Friday, April 11, 2014

నేను నేనైన నేను

నేను నేనైన నేను

శిష్యుడు:  గురువుగారూ.. మీరు దేవుని చూశారా?
గురువు:  చూశాను, చూస్తున్నాను.
శిష్యుడు:  ఎక్కడ?
గురువు:  ఇక్కడే, నా ఎదురుగానే ఉన్నాడు.
శిష్యుడు:  నేనా?
గురువు:  అవును నేనే.
శిష్యుడు:  నేను నేనా.... అంటే మీరు అవును నేనే అంటున్నారు. నాకు అర్థము కాలేదు కొంచెము వివరించండి గురువుగారూ..

గురువు:  అవును నీలో, నాలో ఉన్న నేనే అసలైన దైవము.  అతడు సర్వాంతర్యామి.  సమస్త భూతములలో, జీవులలో నేనై అంతర్యామిగా వెలుగుతున్నాడు. మనము ఏ కక్ష్యలో నుండి మాట్లాడుతున్నామో ఆ ప్రతిఒక్కటి కూడా నేను గానే వ్యవహరింపబడుతుంది.  శరీరము గురించి చెపుతున్నప్పుడు, నేను అంటాము.  మనస్సు గురించి చెపుతున్నప్పుడు, నేను అంటాము.  ధర్మాధర్మ విచక్షణ చేస్తున్నప్పుడు నేను అంటాము.  ఇలా అనేక సారు నేను, నేను అని చెపుతాము.  కానీ ఇన్ని నేనులుగా ఉన్నవాడికి మూలమైన ఒక నేను ఉన్నది.  అది ప్రతి ఒక్క జీవునిలోనూ  అంతర్యామిత్వము చెంది ఉంటుంది.  అది అన్నిటికి మూలమైన తత్వము.  నీలో, నాలో అందరిలో జీవించి ఉండుటకు మూలమైన తత్వము.  అది అసలైన నేను.  

శిష్యుడు:  కొంచెము వివరించండి గురువుగారు...

గురువు:  ఎవరైనా "నేను" అని ఎలా అనగలుగుతున్నారు?  దేని వల్ల అనగలుగుతున్నారు?  జీవుడు చైతన్య స్వరూపుడు, ప్రజ్ఞా స్వరూపుడు కనుక అనగలుగుతున్నాడు.  చైతన్యానికి మూలము ఏది? అది పరతత్వము.  ఆ తత్వము ప్రకృతికి అతీతమై వెలుగును.  ఆ తత్వము ప్రకృతిచే చేయబడిన విభాగముల (పురములు) యందు దిగివచ్చును కనుక అతనిని పురుషుడు అంటారు.  అతడే పరమ పురుషుడు లేక ప్రధాన పురుష నాయకుడు.  ప్రకృతి, పురుషుడు అను భేధము మాయ వలన పుట్టును. మాయ అతని నుండి క్రీడ కొరకై పుట్టును.  ప్రకృతి నుండియే సృష్టి విభాగములన్నియు పుట్టును.  ఈ విభాగమునకు మూలమైన మొదటి ప్రకృతిని ప్రధానమందురు. అదే మూల ప్రకృతి.  దాని యందు పురుషుడు జీవుడై దిగి వర్తించును.  అతడు విడదీయ వీలుకాని వాడు.  అతని యందు విభాగములు ఉండవు.  తనకు తానే వెలుగు కనుక అతడు వెలిగింప బడడు. అతడు సూక్ష్మ స్వరూపుడు.  వానికి ఇతర వస్తువులుండవు.  కనుక రెండు వస్తువుల నడుమ ఉన్న భేధముచే విడదీయబడడు.  అతడు వస్తువుల మంచి చెడ్డలతో సంబంధము లేని వాడు.  వ్యక్తుల మంచి చెడ్డలతో సంబంధము లేనివాడు.  కలుగుచున్న భావములు, జరుగుచున్న సృష్ట్యాది కర్మలు వానికి పట్టవు.  ఈ ప్రపంచము అంతా వాని మయము.  అట్టివానిని భాగవతమున నారాయణుడు అంటారు.  నారములు అనగా జీవ జలములు.  వాని యందు జీవులకు ఆరోహణ, అవరోహణలను (జనన, మరణములు) కలిగించు తత్వము కనుక దానిని నారాయణుడు అంటారు.  ప్రకృతి, పురుషుడు రెండునూ నారాయణుని యందు వర్తించును కనుక నారాయణుడు ప్రధానమునకు, పురుషునకు నాయకుడు.  వానిని ఆశ్రయించిన మనస్సు కలవాడుగా నుండును కనుక ప్రకృతి పురుషులకు అతీతుడుగా ఉండును.    వాని పేరు "నేను".  అట్టి నేను భగవంతుడు.  అతడే దైవము.  కనుక నీలో, నాలో అందరిలో నేనై వెలుగొందుతున్న వాడే దైవము.  సమస్తమునకు అతడే మూలము. 

అన్నిటి యందు అతడున్నాడు కనుక మనస్సున కందినంతవరుకు వానిని కల్పించుకొని వాని యందు భక్తిని ప్రయోగించి, ఆ పరమ పురుషుని దర్శించి అతనిగా జీవించుటను పరతత్వము సిద్దించుట అంటారు.  అట్లు సిద్దించిన వారు భాగవతోత్తములు.  వారికి మోక్షము నందు ఆసక్తి ఉండదు.  సమస్త సిద్ధులు వారిని ఆశ్రయించి ఉండును.  నిరంతరమైన ఆనందము వారికి సమకూరును.  వారికి మోక్షము నందే ఆసక్తి లేనందున లెక్కలకు, కొలతకకు అందనిదగు స్థితి వారి వశమై ఉండును.  సర్వ శుభలక్షణములు ఆ స్థితియందు ఇమిడి ఉండును కనుక మోక్ష స్థితిని వారు అప్రయత్నముగా పొందుతున్నారు.  వారిని కాల చక్రము మింగదు.  వారు నిత్యులై సాటిలేని సుఖానుభవమున నుందురు.  అట్టి స్థితి మోక్ష స్థితి.  మోక్షమనగా కోరిక వల్ల కలిగేది కాదు, కోరికలు లేక నిరంతరము తనయందు తాను రమిస్తూ నేనైన నేనుగా జీవించు స్థితి.  అట్టి వాడు సమస్తమునందు తనను తాను దర్శించును.  నీయందు నేను, నాయందు నేను ఒకడే కనుక "అవును నేనే" అన్నాను అని గురువు తను చెప్పినది శిష్యునికి అవగతము అగుటకు మౌనమును ప్రసాదించెను.