Wednesday, August 5, 2009

గురుతత్వము


నేను అని అనకుండా వుండే మానవుడు భూమి మీద ఉండడు. సాధారణంగా నేను అంటే అది మన పేరుగానో, శరీరంగానో మాత్రమే అనుకుంటాం. నిజంగా అవేనా నేను అంటే? ఒకవేళ అదే నిజం అయితే నాపేరు, నా శరీరం అని ఎందుకంటాం? నా చెయ్యి, నాకాలు, నాతల అని అంటూవుంటాం కదా? అలాగే పేరు కూడా. అవన్నీ నిద్రలో ఏమయ్యాయి? మెలకువ వచ్చినప్పుడే ఎందుకు గుర్తు వస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు మన దగ్గర సమాధానం లేక ఎవరైనా అడిగితే కోపం వస్తుంది, అడిగిన వాడు పిచ్చివాడు అని పిస్తుంది.

మనకున్నవన్నీ ఒక లిస్ట్ వ్రాస్తే అవన్నీ నావి గానూ, ఒకే ఒక్కటు నేను గానూ మిగులుతుంది. అయితే నేను ఎవరు? తెలియదు. మనకున్న పరిమితమైన జ్ఞానంతో ఆలోచిస్తే అస్సలు తెలియదు.

అలా మనం ఎవరో తెలియక తికమక పడుతూ మన చుట్టూ వున్న వాటితో మనల్ని అన్వయించుకొని ఏకత్వం చెందుతూ అవే మనం అనుకుంటూ కాలం అనే ప్రవాహంలో కొట్టుకుపోతున్న మానవ జాతిని మేలుకొలిపి మానవుడు తన నిజ స్వరూపం తెలుసుకోవటం కోసం భగవంతుడు ఎంతో కరుణ గలిగి తనను తెలిసిన కొందరిని పంపుతాడు. వారికి, వారు వచ్చిన పని తెలిసి, పంపినదెవరో తెలిసి మానవుని అభ్యున్నతి కోసం శ్రమిస్తారు. శ్రమను మరచి జాతిని ముందుకు నడిపిస్తారు. వారిని అనుసరించిన వారికి జ్ఞానమును అందించి కర్మయోగ రహస్యములను తెలిపి తిరిగి వారు సేవా మార్గములో ఎలా తరించి తమను తెలుసుకొని దైవాన్ని చేరవచ్చో ఆచరించి తెలియ పరుస్తారు. వారే సద్గురువులు. దైవానికి, సాధకునికి మద్య ఒక వారధి వలే పనిచేస్తారు.

మేము సద్గురువులం అని చెప్పరు. వారు దైవ సంకల్పాన్ని అనుసరించి తన కర్తవ్యములను నిర్వర్తిస్తూవుంటారు. వారిని అనుసరించిన వారు మార్గము తెలియబడి తరిస్తారు, అనుసరించని వారు మార్గము తెలియక కాల ప్రవాహంలో కొట్టుకొని పోతూ వుంటారు.

సాధారణంగా మనమెవరో తెలియక మనచుట్టూ వున్న వాటిని మనవిగా భావించి అదే మనం అనుకుంటూ వుంటాం. అవి మనవి కాని, మనము కాదు. సద్గురువు భేధము తెలిపి, తెలియజేసి మనలను మన స్వస్వరూపము వైపు నడిపించును. అప్పుడు మనము "నాదైన నేను నుండి నేనైన నేనుగా" ద్విజత్వము చెందెదము.

నాదైన నేను అనగా నాదిగా భావిస్తున్నవే నేనుగా అనుకొందుము. "కొందరు తమ శరీరమే తామనుకొందురు" అని మాస్టరు E.K గారు చెబుతూ వుండే వారు. అదన్నమాట. ఎక్కడ చిన్న తేడా వచ్చినా అది తమకే చెందిన భాధగా అనుభవిస్తూ వుంటారు. అంటే ఎవరైనా మన ఇంటి గోడకు మేకు కొట్టినా, లేక మన కారో, సైకిలో మొ|| వాటికి ఎమైనా అయ్యినా అది మనకే అయినట్లు విపరీతముగా వ్యధ, భాధ చెందుతాము. అంటే అదే మనంగా వున్నట్లేగా!

ఇటువంటి స్థితి నుండి మనలను ఉద్ధరించి సత్యము వైపు నడిపించుటకు దైవమే గురువుగా దిగివచ్చి పనిచేయును. దైవతత్వమే గురుతత్వము. గురువే దైవము. అలాంటి గురువును పూజించుట మన భారతీయ సాంప్రదాయములో పెద్ద పీట వేసినారు.

గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః |

గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ||

గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. అతడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము. ఎవరీ గురువు? తత్వమైతే సమస్త జగత్సృష్టికి ఆదారమై యున్నదో తత్వమే గురుతత్వము. అతడ్ని ఈశ్వరుడు అనియు, నారాయణుడు అనియు, జనన్మాత అనియు రకరములుగా పెద్దలు చెప్పారు. English లో MASTER అని అంటారు. అతడే అన్నిటికిని స్వామి, ప్రభువు. తత్వము ఎవరి ద్వారా ప్రసరించి పనిచేస్తుందో అతడే ప్రత్యక్ష గురువు.

గురువు అపరిమితుడు. ఎల్లలు లేని వాడు. సత్చిదానంద స్వరూపుడు. అతడు బహ్మయై మనలోని కల్పనా శక్తిగా, విష్ణువై జ్ఞానముగా, మహేశ్వరుడై ఆలోచనగా అవతరించును. అవే క్రియాశక్తి, జ్ఞాన శక్తి, ఇచ్ఛాశక్తి స్వరూపములు. గురు శిష్య సాంప్రదాయములో శిష్యుని సంబంధము సూటిగా గురువుతోడనే. మిగిలినవన్నీ అతని తరువాతే. గురువు ద్వారా దర్శించవలసినది సమస్త జగత్తుకు గురువైన జగద్గురువును (Master of Universe). జగద్గురువే మనలోని క్రియా శక్తిగా, జ్ఞాన శక్తిగా, ఇచ్ఛా శక్తిగా దిగివచ్చును. అతడే మూడు శక్తులకు మూలమై వాటికి అతీతమై వుండును. అట్టి గురువునకు నమస్కరిస్తున్నాను.

జీవితంలో సద్గురువు లభించడం ఎన్నో జన్మల పూర్వ కర్మ విషేషం చేత లభిస్తుంది. మనంతట మనం ఎప్పుడూ గురువును పొందలేము. సాధకుని అదృష్టము చేత అతడు గురువు చేత ఎన్నుకొనబడతాడు. ఎన్ని జన్మలైనా అతని వెన్నంటి సరిదిద్ది సరియైన మార్గములో నడిపిస్తాడు.

మనం ఎన్నుకొన్న గురువు మనయొక్క స్వభావము అనుసరించి లభించును. అప్పుడు అతడు మనకు నచ్చవచ్చును, లేక నచ్చక పోవచ్చును. అది గురు శిష్య సంబంధ మనిపించుకొనదు.

గురువుచే ఎన్నుకొనబడినవాడు, గురువునకు తనను తాను సమర్పించుకొని అతని దివ్య ప్రణాళికలో భాగంగా పని చేయును. సాధకుని స్వభావము ననుసరించి సద్గురువు అతనికి సాధననందించును. అతని పట్టుదల, దీక్ష, సాధన యందు అతనికి గల అచంచల శ్రద్ద ననుసరించి గురువు అతనిని ఒక్కొక్క సోపానము ఎక్కించును.

అలా శిష్యుడు తనంతటి వాడేయ్యంత వరకు గురువు పనిచేయును. ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్లుగా శిష్యుడు గురువై, గురు శిష్య సాంప్రదాయమును నిరంతరం కొనసాగించును.