Wednesday, July 15, 2009

భాగవత పద్యములు

నల్లనివాడు పద్మనయనంబులవాఁడు కృపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛము వాఁడు నవ్వు రా
జిల్లెడు మోము వాఁడొకఁడు చెల్వల మానధనంబు, దెచ్చెనో
మల్లియలార మీ పొదల మాటున లేఁడు గదమ్మ చెప్పరే.

మందారమకరందమాధుర్యమునఁదేలు, మధుపంబుబోవునే మదనములకు
నిర్మలమందాకినీ వీచికలఁదూగు, రాయంచసనునె తరంగిణులకు
లలితరసాల పల్లవ ఖాదియై చొక్కు కోయలసేరునే కుటజములకుఁ
బూర్ణేందు చంద్రికా స్పురితచకోరక మరుగునే సాంద్రనిహారములకు.

నంబుజోదర దివ్యపాదారవింద,
చింతనామౄతపానవిశేష మత్త
చిత్తమేరీతి నితరంబుఁజేరనేర్చు
వినితగుణశీల మాటలు వేయునేల.

కమలాక్షునర్చించు, కరములు కరములు శ్రీనాధునివర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకునిఁజూచుచూడ్కులు చూడ్కులు శేషశాయికిమ్రొక్కు శిరము శిరము
విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిఁదలిచిన మనము మనము
భగవంతువలగోను పదములు పదములు పురుషోత్తమునిమీది బుద్ది బుద్ది.

దేవదేవునిఁ జింతించు దినము దినము
చక్రహస్తుని బ్రకటించు, చదువు చదువు
కుంభినీధవుఁజెప్పెడి గురుడు గురుడు
తండ్రి హరిజేరుమని యెడి తండ్రి తండ్రి.

చక్రిచింతలేని జన్మంబు జన్మమే తరళసలిల బుద్భుదంబుగాక
విష్ణుభక్తిలేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువు గాక.

ఉపవాసంబులు వ్రతములుఁ దపములు వేయేల భర్త దైవతమని ని
ష్కపటతఁ గొల్చిన సాధ్వికి నృపవర దుర్లభము లేదు నిఖిలజగములన్.

నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడినేయ్యము నితాం
తాపార భూత దయయును దాపసమందారనాకు దయసేయఁగదే!