Wednesday, October 14, 2009

భగవానుని చతుర్వ్యూహములు


భగవంతుడు నాలుగు విథములైన వ్యూహములతో సృష్టియందు వర్తించును. అవి వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనురుద్ద వ్యూహములు. ఇవియే భగవానుని చతుర్భుజములు. నేనుగా లేక దైవముతో వుండు స్థితి, నేనున్నాను అను స్థితి, బుద్దిలోనికి దిగివచ్చు స్థితి, మనస్సేంద్రియముల ద్వారా పనిచేయు స్థితి. వ్యూహములే నలుగురు కుమారులుగా దిగివచ్చారు. వారే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతుల వారు. బ్రహ్మమానస పుత్రులుగా దిగివచ్చారు. వీరు ప్రాతఃస్మరణీయులు. ప్రతి ఉదయము తప్పక వీరిని స్మరించవలయును.

సనకుడు: ఇతడు సనాతనుడు. జీవుని యందున్న దైవము. దీనిని వాసుదేవ వ్యూహము అంటారు.

సనందనుడు: ఇతడు మనలో నేనున్నాను అనే జీవాత్మ తత్వమై వుంటాడు. ప్రత్యగాత్మగా వుంటాడు. ఇది సంకర్షణ వ్యూహము.

సనత్కుమారుడు: బుద్ది లోకములలో వుండి స్పూర్తిని అందించు వాడు. భూమికి దిగిరాడు. ఇది ప్రద్యుమ్న వ్యూహము.

సనత్సుజాతుడు: మనస్సు, ఇంద్రియములలో వున్న చైతన్యము. కార్యనిర్వహణ కొరకు మనస్సేంద్రియములు అవసరము. ఇది అనిరుద్ద వ్యూహము.

ఈవిథముగా ఒకే పురుషుడు నాలుగు స్థితులలో మనయందు వున్నాడు. "పాదోస్య విశ్వా భూతాని | త్రిపాదస్య అమృతం దివి" అని పురుష సూక్తము నందు చెప్పబడినది. ఒక భాగం కనిపించేదిగా వుండి, మిగిలిన మూడు కనిపించక, కనిపించే దానిని నడిపిస్తున్నాయి. కనిపించే మనిషి, వాడి మనస్సు, ఇంద్రియములు మొ|| లగు వాటికి బుద్ది ఆథారము, బుద్ది జీవాత్మపై ఆథారపడి వున్నది. జీవాత్మకు ఆథారము దేహమునందలి పరమాత్మ. విథముగా మనయందు పరమాత్మ, జీవాత్మ, బుద్ది మరియు మనసేంద్రియములుగా సనక, సనందన, సనత్కుమార సనత్కుజాతుల వారిని దర్శనము చేసికొన వలెను.

వీరిని నాలుగు వేదములుగా కూడా దర్శనము చేయవచ్చును. మనయందు కలిగే సత్సంకల్పములు సనకుడు. ప్రాణ ప్రవృత్తులు సనందనుడు. చక్కని బుద్ది కలిగి ప్రణాళికా బద్దముగా పనిచేయుట సనత్కుమారుడు. దీని కారణముగా భూమిమీద మంచిని అవతరింపచేయుట సనత్సుజాతుడు. ఋగ్వేదము సంకల్పము, సామవేదము ప్రాణము, స్పందనము, ఉచ్చ్వాస నిశ్వాసములు, రక్త ప్రసారము. యజుర్వేదము బుద్ది, మనస్సు మరియు క్రమబద్దమైన ప్రణాళిక, దానిని అనుసరించి పనిచేయుట. ఈవిథముగా పనిచేయుట వలన దాని ఫలము భూమిమీద ఒక చక్కని కార్యక్రమములు నిర్వర్తిస్తున్న మానవునిగా దర్శనము చేయట అధర్వణము.

నాలుగు కాలములుగా కూడా దర్శించ వచ్చును. కృతయుగమును సనకుడిగా, త్రేతాయుగమును సనందనునిగా, ద్వాపరయుగమును సనత్కుమారునిగా, కలియుగమును సనత్సుజాతునిగా తలంచవచ్చును. కనుకనే కలియుగములో మానవునికి మనస్సు, ఇంద్రియములు ఎక్కువగా పనిచేస్తూ వుంటాయి. ద్వాపరయుగములో కొంత బుద్ది, త్రేతాయుగములో కొంత ఆత్మ భావము, కృతయుగములో పూర్తి ఆత్మ భావము కలిగి వుంటారు జీవులు. థర్మమునకు కృతయుగములో 4, త్రేతలో 3, ద్వాపరలో 2, కలిలో 1 పాదములు కలిగి వున్నట్లు చెప్పబడినది. అంటే దిగి వచ్చినకొలది పదార్థము పెరిగి ప్రజ్ఞ తగ్గిపోతుంది.

సంవత్సరమును కూడా నాలుగు పాదములుగా విడదీయవచ్చును. అవియే నాలుగు విషువత్ పుణ్యదినములు. మేషము నుండి కర్కాటకము వరకు ఒకటి, కర్కాటకము నుండి తుల వరకు రెండవ పాదము. తుల నుండి మకరము వరకు మూడవ పాదము మరియు మకరము నుండి మేషము వరకు నాలుగు. అలాగే రోజులో కూడా నాలుగు భాగములు. ఉదయము, మధ్యాహ్నము, సాయంతము మరియు అర్థరాత్రి. మాసములో 4 వారములు. అమావస్య, అష్టమి, పౌర్ణమి, అష్టమి తిథులు కూడా నాలుగు ముఖ్యమైనవి.

వాక్కు కూడా పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని నాలుగు విథములు. పర అనగా భావమునకు పుట్టుక చోటు. ఇది భావము పుట్టక ముందు కూడా వుంటుంది. పశ్యంతి అనగా భాష లేని భావము. మధ్యమ అనగా భాషతో కూడిన భావము. వైఖరి అనగా బయటకు వ్యక్త పరచిన భావము.

ఈవిథముగా దైవము యొక్క వ్యూహమును మనయందు, ప్రకృతియందు దర్శనము చేయవచ్చును.