Thursday, November 10, 2011

11-11-11 దైవాను సంధానమునకు చక్కని రోజు...

సంఖ్యా శాస్త్ర ప్రకారము 11, 22 మరియు 33 చాలా ముఖ్యమైన సంఖ్యలు. దానిని మాస్టరు నెంబర్లు అంటారు. ఇది మనిషి యొక్క బాహ్య ప్రపంచానికి, లోపలి ప్రపంచానికి వారధిగా పనిచేస్తాయి. మనిషి తన అంతరంగములోనికి ప్రయాణము చేయుటకు సంఖ్యల యొక్క తరంగములు బాగా ఉపయోగపడతాయి. మనిషి తనలోని ఊహాశక్తిని, శ్రద్ధను, ఆధ్యాత్మికత మొదలగునవి పెంచుకొనుటకు ఇవి చాలా దోహదమును అందిస్తాయి.

ఈరోజున 11-11-11 మూడు 11లు రావటము ఎంతో ముఖ్యమైన రోజు. శతాబ్దమునకు ఒక్కసారి ఇటువంటి ఆవకాశము వస్తుంది. ఇటువంటి రోజును వృధా చేయకుండా మనస్సును దైవముతో అనుసంధానము చేసుకొన్నచో చక్కని అనుభూతిని పొందుటకు అవకాశము కలదు. మానసిక ప్రశాంతతను పొంది జీవితమున అభివృద్దిని పొందుటకు అవకాశమును ఇచ్చు రోజు. దైవ సంబంధమైన కార్యక్రమములకు ఉపయోగించవలసిన రోజు.

అందరూ ఈరోజుని తప్పక సద్వినియోగము చేసుకొని దైవానుభూతిని పొందవలెనని కోరుకుంటున్నాను.

Wednesday, November 2, 2011

యోగ జీవితమునకు ప్రాథమిక అర్హతలు

యోగజీవనమును సాగింపదలచిన వారు ఈ క్రింది విషయములను పరిశీలించుకొనవలెనని పరమ గురువు మైత్రేయుల వారు తెలియచేసి యున్నారు.


1. దప్పికకు నిలువగలవా?

2. ఆకలిని ఓర్చుకొనగలవా?

3. వేసవిని భరింపగలవా? అట్లే శీతలమును భరింపగలవా?

4. రోజుల తరబడి వర్షించుచు సూర్యరశ్మి కలుగనిచో సహింపగలవా?


పై విషయములయందు నీకు చిరాకు కలుగుట లేదు కదా! కలుగనిచో ప్రాథమిక సంసిద్ధత నీకు ఉన్నదని తెలియును. కాలమును, దేశమును, సన్నివేశములను బట్టి సమతుల్యము నెరుగనివాడు యోగసాధన చేయజాలడు. అట్టివాని యోగజీవన మొక కలయే. తనయందు అవసరములను బట్టి వలసిన సర్దుబాట్లు గావించుకొనుచు జీవింపనివాడు యోగ పరీక్షయందు విఫలుడే. జీవన వాతావరణము ఎప్పుడును అనుకూలముగ ఎవ్వనికిని యుండదు. ప్రతికూలముగా నున్నను కూడ సమతుల్యము కోల్పోని వాడే యోగసాధన కర్హత సంపాదించును.