Wednesday, August 19, 2009

బృంద జీవనము (Group Living)


ఆత్మ, వ్యక్తి యొక్క స్వభావము ద్వారా వ్యక్తమై అతణ్ణి అనేక విధములైన పనులలో నియమించి ఎదో ఒక రోజు తన స్వభావమును అధిగమించి జీవునిగా జీవితము యొక్క ఆనందమును అనుభవించే వైపు నడిపించే ప్రయత్నము చేస్తుంది. ప్రయత్నములో జీవునికి, స్వభావమునకు మధ్య గెలుపు ఓటములు సహజంగా వుంటాయి. కొన్ని సార్లు జీవుడు గెలిస్తే, కొన్ని సార్లు స్వభావము గెలుస్తుంది. రెండిటి మధ్య అనుకూలతను సాధించుటయే సాధన. బృంద జీవనము వలన జీవుడు బలమై స్వభావముతో మంచి సంబంధము ఏర్పడును. లోపల బంధము ఎంత బలపడిన బయటి జీవితము నందు అంతటి ఆనందము వుండును. అతని ప్రజ్ఞ ఊర్థ్వమై, బుద్ది వికసించి, వెలుగు మయుడై ప్రేమ తత్వమును ప్రసరింప చేయును. ఆత్మతత్వము స్వభావమును అదిగమించినకొలదీ అతని చుట్టు చక్కని ఆహ్లాదకరమైన వాతావరణము ప్రసరింపబడును. అలా కాక తద్విరుద్దమైన వాతావరణ ముండిన, అప్పుడు మన స్వభావము గెలిచినదని భావింపవలెను.

చుట్టూ వున్న వారికి సాధకుడు ఎంత సహాయకారిగా వున్నాడు అను దానిని బట్టి అతని సాధనలో ఎంత వరకు వచ్చాడో తెలుస్తుంది. అందరి కన్నా నేను వేరు అన్న భావన దాటని వాడు బృందముతో సరియైన సంబంధము కలిగి యుండలేడు. ఒక్క రోజులో భావన దాటటం సాధ్య పడదు. దానికి తనకు తాను నియమించుకున్న క్రమశిక్షణ ఎంతో అవసరం. తన అవసరముల కన్నా తన చుట్టూ వున్న వారి అవసరములు ముఖ్యము. వారి అవసరములకే ఎక్కువ ప్రాముఖ్యత ఉండవలెను. వారు ముందు తను తర్వాత. ప్రతి సాధకునికి మొదటి బృందము అతని కుటుంబమే. తరువాత మిగిలినవి. కుటుంబముతో సరియైన సంబంధములు లేని వారు సాధనలో పురోగతిని సాథించలేరు.

వరుణ (Urenus) గ్రహ ప్రభావము వలన అందరూ బృందాలు బృందాలుగా జీవించి బృందావనాలు ఏర్పాటు చేసుకోవటం అనేటటువంటిది భవిష్యత్తులో ఒక కార్యక్రమంగా జరుగబోతోంది. పదిమంది ఒకచోట చేరితే అందరి కోణాలు ఒకరికొకరితో రుద్దుకొని సమమైన కోణాలుగా ఏర్పడతాయి. కోణాలంటే ఎవరి అభిప్రాయములు వారివి, ఎవరి స్వభావము వారిది. సాధన అంతా స్వభావమును దాటుటకే.

ఒక మనిషితో ఇంకొకరికి పడకపోవటం సహజం కదా! ఎంత పడక పోవటం అంత జబ్బు. ఎంత కలుపుకొని అందరితోనూ హాయిగా వుండటం అంత ఆరోగ్యం. మనలో చైతన్యం కరుడుగట్టిన కొద్దీ మనకు ఎవరూ నచ్చరు. వాళ్ళు కలవరు, కలుద్దాం అనుకొనేవారికి కలుపుకోరు. అది ఒక దుస్థితి. అటువంటి వారు మనకు ఎవరూ లేరు అనే భావల్లో జీవిస్తూ వుంటారు.

మాస్టరు .కె గారు మంద్రజాలము అనే నవల్లో "కోటాను కోట్ల జీవులు కట్టలు కట్టలుగా ఒక చోటే జీవిస్తూ ఎవరికి వారుగా ఒంటరిగా జీవిస్తూ వుంటారు. ఇంతకన్నా కలి చేసే ఇంద్రజాలం ఏముంది?" అని వ్రాసారు. అలా జీవించడం కంటే దురుదృష్టం ఏముంది.

ధనం అంటే ఎమిటి? నిజమైన ధనం అంగ బలం. మోసుకెళ్ళటానికి కనీసం నలుగురుండాలి అనే నానుడి వున్నది కదా! ఎప్పుడూ జీవితంలో ఒక వంద మంది ఉన్నారనుకోండి, అంతకన్నా సంపద ఏముంది. ఎంత ధనమున్నా ఒంటరి వాడికి సహాయమందదు. పది మందికి పనికొచ్చే జీవితమే జీవితం. కలిసుండే జీవితమే జీవితం. కలసిమెలసి జీవించి ఉండటమే మార్గం. యుగంలో మనుషులు కలసిమెలసి ఉంటే సుఖపడతారు అనే సందేశము ప్రథానంగా వరుణుడిచ్చే సందేశము. విథమైన జీవనం ఇంకా మన భారత దేశములో మిగిలివుంది. పాశ్చాత్య దేశములలో చాలా తక్కువ. వాళ్ళను చూసి మనం కూడా పాడై పోతున్నాం.

వేర్పాటుకే మనసొప్పుతుంది కాని, కలవడానికి మనసొప్పుకోదు. అంటే, కలి పనిచేస్తున్నాడని అర్థం. ఎంత కలవడానికి మనస్సు ఉఱ్ఱూతలూగుతుందో అంత కల్కి పని చేస్తున్నాడని అర్థం. కలిసి జీవించడం జరిగినప్పుడు వ్యక్తిగత చైతన్యం సామూహిక చైతన్యంలో మునుగుతుంది. ఎలాగంటే ఒంటరితనం బాగా అనిపించినపుడు అలా బయట (అంటే జన సమర్థం బాగా ఉన్న ప్రదేశాల్లో) తిరిగి నపుడు మనసు హాయిగా వుండి ఆనందం కలుగుతుంది. పెద్ద చైతన్యంలో చిన్న చైతన్యం మునిగి నపుడు హాయి, ఆనందం కలుగుతాయి.

ఒంటరి జీవనము కుంభ యుగములో ఒక శాపము. ఎందుకంటే బృంద జీవనము కుంభ యుగపు లక్షణము. కలసిమెలసి జీవించటములో శక్తి ప్రసారము బాగా వుంటుంది. దానివల్ల మనలోపల లోలోపల వున్న శక్తి ప్రసార అవరోధకములు తొలగింప బడతాయి. అందరికి దూరముగా ఒంటరిగా ఉండాలి అనేది కూడా ఒకరకమైన అవరోధము. ఎకాంతము అవసరము కాని, ధ్యానము కొరకు పర్వతముల పైకి, అరణ్యములలోనికి వెళ్ళటం వలన ఉపయోగము లేదు. ఎకాంతము వేరు, ఒంటరితనము వేరు. ఎకాంతము మానసికమైనది, ఒంటరితనము భౌతికమైనది. అందరితో సరియైన సంబంధములను ఏర్పరచుకొని స్వార్థము లేక అందరికొరకు జీవించుటయే యజ్ఞార్థ జీవనము. చిన్న, పెద్ద భేధము లేక అందరియందు సమ భావము కలిగి యుండవలెను. కనుకనే శ్రీకృష్ణుణ్ణి బృందావన విహారి అంటారు. ఎక్కడ చక్కని అన్యోన్యమైన బృంద జీవనము ఉంటుందో అక్కడ శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహము ఉంటుంది. అదియే ముక్తికి మార్గము.