Tuesday, September 13, 2011

ధర్మము - దాని విశిష్టత


ప్రపంచ గ్రంధాలలో తలమానికమైన భగవద్గీత ధర్మము అను పదముతో మొదలు అవుతుంది. "ధర్మక్షేత్రే కురుక్షేత్రే" అను శ్లోకముతో మొదలు అవుతుంది. ప్రపంచానికి భారతీయ సంస్కృతి అందించిన అత్యద్బుతమైన పదము ధర్మము. ధర్మము అను పదమునకు అనువాదము ఇతర భాషలలో లేదు. Law అంటే చట్టము అవుతుంది ధర్మము అవదు. కనుక ధర్మమును చెప్పవలసి వచ్చినపుడు "ధర్మ" లేక "ధర్మ్" అని మాత్రమే వాడాతారు.

మన భారతీయ గ్రంధాలు అన్నిటికి కూడా మూల సూత్రము ధర్మమే. రామాయణములో భగవంతుడు ధర్మాన్ని ఆచరించి చూపించాడు. రాముడు దైవమే అయినప్పటికి పరిపూర్ణ మానవునిగా అవతరించి తాను దైవాన్ని అన్న విషయము మరచి ధర్మాన్ని ఆచరించాడు. అలా ధర్మాన్ని అచరిస్తున్న మానవునికి దేవతలందరూ ఎలా సహకరిస్తారో చూపించాడు. ధర్మము ఆథారంగా దైవాన్ని చేరుకోవటము ఎలా అన్నది రామాయణములో గోచరిస్తుంది. మహాభారతములో భగవంతుడు ధర్మాన్ని పరి రక్షించటానికి దిగివచ్చాడు. శ్రీకృష్ణుడుగా పూర్ణపురుషుడై దిగివచ్చి ధర్మాన్ని స్థాపించాడు.

ధర్మము అనగా ఏమిటి? దానిని ఎందుకు అచరించాలి? దానికెందుకు అంత ప్రాముఖ్యత? ఇలాంటి ప్రశ్నలు తరచూ కలుగుతూ వుంటాయి.

"ధర్మము అనగా ధరింపదగినది". దేనిని మనము ధరిస్తే అది మనల్ని ధరిస్తుందో అది ధర్మము. అదే స్వధర్మము. దేనిని ధరించటము వల్ల జీవునికి శ్రేయస్సో అది స్వధర్మము. అది కానిదల్లా పరధర్మము. ఆట స్థలములోకి ఏది ధరించి దిగామో అది మనల్ని రక్షిస్తుంది. నిద్రనుండి మేల్కాంచి దినచర్య ప్రారంభించటమే ఆట స్థలములోనికి దిగటము. అదే కురుక్షేత్రము (Field of action). ధర్మమును ధరించి అది ఆథారముగా దినచర్య నడుపుకొంటే అప్పుడు మన కురుక్షేత్రము ధర్మక్షేత్రము అవుతుంది. ధరించటము అంటే ధర్మము నెరిగి ప్రవర్తించటము. ధర్మ ప్రవర్తన కలిగివుండటము. ధర్మ జీవనము కలిగివుండటము. తనను ధరించినవానిని తాను ధరించి ధరించినవాడిని కాపాడేది ఒక్క ధర్మమే. కనుకనే "ధర్మో రక్షితి రక్షిత:" అన్నారు. ధర్మాన్ని రక్షించిన వానిని ధర్మము రక్షిస్తుంది. ఉదాహరణకు టోపీ లేక గొడుగు ధరించినవాడిని అది ఎండ, వానలనుండి రక్షిస్తుంది. లేకపోతే ఎండా వానలు బాధిస్తాయి.

అవ్యక్తము నుండి వ్యక్తమైన ప్రకృతి సృష్టికి కావలసిన సమస్త ధర్మములను ధరించి వ్యక్తమైనది. ధర్మముల ఆథారముగానే ప్రకృతి సమస్త సృష్టిని నడిపిస్తోంది. ఎవరైనా వాటికి ఆటంకము కలిగిస్తే వారికి తగిన బుద్ది చెప్పి కాని, వారిని తొలగించి కాని తిరిగి ధర్మ స్థాపన చేస్తూ వుంటుంది. కొన్ని ప్రత్యేక సందర్బములలో సాక్షాత్తూ పరతత్వమే దిగివచ్చి ధర్మాన్ని పరిరక్షించవలసి వస్తుంది. అలా దిగివచ్చిన అవతారములలో శ్రీకృష్ణావతరము పరిపూర్ణమైనది.

సమస్త ప్రకృతి ధర్మమాథారముగానే నడుస్తున్నది. మన వేద వాజ్ఞ్మయము నందు అనేకానేక ధర్మములు చెప్పివుంచారు. ప్రకృతి ధర్మములు, యుగ ధర్మములు, వర్ణాశ్రమ ధర్మములు, జాతి ధర్మములు, సామాన్య ధర్మములు, రాజనీతి ధర్మములు, ధర్మ శాసనములు మొదలగునవి ఎన్నో తెలియచెప్పినారు. కొన్ని సూటిగా చెప్పారు, కొన్ని కధల రూపములో ధర్మ సూక్ష్మములను తెలియచేశారు. ప్రపంచములోని ప్రతి మతము మరియు మత గ్రంథములలో ధర్మమును తెలియచేసినారు. కానీ భారతీయ వాజ్ఞ్మయములో చెప్పబడినంత వివరంగా, సూక్ష్మముగా ఎక్కడా కూడా చెప్పబడలేదు. మహాభారతములో చెప్పని ధర్మము ఎక్కడాలేదు. ఇక్కడ చెప్పలేదంటే ఎక్కడా లేనట్లే అని సాక్షాత్తూ వ్యాస భగవానుడే తెలియచేసినాడు.

ధర్మార్ధకామ మోక్షములనే చతుర్విద ఫల పురుషార్థములలో అర్థ, కామములు రెండూ ధర్మాన్ని అనుసరించి వున్నట్లయితే మోక్షము కరతలామలకము (అర చేతిలోని ఉసిరికాయను ఎంత సులభముగా పట్టుకోగలమో అంత సులభము అని అర్థము) అవుతుంది. ఒక పుల్లను నాలుగు సమానమైన ముక్కలుగా చెయ్యాలంటే మొదటి ముక్కను సరిగా త్రుంచి తరువాతవి మొదటిదాని ప్రకారము త్రుంచినట్లైతే నాల్గవది సులభముగా వస్తుంది. మూడు సార్లు మాత్రమే త్రుంచుతాము. కానీ నాలుగు ముక్కలు వస్తాయి. అలాగే థర్మాన్ని అనుసరించి అర్థకామములు వున్నట్లైతే మోక్షము సులభము అవుతుంది. ధర్మమును అనుసరించని వాని జీవితము దుఃఖ భూయిష్టమై జనన మరణ చక్రములో జీవుడు తిరుగుతునే వుంటాడు.

"యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం" "ఎప్పుడప్పుడైతే ధర్మము అధోగతి పాలై అధర్మము ప్రబలుతుందో అప్పుడు నేను ఉద్భవిస్తాను" అన్నది భగవానుని వాగ్దానము.

అయితే ధర్మమునకు ఎంత శాతము గ్లాని కలిగినప్పుడు దైవము అవతరిస్తాడు? ప్రతి చిన్న విషయానికి దైవము దిగిరాడు. అక్కడ అప్పుడు వున్న వారి ద్వారా వ్యక్తమై ధర్మాన్ని రక్షిస్తాడు. కొన్నిసార్లు తన అనుయాయులను పంపిస్తాడు. ఎవరివల్లా ధర్మ పరిరక్షణ జరగనప్పుడు తనే దివివచ్చి ధర్మ స్థాపన చేస్తాడు. నూటికి నూరు శాతము ధర్మము నాలుగు పాదముల నడుస్తున్న సత్య యుగములో దైవము దిగి రావలసిన అవసరము ఏర్పడలేదు.

75% ధర్మము 25% అధర్మము వున్న త్రేతా యుగములో 75% వున్న ధర్మమునకు హాని కలిగి అంతకంతకు అంతరించి పోతున్నప్పుడు దానిని సంరక్షించి తిరిగి 75% ధర్మమును స్థాపించుటకు దివివస్తాడు. అలాగే ధర్మాధర్మములు 50-50 ఉండవలసిన ద్వాపరయుగములో ధర్మము 50% కంటే తక్కువై ధర్మ గ్లాని జరిగినప్పుడు దైవము అవతరించి ధర్మమును పునఃస్థాపన చేస్తాడు. దీనిని బట్టి కలియుగములో ధర్మము ఎంత వుండవచ్చో మనకు వేరే చెప్పనవసరము లేదు. 25% కనుక ధర్మము వుంటే దైవానికి శ్రమ వుండదు. తనకు తానుగా దిగివావటానికి ముందు అనేక దేవతా శక్తులు తమవంతు ప్రయత్నము తాము చేస్తాయి. వాటి వల్ల కానప్పుడు తానే స్వయముగా ధర్మమును చక్కబెడతాడు. ప్రస్తుతము మనము చూస్తున్న అనేకానేక సంఘటనలు అన్నీ కూడా ధర్మ రక్షణ కొరకు దేవతా శక్తులు చేస్తున్న ప్రయత్నము.

ధర్మము గురించి చెప్పటమంటే దైవము గురించి చెప్పటమే. ఎంతని చెప్పగలము. ఎంత చెప్పినా అది అణువంతే. ధర్మమే దైవము, దైవమే ధర్మము. ధర్మాచరణమే దైవారాధనము. ధర్మాచరణములో సుఖము, సంతోషము దాగివుంటాయి. జీవి తనకు తెలియకుండానే సంతోషముగా వుంటాడు. అటువంటి వానికి రక్షణ వెన్నంటి వుంటుంది. ధర్మము తప్పినవాడు శిక్షింప బడతాడు. తప్పించుకున్నా అది తాత్కాలికమే. ధర్మము శాశ్వతమైనది.

తనకు అప్పగింపబడిన పనిని ఫలాపేక్ష లేకుండా శ్రద్దగా, బాధ్యతాయుతముగా తనతోటి జీవులకు మేలు కలిగే విథముగా చేయుటయే స్వధర్మము. దానిని అచరించుటయే శ్రేయోదాయకము. తనకిచ్చినది నచ్చక పక్కవాని పని నచ్చి అదిచేయదలచినచో అది పరధర్మము అవుతుంది. అది దుఃఖాన్నిస్తుంది. కనుకనే "స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః" అని భగవద్గీతలో భగవానుడు చెప్పియున్నాడు. స్వధర్మాచరణలో మరణము సంభవిస్తే జీవుడు ఊర్ధ్వగతి చెందుతాడు. పరధర్మము భయంకరము. ఆచరణకు అనుచితము.

ఇలా చెప్పుకుంటూ పొతే అంతే వుండదు. నేను విన్నంతలో, నాకు అవగతమయినంతలో కొంత తెలియ చెప్పటానికి ప్రయత్నము చేస్తున్నాను. ధర్మము లేని జీవితము వ్యర్ధము. వాడు ద్విపదైనా చతుష్పదుడే. ఇహపరాలలో ఎక్కడా సుఖశాంతులను పొందడు.

ఎంత చెప్పినా అది కొంతే కాని, అంతా కాదు.కనుక ఇంతటితో ఆపుదాం.. ధర్మాన్ని ఆచరిద్దాం.. ధర్మాన్ని కాపాడుదాం.. ధర్మజీవనాన్ని గడుపుదాం.. ధర్మము చేత రక్షింపబడదాం.. ఓంశాంతి శాంతి శాంతిః