Thursday, September 22, 2011

కర్మ చేస్తూ కర్మ బంధము లేకుండా జీవించుట

కర్మ - అంటే మనోవాక్కాయములతో చేసే పని. కానీ భౌతికముగా చేసేదే పని అని దాని వల్ల కర్మ బంధాలు ఏర్పడాతాయి అని, ఫలితాలు అంటుతాయి అని కొందరి వాదన. కనుక పని మానేస్తే ఫలితాలు అంటక మోక్షము వస్తుంది అని కొందరి వాదన. కానీ భగవద్గీతలో భగవానుడు జ్ఞానయోగములో కర్మ చేస్తూ కూడా చేయని వానివలే ఎలా ఉండాలి, ఫలితములు అంటకుండా ఎలా ఉండాలి అని చెప్పియున్నాడు. అది ఎట్లా చేయవచ్చో తన జీవితములో ఆచరించి చూపించాడు.

చేసే పని జీవుని బంధించకుండా, మరల కర్మ పుట్టకుండా, ప్రారబ్ద కర్మ పరిష్కారము అయ్యే విథముగా ముక్తసంగుడై జీవించటానికి అవసరమైన విషయాలను జ్ఞానయోగము నందు తెలియపరచటము జరిగింది. సూత్రములను పాటించు వారికి కర్మ బంధము ఉండదు. కర్మలు చేయటము ఉంటుంది, కానీ అవి బంధించవు. ఇవి ఆచరించగలమా లేదా అనే మీమాంస కలవారు ఆచరించలేరు. ఎదో ఒక దానిని ఆచరించటము మొదలు పెట్టినచో అదే మిగతావాటిని ఒక్కొక్కటిగా దగ్గరకు చేర్చును. అవేమిటో ఒకసారి చూద్దాం....

1. కర్మల యందు కామ సంకల్పము లేకుండా చూసుకొనుట. కర్తవ్య కర్మను మాత్రమే చేయుట. యజ్ఞార్థము జీవించుట.

2. అందరియందు ఉన్న "నేను" అను ప్రజ్ఞ తనకు తానే పనిచేసుకుంటున్నాడు అనే జ్ఞానం కలిగి జీవించుట. జ్ఞానాగ్ని కర్మలన్నింటిని కాల్చివేస్తుంది.

3. కర్మఫలములను ఆశించకుండా జీవించుట. ఫలితములు వచ్చినా వలసింత అందుకొని ఇతరములను త్యాగము చేయట.

4. తృప్తిగా జీవించుట.

5. ఎవరిని ఆశ్రయించక నిరాశ్రయుడై జీవించుట. ఇతరములను ఆశ్రయించక దైవమును ఆశ్రయించుట.

6. ఆశలేక జీవించుట.

7. చిత్తమును నియమించి ఉంచుట. స్థిర చిత్తము కలిగి ఉండుట.

8. అపరిగ్రహము - దేనినీ ఊరక పొందే మనస్సు లేక ఉండుట.

9. శరీర శ్రమ చేస్తూ ఉండుట. తను చేయవలసిన పనికి ఇతరులపై ఆథారపడక తన పని తాను చేసుకొనుట. ఎక్కువ సౌఖ్యములకొరకు చూడకుండుట.

10. దొరికిన దానితో సంతృప్తి పొందుట.

11. ద్వందములకు అతీతముగా జీవించుట. ద్వందములు అనగా సుఖదుఃఖములు, శీతోష్ణములు మొ||

12. అసూయ లేకుండుట.

13. పనులు అవటము, అవకపోవటము నందు సమభావము కలిగివుండుట.

14. అయిపోయిన విషయములందు, రాబోవు విషయములందు ఆసక్తి లేక జీవించుట.

15. "నేను" అను ప్రజ్ఞను సమస్తమునందు దర్శించి జీవించుట.

16. సమస్తమును బ్రహ్మమునకు అర్పణము చేసి జీవించుట.

జీవితము నందు ఇటువంటి వాటిని ఆచరించకుండా ఎన్ని పూజలు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా ఉపయోగము ఉండదు. పూజైనా, ప్రార్థనైనా మొదలు పెట్టక ముందే దాని ఫలితము ఊహిస్తాము. చేస్తున్నంత సేపూ ఫలితము గురించి ఆలోచిస్తాము. ఊహించినది దొరకనిచో మళ్ళీ పూజవంక చూడము. ఎవరన్న్ ఫలానా పూజ చెయ్యండి అంటే... ఏమి పూజలు లెండి ఎన్ని చేసినా ఉపయోగమా పాడా...అంటూ దీర్ఘాలు తీస్తాము. అంటే కర్మ చేస్తున్నాము అంటే ఫలితమాసించే. ఇక కర్మ చుట్టుకోక ఏమవుతుంది. కర్మలు చేస్తూ కర్మలంటకుండా జీవించుటకొరకు కావలసిన స్థిరత్వాన్ని మనసుకు అందివ్వమని దైవన్ని ప్రార్థించాలి. పై సూత్రములన్నీ ఆచరించుట సాథ్యము కాదు. ఎదో ఒకదానిని శ్రద్దగా అనుస్యూతము చేస్తూవెళ్ళినచో తప్పక స్థిరత్వము లభిస్తుంది. అదే ఒక్కొక్కటిగా మితగా వాటిని ఆచరణలోనికి తీసుకు వస్తుంది. జీవుడు వేసుకున్న ముడులను ఒక్కొక్కటిగా తొలగిస్తాయి. ప్రపంచములో ఉంటాము కాని ప్రపంచము చేత బంధింప బడము. అన్నీ ఉంటాయి కానీ ఏదీ కూడా బంధించదు. అదే నిజమైన మోక్షము. మోక్షము అంటే వచ్చేది కాదు. ఉన్నది పోతే మిగిలేది. ఏది పోతే బంధము పోతే..

నిజమునకు ప్రపంచములోని విషయము కూడా బంధించదు. జీవుడు దానితో ఏర్పరుచుకున్న సంబంధము వల్ల అది జీవుని బంధిస్తుంది. పై వాటిలో ఒక్కదానిని ఆశ్రయించినా మనకు బయట పడటానికి మార్గము దొరుకుతుంది. మనిషి జీవన్ముక్తుడవుతాడు.