Tuesday, August 4, 2009

పూర్వ జన్మలు గుర్తుకొస్తాయా?


ప్రశ్న: కొంతమందికి పూర్వజన్మలు గుర్తు వచ్చినట్లు వింటూ ఉంటాం. అలాంటి నిదర్శనాలు వార్తా పత్రికల్లో కూడ కనబడుతూ వుంటాయి. ఇక కథల్లో, సినిమాల్లో విశేషమైన ప్రచారం వున్నది. నిజంగా పూర్వ జన్మలు గుర్తుకొస్తాయా? వస్తే ఎలాంటి స్థితిలో గుర్తుకు వస్తాయి?

మాస్టర్ ఇ.కె: ఈ పూర్వజన్మ జ్ఞానం విషయం పాకుడు బండలాగ సూక్ష్మమైన పొరపాట్లతో కూడి ఉన్నది. శాస్త్రీయ వర్గీకరణం చేయడానికి ప్రయత్నించిన వారంతా జారి పడుతూనే వుంటారు. తరగతులుగా విభజించుకుంటేనే గాని వీటి బండారం బయటపడదు.

1. సిద్దులైన పరమగురువులు శతాబ్దాల తరబడి చేయ వలసిన లోక శ్రేయస్సు, ప్రణాళికలకు అలవాటు పడతారు గనుక వారి పూర్వాపర జన్మల జ్ఞానం చత్వారం లేకుండా ఉంటుంది. నిద్రపోయి లేచినవాడు నిన్నటి పని ఎలా పూర్తి చేసుకుంటాడో ఈ గురువులు పూర్వజన్మ ప్రణాళికను అలా పూర్తి చేస్తూ ఉంటారు.

2. సిద్దుల స్థితి కలుగబోయే ముందు సృష్టి పరిణామం కారణంగా మొదటి కొన్ని జన్మలలో చెదురు మదురుగా పూర్వ జన్మల సంబంధాలు, పేరు, ఊళ్ళు స్ఫురించేవాళ్ళు కొందరుంటారు. ముఖ్యంగా భార్యా భర్తల మధ్యగాని, తల్లీ బిడ్డల మధ్యగాని ప్రేమ తీరకుండా అకాల మరణాలు సంభవించినపుడు ఆ తరువాత జన్మలో కొంత పూర్వజన్మ జ్ఞానం పీచులాగా రేగుతుంది.

3. యోగసాధన, భక్తి జ్ఞాన వైరాగ్యాది ఆధ్యాత్మిక సాధనలు సక్రమంగా నడుస్తూ మధ్యలో చనిపోయినప్పుడు కూడా పూర్వజన్మల జ్ఞానం కలుగుతుంది. దానిపైన వారికి స్వామిత్వం వుండదు. కలిగినన్నాళ్ళు కలుగవచ్చు. తరువాత పోనూవచ్చు.

4. కొన్ని మానసిక వ్యాధులు, అక్రమ, అశాస్త్రీయ యోగసాధనలు కారణంగా నిద్రలో సూక్ష్మదేహం అనేక ప్రదేశాలకు పర్యటనం చేసివస్తూ వుంటుంది. అప్పుడు కనిపించిన అజ్ఞాత నగరాలూ, ప్రదేశాలూ, ఇళ్ళూ వాకిళ్ళూ, వ్యక్తులూ, కుటుంబాలూ వాళ్ళతో నిద్రావస్థలో జరిగిన సంభాషణలు, మెలకువ వచ్చేసరికి జ్ఞప్తి ఉండవు. కొంతకాలం తరువాత జ్ఞప్తికి వస్తాయి. అవి తమ పూర్వజన్మలకు సంబందించినవి అని భ్రమపడటం జరుగుతుంది. కనుక పూర్వజన్మ జ్ఞానమేనని వారుకూడ అథికార రీత్యా సర్టిఫికెట్టు ఇవ్వవచ్చు. ఉదాహరణకు ఈ శతాబ్దములోనే జరిగిన శాంతిదేవి పూర్వజన్మ కథ మొదలైనవి.

5. మనస్సులోని పొరలలో ఒక పొరకి దూరదృష్టి దూరశ్రవణం వున్నది. అది ఒక్కొక్కప్పుడు కొందరిలో తాత్కాలికంగా కదులుతుంది. అప్పుడు ఎవో అజ్ఞాత కుటుంబాల పేర్లు, వాళ్ళ పై తరాలవారి పేర్లు, వాళ్ళ ఇళ్ళలోని వ్యవహారాలు మనస్సుకి తగుల్తాయి. అదంతా తమ పూర్వజన్మ వాతావరణమని భ్రమపడవచ్చు. పరిశోధకులు కూడా అంగీకరించవచ్చు.

ఇన్ని వికల్పాలతోనూ కలగలుపుగా ఉత్సాహపూరితములైన పామర మనస్సులు విద్యావంతములైనా కూడా ఈ మొత్తాన్ని పూర్వజన్మ జ్ఞానంగా పరిగణం చేసుకొని సత్యాన్ని గ్రహించినట్లు సంతోషపడతాయి. వీటి వడపోతలు తెలిసిన ప్రజ్ఞ కలవారికి మాత్రమే నిజమైన పూర్వజన్మ జ్ఞానం, దాని ప్రయోజనం తెలుస్తాయి.