Wednesday, February 24, 2010

మరణము వున్నదా?


ప్రకృతిలోని జీవరాసులన్నిటిలో ఒక్క మానవుడే మరణ భయం కలిగివున్నాడు. మిగిలిన జీవులన్నీ కూడా ప్రకృతి ఆథీనమై వుండుటచేత ప్రకృతిచే నడపబడుతున్నాయి. కానీ మానవుడు తానున్నాన్న భావము కలిగి, దేహమే తాను అని అనుకొని మరణ భయం కలిగివున్నాడు. సాథారణముగా మనము వెళ్ళే గమ్యము తెలియనప్పుడు అక్కడ ఎలా వుంటుందో తెలియక చాలా భయపడతాము. ఒకవేళ తెలిసివుంటే భయము వుండదు. అలాగే చనిపోయినప్పుడు ఎక్కడికి వెళతామో తెలియక భయపడుతుంటాము. సాథారణముగా మనకు తెలిసిన మరణము దేహములో లేకపోవడము. అలా ఐతే ప్రతిరోజూ మనము రాత్రి నిద్ర సమయములో చనిపోతూనే వున్నాము. నిద్రలో మనము ఎక్కడవున్నామో మనకు తెలియదు. ఎక్కడెక్కడో తిరిగినట్లు కలలు వస్తూవుంటాయి. అంటే మనము దేహములో లేక తిరిగినట్లే కదా! జీవి అయినా నిద్ర సమయములో దేహమునందు వుండక ప్రాణ సూత్ర మాధారముగా దేహమునుండి బయటకు వస్తుంది. మరల దాని ఆథారముగానే దేహమునందు ప్రవేశిస్తుంది. బయటకు వెళ్ళేది ప్రజ్ఞ, దేహము నందు వుండేది ప్రాణము. ప్రాణము ఆధారముగానే ప్రజ్ఞ దేహమునందు ప్రవేశిస్తుంది. ఒకవేళ ప్రాణ సూత్రము తెగినచో మరణము సంభవిస్తుంది. ప్రాణము వుంటేనే ప్రజ్ఞ వుంటుంది. కానీ ప్రజ్ఞ లేకున్నా ప్రాణము వుంటుంది. అలా వున్నవాళ్ళను కోమాలో వున్నారు అంటారు. ప్రజ్ఞకు, దేహానికి అనుసంధానమును కలిగించేది ప్రాణము. కనుకనే ప్రాణము పోయింది, చనిపోయాడు అంటారు.

ఇలా బాగా అలోచిస్తే మరణము మనకు బాగా అలవాటు అయినదిగా తెలుస్తుంది. వదిలిన దేహములోనే మెలకువ వస్తే అది నిద్ర, అలా కాక వేరొక దేహములో మెలకువ వస్తే అది మరణించి మరల జన్మించటం. కనుక రోజూ జరిగే దానికి భయపడ వలసిన పనిలేదు అని తెలుస్తుంది.

భాగవతము, భగవద్గీత మొదలైనవన్నీ కూడా మొదట మరణము లేదు అనే విషయముతోనే మొదలవుతాయి. ప్రస్తుత కాలములో మానవుణ్ణి పట్టి పీడిస్తున్న భయంకరమైన భయం మరణం. అనేక సమస్యలకు భయం కారణమై వున్నది. అది దేహానికే కాని, మనకు లేదు అని అవగాహన చేసుకొనవలసిన అవసరము మానవుని వున్నది. దేహాత్మ భావనకే మరణము, జీవత్మకు లేదు. దేహాత్మ భావనయందు జీవించే వారు చనిపోతూ వుంటారు. జీవాత్మ భావము కలిగినవారు మరణించక దేహమును త్యజిస్తారు. రెంటికి తేడా ఏమిటంటే ఒకరిని బలవంతముగా బయటకు లాగివేస్తారు (చనిపోవటము) ఇంకొకరు తనంతట తానుగా బయటకు స్వేశ్ఛగా వెళ్ళిపోతారు (దేహా త్యాగము). దేహాత్మ భావము కలిగినవారు చావును అశుభముగా తలుస్తారు. అసలు చావును గూర్చి వినటానికి కూడా భయపడతారు. ఎవరైనా చనిపోయారు అని తెలిస్తే కంగారు, భయము కలిగి దుఃఖము వస్తుంది. తనవారు గురించి అయితే ఇక చెప్పనక్కరలేదు. తాను దేహమును ధరించిన జీవాత్మ స్వరూపుడను, నాకు మరణము లేదు, అది దేహమునకు మాత్రమే అన్న భావము కలవానికి మరణము కూడా శుభమే. ఇది పోతే ఇంకొకటి వస్తుంది అన్న ధైర్యము కలిగి వుంటాడు.

అవగాహన లేని యోగసాధన అనుభూతిని అందివ్వదు. మరణము యొక్క అవగాహన లేనిచో ఎంత యోగ సాధన చేసే వారైనా దాని విషయములో భయము కలిగివుంటారు. యోగము యొక్క ప్రయోజనము మరణమును దాటుట, బ్రహ్మామును చేరుట. ముందు అమరత్వము తరువాత బ్రహ్మత్వము. మాస్టరు సి.వి.వి గారు ప్రథానముగా దిగివచ్చినది మరణము లేదు అని మానవ జాతికి తెలియచేయుటకే. దానిని నిరూపించుటకు ఆయన తనకు తానుగా 18 సార్లు దేహత్యాగము చేసి జీవునికి మరణము లేదు అని నిరూపించారు. చివరిగా 1922లో దేహత్యాగము చేసి శాశ్వతులై తన అనుయాయులకు యోగమును అందించుచున్నారు.

నాది అనే వాటిమీద ఆసక్తి లేకపోవటమే మరణమును దాటుట. నేను, నాది లో నేను వుండాలి, నాది చచ్చిపోవాలి. ఇది ఒక నిర్వాణము. నేను కూడా లేక బ్రహ్మమే వుండుట. అది మహా పరనిర్వాణము అంటారు. నేను అనే ప్రత్యేకత్వము కోల్పోతుంది. నాది వదలని వాడు, నేనును ఎలా కోల్పోగలడు. కనుక ముందు నాది అన్నదానిమీద మమకారము, ఆసక్తిని వదలివేయాలి. నాది అన్న భావన వున్నవానికి చావు వుంటుంది. నాది అన్న భావన లేకపోవడమే మోక్షము. భావన వున్నంత కాలము వున్నది మోహమే కాని, మోక్షము కాదు. నాది వదిలినవానికి అమరత్వము, నేను అన్న భావము కూడా వదిలిన వానికి బ్రహ్మత్వము.

నాది అన్నది అంతా కూడా బాహ్యమైనదే. మన దేహము మొదలుకొని మనకున్న బంథువులు, ఆస్తులు మొదలైనవన్నీ కూడా నాది లేక నావి అన్న భావనకు చెందినవే. నేను ఒక్కటే ఆంతర్యము. జీవుని యొక్క పూర్వ కర్మ ననుసరించి అతని చుట్టూ పరిస్థితులు ఏర్పడతాయి. "ఋణాను బంథ రూపేణ పశు, పత్ని సుతాలయ" అన్నారు కదా! అంతా ఋణాను బంథమే. దానిననుసరించి ఏర్పడిన పరిస్థితులపై మరింత మమకారము పెంచుకొని జీవుడు మరింత బంధింప బడి నాది అన్న మమకారము పెంచుకొని చనిపోవుతున్నాడు. ఋణము అంటే మనము చెల్లించవలసినదైనా అయివుండవచ్చు, లేదా మనకి చెల్లించవలసినదైనా అయివుండవచ్చు. అలా ఋణగ్రస్తులు కాకూడదనే ఇచ్చిన మాటకోసము వున్నదంతా ఇచ్చేసిన కథలు మనకు పెద్దలు అందించారు. "తెలివి తేటలతో తప్పించుకొనుట తెలివి కాదు". అది చావు తెలివి. దానివల్ల చావే వస్తుంది. చేసిన కర్మ ఎక్కడికి పోదు. చేసినదే వస్తుంది మనతో. చేసిన థర్మము, కర్మము జీవుని వెంట వస్తాయి. యాచించక, ఆశించక జీవించువాని కర్మము క్షాళనమైపోతుంది. అలా కర్మ క్షాళనమైన వాడు మాత్రమే యోగము నందు ముందుకు ప్రయాణము చేయ గలడు. వానికే ఇంద్రియములు తిరోథానము చెంది సహకరిస్తాయి. మోహము చెందక కర్తవ్యము మాత్రమే నిర్వర్తించవలెను. మోహము కలిగి ఎన్నిసార్లు చనిపోయినా చావు అంటే భయము వుంటుంది. ఎందుకంటే మనవాళ్ళను, మనవి అన్నీ వదిలివేయాలి అనే మమకారము వల్ల. రూపము మీద పట్టు వున్నంత కాలము మనవి, మనవాళ్ళు అనే మమకారము వుంటుంది. దేహ సంబధమైన వాటిపైన మోజు వుండటం, దేహము మీద మోజు వుండటమే. అందువల్ల దేహాన్ని వదలటం చచ్చే చావు అవుతుంది.

మోహము, నాది లేక నావాళ్ళు అనే మమకారము వదలటం అంత తేలిక కాదు. ఒక్క జ్ఞాని మాత్రమే వీటినుండి బయట పడగలడు. కనుక జ్ఞానము ద్వారా మాత్రమే వీటిని అథిగమించగలము. దేహాభిమానిని కాలము దేహము నుండి లాగి వేస్తుంది. కానీ జ్ఞాని తనకు తాను దేహము వదలి వేయుటకు సిద్థమై వుండును. యోగులు తనకు తానుగా దేహము నుండి బయటకు వచ్చే విద్య తెలిసిన వారై వుంటారు.

నేను జీవుడను. కర్మ కారణముగా నేను దేహాన్ని థరించాను. అందుచేత కర్మ నిర్వర్తిస్తాను. కర్మను తెలివితేటలతో ఎగవెయ్యక, తోసెయ్యక వచ్చింది వచ్చినట్లు నిర్వర్తిస్తాను. దాని ఫలితములను ఆశించను. మోసపూరితముగా చెయ్యను. కర్మలనుండి కొత్త కర్మలను పుట్టించుకోను. చేసిన వాటిపై మోహము కలిగివుండను. విధమైన భావన కలిగి జీవనము సాగించువాడు మరణము యందు భయము లేక దేహత్యాగము చేయును. అట్టివాడు తను సాథన చేస్తూ దేహత్యాగము చేశాడో గుర్తువుండి మరల దేహము థరించినపుడు దానినే తిరిగి ప్రారంభించును. చచ్చిపోయినవాడు గత జ్ఞాపకములు లేక నూతన జీవనము ప్రారంభించి మరల మరల జననమరణ చక్రములో తిరుగుచుండును.

మరణము దేహమునకే, జీవునకు కాదు. అందరము జీవులమే. శాశ్వతులమే. "దేహో దేవాలయో ప్రోక్తః జీవో దేవ సనాతనః" దేహము దేవాలయమైతే అందున్న జీవుడు, దేవునివలే సనాతనుడు, శాశ్వతుడు. అమరత్వము పొంది, బ్రహ్మత్వము పొందే వరకూ జీవుని ప్రయాణము సాగిపోతునే వుంటుంది. కనుక మరణము గురించి భయము చెంద వలసిన పనిలేదు. మరణించినా మరల జన్మిస్తామన్న విశ్వాశము కలిగి వుండవలెను. నిజానికి అలా ఎన్నో సార్లు జరిగి ప్రస్తుతములో జీవిస్తున్నాము. సరియైన వసతులకోసము మనము మన వస్తువులతో ఎలా ఇళ్ళు మారుతూ వుంటామో, జీవుడు తను చేసిన కర్మతో తనను తాను పరిపూర్ణుడుగా చేసికొనుటకు జన్మిస్తూ, మరణిస్తూ వుంటాడు. గతం గుర్తులేక మమకారము వల్ల మోహము చెంది దుఃఖమును పొందుతున్నాడన్న జ్ఞానమే మరణ భయాన్ని పోగొడుతుంది.

మరి మరణము వున్నదా? "వున్నది." "ఎవరికి?" దేహాత్మ భావము కలిగి మమకారము చేత మోహము చెందిన వారికి.

మరి మరణము వున్నదా? "లేదు." "ఎవరికి?" జీవాత్మ భావము కలిగి మోహము చెందని వారికి.

నిద్రా సమయాన్ని యోగ సాథనకు ఎలా ఉపయోగించుకోవాలో తరువాత చూద్దాం.....