుమరియు లోహములకు కూడా. అసలు మానవ జన్మ సేవ కొరకే. పరమ గురువులు 21 శతాబ్దాన్ని "Century of Charity" అని నామకరణం చేసారు. ధనిక దేశాలన్నీకూడా ఉన్నది పది మందితో పంచుకోనక పోతే మనుగడ వుండదు అని తెలుసుకుంటాయి. మనం సుఖంగా వుండాలంటే మన చుట్టూ వున్న వారుని కూడా చూచుకోవాలి కదా!తోటి జీవిని నిరాకరించిన వారికి ఉన్నత పరిజ్ఞానం కలుగుటకు అవకాశము లేదు.

ఆధ్యాత్మిక మార్గములో ఉన్నతిని ఆశించువారు చేయవలసినది యజ్ఞార్థ జీవనమే. అది నిస్వార్థమై వుండాలి. తన జీవితమునకు అవసరమైనంత వరకు మాత్రమే గ్రహించి తోటిజీవులకు సేవ చేస్తూ జీవనము కొనసాగించాలి. దీనితో పాటుగా ఇది కావాలి, ఇది వద్దు అనే కోరికలను విడనాడవలేను. కావాలి అన్నా, వద్దు అన్నా రెండు కోరికలే కదా? కోరికబంధిస్తుంది. మోక్షము అనగా బంధము లేని స్థితి. అనగా మోక్షాన్ని కూడా కోరుకో కూడదు. ఏది కోరినా అది కోరికే కదా! కోరిక వల్ల మన సూక్ష దేహం దెబ్బ తింటుంది. అందువల్లమన సహజ స్థితి మనకు తెలియకుండా పోతుంది.

కోరికలు లేక తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ యజ్ఞార్థ జీవనం గడిపే వారికి సూక్ష్మ దేహం పటిష్టమై తమ స్వస్వరూపం తెలియటానికి అవకాశం కలుగుతుంది. మృత్యువు లేదు అనితెలుస్తుంది. అటువంటి వారికి సద్గురువు అనుగ్రహం లభిస్తుంది. తనేవరో తెలుస్తుంది. అంటే నేను అంటే ఏమిటో తెలుస్తుంది. అప్పుడు నేను నాది అనే భేధము అవగతమవుతుంది. అలా సాధన సాగిన కొద్దీ ఉన్నది మనం అనుకునే నేను కాదు, అతడే అని తెలుస్తుంది. ఎవరతడు? సర్వాంతర్యామియైన భగవంతుడు. మొదట తెలిసేది "అహమస్మి"అంటే నేనున్నాను అని. తరువాత "సోహమస్మి" అనగా అతడే నేనుగా వున్నాడు అని. చివరకు "బ్రహ్మాహమస్మి" ..బ్రహ్మమే నేనుగా వున్నాడు అని. బ్రహ్మమైతే సమస్తమునందు నిండి వున్నాడో అతడే నేనుగా వుండి ప్రవర్తిస్తున్నాడు అని పూర్ణముగా తెలియబడి తాను అదై పోతాడు. అదే ముక్త స్థితి. అదే అధ్వైత స్థితి. రెండుగా లేక ఒకటిగా వుండటం.

విశ్వాత్మక చైతన్యములోని భాగమే మనం. అంటే పెద్ద చైతన్యములో నుండి విడిపడిన చిన్న చైతన్య స్వరూపులం. అల సముద్రములోదే అయినా అది వేరుగా కనపడినట్లు. ఆచైతన్యం త్రిగుణాలనుండి బయటకు వచ్చేసరికి వాటి ప్రభావంచే ప్రత్యేకించబడి ప్రత్యగాత్మలమై వేరుగా నేనున్నాను అని అనుకుంటుంది. అదే జీవుడు. త్రిగుణములకు అవతలవున్నవాడు దేవుడు, వాటి ద్వారా దిగి వచ్చిన వాడు జీవుడు. నిజమునకు దేవుడు, జీవుడు ఒకటే. ఎంత వేరుగా వున్నాము అని భావిస్తే అంత గట్టిబడి వేరై పోతాం. అంటే సహజస్థితి నుండి వేరై పోయిన వాళ్ళం. తప్పిపోయాం అంతే.

అలా వేరైన జీవుడు తిరిగి విశ్వాత్మక చైతన్యంలో కలవటమే తిరుగు ప్రయాణం. మూలము నుండి వేరైనప్పటి నుండి ఏర్పరచుకున్న పొరలన్నీ విడిపోయి తిరిగి తన స్వస్వరూపంతెలియాలి. అది అంత తేలికయిన విషయం కాదు. సహజంగా జ్ఞాన స్వరూపుల మైన మనం అది మరుగున పడుట వలన ఏర్పడిన అజ్ఞానము వలన ఎన్నో అవరోధములనుఏర్పరచుకొని వున్నాము. అది తొలగించుకొనుటకు కావలసినది శ్రద్ద, భక్తి, జ్ఞాన వైరాగ్యములు మరియు సద్గురు చరణాశ్రయము. దైవమే సద్గురు రూపమున తిరుగుప్రయాణమునకు సిద్ద పడిన జీవులకు సహాయ మందిచటానికి దిగి వస్తాడు. గురువు అందిచిన మంత్ర శబ్దములు తన ఛేదన గుణముచే సాథకుని యొక్క ఒక్కొక్క పొరను ఛేదిస్తూతన వెలుగు తనకు దర్శనమయ్యేటట్లు చేస్తాయి. మంత్రము ద్వారా పనిచేసేది గురువే.

దైవమును ప్రార్థించవలసినది ఒక్కటే!

"ప్రభూ! నా చుట్టూ వున్నవే నేననుకొని భ్రమించి వున్నాను. నీవే నా యందు నేనై నన్ను అనుగ్రహించు. నన్ను రక్షించు. నాకు ఏది మంచో తెలియదు. నాకు ఏది శ్రేయస్సు అనినీవు భావిస్తే అది నాకు అనుగ్రహించు. నీ నిర్ణయము నాకు శిరోధార్యము. నాయందు నేనై నన్ను నడిపించు"

భగవంతుడు కరుణామయుడు. ఆర్తితో ప్రార్థించిన వానిని అనుగ్రహిస్తాడు. సమస్తము తానై నడిపిస్తాడు. అందుకు సాథకుడు సంసిద్దుడై నిస్వార్థమైన యజ్ఞార్థ జీనము సాగిస్తూ తనచుట్టూ వున్న వారికై జీవించాలి. తన కర్తవ్యాన్ని ఎట్టి పరిస్థితులలోనూ వదల కూడదు. కర్తవ్యమే భాధ్యత. బంధం బందిస్తుంది. భాద్యత బంధ విముక్తుడ్ని చేస్తుంది. ఇటువంటిజీవనము వలన ప్రపంచము బృందావనమై వసుదైక కుటుంబమై వర్థిల్లుతుంది.