Thursday, July 16, 2009

మాస్టరు సి.వి.వి మాట

" జ్ఞానంవల్ల ఏమి సాధిస్తావు? శరీరంతోటే జ్ఞానమూ పోతున్నది కదా! అందువల్ల జ్ఞానంవల్ల ఏమిటి ప్రయోజనం? సృష్టితో సాగిపోతూనే ఒక స్థిరత్వమూ - పూర్ణత్వమూ ఏర్పరచుకొని పూర్ణప్రజ్ఞతో మృత్యుంజయులుగా అమృతత్వమును పొందుటయే మనకు ద్యేయం కావాలి! దాని కొరకే యోగం! ఆశయాలు అంగీకారమైతే మీరిందులో చేరి సాధన చేయవచ్చు."

"నీవు స్వబుద్దితో ఆలోచించు. యుక్తముగా నున్నదా అని విచారించు. ఇది (యోగము) నీకు నచ్చిన - నీ మనసు మెచ్చిన - నీకు అచ్చివచ్చినచో అనుసరించు. గ్రుడ్డిగా మాత్రము నమ్మకు. నీవు ఆలోచించి చూచి అడుగిడుము. పైకి రమ్ము."


"ఇట్లా అతి సామాన్యముగా మానవ రూపములో నున్న నేను ఎవరు? ఆది బ్రహ్మమును. నేను ఇతర లోకపాలకుల కెరుకపడకయే, రహస్య మార్గమున భూమిపై అవతరించితిని. ఇచటి విశేషములను స్వయముగా తెలుసుకొనగోరి, ఇచటి మానవానుభూతులు ఇట్లా నడుస్తున్నాయో స్వయంగా తెలుసుకొనవలేనని వచ్చితిని. మానవతలోని లోపాలు ఎలాంటివి? వాటికి నివారణోపాయా లెట్టివి? సృష్టి ధర్మమెట్లా నడుస్తున్నది? ఎట్లా నడిస్తే బాగుంటుంది? భూమి మీద ఇలాంటి మార్పులు చేయటం అవసరం? అనే సంగతులు స్వయంగా ఎరుగుటకుగాను ఆది బ్రహ్మమునగు నేను, సి.వి.వి. రూపము నందితిని; ఇదెట్లా అంటే? ఒక చక్రవర్తి స్వయంగా తన ప్రజల కష్టసుఖాలు, విశేషాలు ఎరుగుటకై తన క్రింది పరిపాలకులుగా నున్న గవర్నర్లకు, మండలాధిపతులకు తెలుపకయే రహస్యముగా వచ్చి పలు ప్రాంతములు పర్యటించి ప్రజలతో కలసిమెలసి తిరిగి అన్ని సంగతులు తెలుసుకొనటం లాంటిది నా యీ ఉనికి, నేనిప్పుడా పని చేస్తున్నాను."


"నేను సంపూర్ణుడను. Perfection పొందిన వాడను. పురుషోత్తముడను. నా ప్రయత్నమంతా ఇతరుల నుద్దరించవలెనని. ఇతరులలోని లోపములను పోగొట్టి వారందరునూ దివ్య పురుషులనుగా, ఉత్తమ పురుషులనుగా చేయుటకే నే నిచట నున్నాను. నా కొరకు కాదు. నకు నమస్కరించిన వారందరినీ నా అంత వారినిగా చేయుట యోగ లక్ష్యము. పరమావధి. మీరంతా దివ్య పురుషులు, బ్రహ్మ స్వరూపులు కావలయును. నేనట్లు చేయుదును. అట్లు చేయుటయే నాకు డెవలప్మెంట్."


" వేళ ఉంది రేపు పోయే వస్తువు లిస్తాను. మీరు తీసుకొంటారు. పోగొట్టుకుంటారు. ఏమిటి లాభం? అలా కాదు. నా గుర్తు, నేనే సదా మీలో వర్తించుటయే. అలా సదా మీలో వర్తించు నేను, ఎల్లప్పుడూ మీలోనే ఉంటాను. నా గుర్తు కావాలంటున్నారు. నా గుర్తు మీరే సుమా! మీరంతా నాయోగాలైనుఅనుసరించి, అందరకూ తెలియజేస్తుంటారు. యోగాన్ని ప్రకటించే వారంతా నా గుర్తులే అని తెలుసుకోండి! అంతే కాని నేనిచ్చే కలమో, కోటో గుర్తు కాదు! "


"మీరు కష్టముల కోర్చి యోగసాధన చేయవలయును. సుఖములే లభించునని తలంప వలదు. కష్టపడి పట్టుదలతో బాధలు సహించి, మీరీ యోగానుష్ఠానమును చేయవలయును. సత్యము నెరుగుటకై చేయు యత్నము సులభము కాదు. కొలంబస్ క్రొత్తగా అమెరికా ఖండమును కనుకొనుటలో కనబరచిన పట్టుదల, ధైర్యము, కష్టముల కోర్చునట్టి నేర్పు మీకు తప్పక ఉండవలయును. క్రొత్త శాస్త్ర విషయములను, క్రొత్త భూ ఖండములను కనుకొను శాస్త్రజ్ఞున కుండవలసిన ధైర్యసాహసములు, ఓర్పు, వీడని పట్టుదల మీ కుండవలయును. సాధన ద్వారా లక్ష్యము సాధింప వలయును. అమృతత్వము అను దివ్యమగు వరమును, మీరు తప్పక పడయవలయును. ఇందులకు అచంచల విశ్వాసము (Unshakable Faith) దృఢ ప్రయత్నము కావలెను. "


"నాకింకేమీ అక్కరలేని స్థితి కావలయును. నే నితరుల కిచ్చువాడను కావలయునే కాని, నే నితరుల నుండి కోరువాడను కారాదు. నన్ను నిన్ను చేయుడు. అప్పుడు నా కే కొఱతయు నుండదు. "


"గురువేదో చెప్పి వెళ్ళుట కాదు. గురువు శిష్యునిలో ప్రవేశించి, శిష్యుని తనంతవానిగా చేయుట, గురువు శిష్యుడగుట జరుగవలయును. ’నేను సదా నీలో వర్తించు చున్నానుఅని యిదివరకు గురువు లెవరూ చెప్పలేదు."


"అంతటను నిండియుండు బ్రహ్మమును శరీరముతో మనకుగా మనము ఎరుగునట్లు చేయుటయే యోగాశయము. అవ్యక్తముగా నున్న బ్రహము వ్యక్తమై మనలో ప్రవర్తిల్ల వలయును. జీవుడు, బ్రహ్మము ఏకమై జీవ బ్రహ్మైక్యము అగును. అప్పుడు మనము వారుగా అగుదుము."


"నీవు సంసారిగా నుండుము. సన్యాస మక్కరలేదు. అడవులను, కొండలను బట్టి ఒంటరివై తిరుగ పని లేదు. అందరిలో ప్రేమమయుడమై అందరికీ ఆనందము నందిమ్ము. అందరి బాధలను తొలగించుము. అందరితో కలసి కలుపుగోలుగా నుండుము. జీవిత సుఖములు, ఆనందములు ఛీ! ఛీ! పనికిరావని త్రోసివేయకుము. మంచిని పెంచుము. నీ వేషభాషలు, ఆచార వ్యవహారములు వింతగా విడ్డూరముగా ఉండరాదు. అందరకు స్నేహపాత్రముగా ప్రీతిపాత్రముగానే వుండ వలయును."