Tuesday, August 4, 2009

చనిపోయేముందు తెలుస్తుందా?

ఆధునిక యుగమున మానవతా విలువలను, మానవ ధర్మమును అర్ధమగు రీతిలో ప్రజలకు వివరించి చెప్పవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. సక్రమమగు మార్గము తెలియక అనేకమంది పెడత్రోవలు పట్టుచున్నారు. కనుక సంప్రదాయ పరమైన, శాస్త్రీయమైన సన్మార్గమును నేటి తరమునకు చూప వలసిన గురుతరమైన బాద్యత పెద్దలపై ఉన్నది. మానవజాతెపై గల అపారమైన ప్రేమతో అట్టి సన్మార్గముని నవయుగమునకు కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య (మాష్టర్ ఇ.కె.) చూపించిరి. అడిగినవారికి వివరించి చెప్పి, గ్రంథస్థము కూడ చేసిరి.

మాస్టరు ఇ.కె గారిని ఎంతో మంది సన్మార్గమునుకోరి, ఆసక్తితో అనేక విషయములపై ప్రశ్నలు వేయుచుండెడివారు. వాటిలో కొన్ని ఇక్కడ తెలియపరచుటకు ప్రయత్నిస్తున్నాము.



చనిపోయేముందు తాము చనిపోతున్నామని, ఆ చనిపోబోయే వారికి తెలుస్తుందా? ఒకవేళ తెలుస్తే అప్పటి అనుభూతి ఎలా వుంటుంది? అన్న ప్రశ్నకు మాస్టర్ ఇ.కె గారు ఇచ్చిన సమాధానం:

చాలామందికి చావు అంటే ముఖ్యంగా సొంతచావు అంటే అంతో ఇంతో భయం వుంటుంది. వాళ్ళకి మాత్రం చనిపోయే సమయంలో తెలిస్తే గుండే బేజారై పోతుంది. అలాంటి వాళ్ళకి ఇంకా కొంచెం ముందుతెలిస్తే ఆ భయంతో చచ్చిపోవచ్చు. అలాంటి వాళ్ళకు ఆ సమయంలో ప్రకృతి తెలియకుండా చేస్తుంది. అంటే మృత్యువుకు ముందు తెలివి తప్పుతుంది. భయం ఎంత తీవ్రంగా వుంటే అన్ని గంటలో, రోజులో, నెలలో తెలివి తప్పున స్థితిలో ఉండిపోతారు. ఆ స్థితిలో ప్రకృతి శక్తులు మత్తుఇచ్చి అట్టే పెట్టి ప్రాణానికి దేహానికి మధ్య బిగించి వున్న మేకులన్నీ పీకుతారు. దేహధాతువుల్ని పంచభూతాలలోకి మలచి పార్శిల్ కట్టి వి.పి చేస్తారు. తీరా పనంతా పూర్తి అయిన తరువాత మత్తు వదలి తెలివి వస్తుంది.

ఇక మృత్యుభీతి తొలగిపోయినవారు తప్పకూండా ఆరోగ్యవంతులు, జ్ఞానులు, ప్రసన్నులు, వైరాగ్య సంపన్నులు అనే కోవలో దేనికో ఒక దానికి చెంది వుంటారు. అలాంటి వాళ్ళకి కలగబోతున్న దేహ పరిత్యాగం స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళకి చనిపోవడం వుండదు. దేహం విడవటం మాత్రం వుంటుంది. వెన్నెముక దిగువనుండి పైకి వీణమీటల్లాగ అనిపిస్తుంది. అలా ఎందుకనిపిస్తుందంటే చైతన్యం మూలాధారం నుండి ఊర్థ్వగతి పడుతుంది. ఇంద్రియాలకు ఇంద్రియార్థాలు అందవు - ఏదో ఆలోచిస్తూ వుంటే కంటి ఎదుట నున్న వస్తువులు కనిపించనట్లు. అటుపైన ప్రజ్ఞ శ్వాస కలసి ఒక్కటి అవుతాయి. ఆ ఒక్కటి నిలిచిపోతుంది. ఇంకొక కక్ష్యలో ప్రజ్ఞ మేల్కొంటుంది. ఇలా మహానుభావులకు జరుగుతుంది.

అలాకాక పీకులాటలు, పితలాటలు వున్నవాళ్ళకి కళ్ళు, చెవులు అన్నీ పనిచేస్తూనే వుంటాయి. చుట్టువున్న వాళ్ళు చేసే గోలంతా తెలుస్తూనే వుంటుంది. కానీ ఏ భాగము తన ఆధీనంలో వుండదు. శ్వాస ఆడుతూవున్నా మాట మొదలైనవి సాధ్యపడవు. ఏడవటానికిగాని, మాట్లాడటానికి గాని, తల ఊపటానికి గాని అవసరమైన కీళ్ళ మేకులన్నీ ఊడిపోయి వుంటాయి. ఉదాహరణకు వెనకడిప్ప ఊడదీసిన గడియారంలో ముళ్ళ చక్రాల్లాగ అన్నీ కొంతసేపు తిరుగుతునే వున్నా ఏమీ స్వాధీనంలో వుండదు. బాకీలు వసూలు కాలేదని, భార్యాబిడ్డలు ఆదరించలేని తీవ్రంగా తాపత్రయపడే వాళ్ళకి ఇలాంటి స్థితి కొన్ని రోజు లుండవచ్చు. అంటే ఇలాంటి వాళ్ళు నరక మనుభవిస్తూనే దేహం వదులుతారు. అందుకే అన్నారు మనవాళ్ళు - చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత అని.

ఒక వ్యక్తి చనిపోయిన తరువాత అతనేమౌతాడు అన్న ప్రశ్నకు మాస్టరు గారు ఇచ్చిన సమాధానం:

చనిపోవడంలో పోవడం అనేది ఏమీ వుండదు. మనిషి అంటే చోటుతో(ఆకాశం), మట్టితో, నీళ్ళతో, గాలితో మరియు వెచ్చదనం (అగ్ని)తో చేయబడిన ఒక బొమ్మ. ఆ బొమ్మ మధ్య వున్న చోటు మనిషిగా మేల్కొని పనిచేస్తూ వుంటుంది. శబ్దంచేస్తూ ఇద్దరి మధ్య వున్న చోటు ధ్వని తరంగాలుగా ఎలా మేల్కొంటుందో అలాగే శ్వాసచేసే గుండెకాయలో వున్న చోటు ఆల్టర్‌నేషన్ ఆఫ్ కరంట్స్ (Alternation of Currents) గా మేల్కొని ఎలక్ట్రో మేగ్నెట్ (Electro Magnet) లాగా జీవ తరంగాలను పంపుతుంది. పంపడం మొదలు పెట్టేవరకు ఆకాశంలో వున్న శక్తి స్టార్టర్ (Starter) గా పనిచేస్తుంది. పంపటం మొదలు పెట్టాక గుండెకాయలో ఆకాశాన్ని మేల్కొలిపే శక్తి వేరవుతుంది. అప్పటినుండి దాని ఆధీనంలో శరీరం పనిచేస్తూ వుంటుంది. అలా వేరైన మేలుకొలుపునే జీవుడు అంటాము. ఒకసారి వేరైన తరువాత మళ్ళా అది చోటుగా మారడం చాలా కష్టం. అలవాటు చొప్పున స్థూల సూక్ష్మ దేహాలుగా పనిచేస్తూ వుంటుంది. స్థూలదేహం విడిపోయాక కూడా కొన్ని వేల సూక్ష్మదేహాలు పనిచేస్తూ వుంటాయి. పాముకిగాని, కోడికిగాని మెడ నరికాక కొంతకాలమ్ దేహభాగాలు కదుల్తూనే వుంటాయి. ఇదేవిధంగా భౌతికమైన చావు జరిగిన తరువాత సూక్ష్మ దేహాలలో జీవుడు బద్దుడై వుంటాడు. ఇంతలో మరొక దేహం ధరిస్తాడు. దానినే పునర్జన్మ అంటారు.

ఆవేశాలు, ఆదర్శాలు, ఆచారాలు తన మనస్సుని ఏ మాత్రం బంధించకుండా చచ్చిపోయిన జీవుడికి ఈ సూక్ష్మ దేహాలు కూడా విడిపోతాయి. అప్పుడు, ఆ మేల్కొన్న జీవతరంగం చోటులో కలసిపోతుంది. ఇక జీవుడుండడు. పునర్జన్మ వుండదు.

తమ స్థూల సూక్ష్మ శరీరాలమీద స్వామిత్వం సిద్ధించిన కొందరు మహనీయిలు కూడా స్థూల శరీరం విడిచాక సూక్ష్మ శరీరాలని చెదిరిపోకుండా నిలిపేస్తారు. అంటే తమకు జన్మరాహిత్యం అక్కరలేదని కోరి మళ్ళీ భౌతిక దేహాలలోకి వస్తారు. ఆ పని జగత్కళ్యాణం కోసం చేస్తారు. కనుక వారికవి పునర్జన్మలైన కారణ జన్మలు, భౌతికజన్మ కన్న ముందే ఒక పవిత్ర కారణం ఏర్పాటు చేసుకోగలిగితే అతనిని కారణజన్ముడు అంటారు. పరమగురువులు మొదలైనవారు అలాంటివారు. చెప్పాలంటే సృష్టిలో జరుగుతున్న కథ ఇదే.