Tuesday, September 8, 2009

త్రిశక్తులు - వాటి అవతరణము


దైవము అనగా శుద్ద చైతన్య స్వరూపమైన మహా వెలుగు. అది అనంతమైనది. అవధులు లేనిది. శుద్ద చైతన్యము నుండి జీవుల కోరిక మేరకు సృష్టి సంకల్పంబయలుదేరుతుంది. అసలు మూలతత్వానికి సంకల్పంలేదు. అందున్న జీవుల కోరిక వల్ల ఒక సంకల్పం బయటకు వస్తుంది. పరిపూర్ణత పొందటమే జీవుల కోరిక.అపరిపూర్ణతచేత మరల మరల జన్మిస్తూ వుంటాం. పరిపూర్ణత పొందినవారు, అపరిపూర్ణులకు సహాయమందించుటకు భగవంతుని ప్రతినిధులుగా వారు కూడా దిగివస్తారు. వారేగురుపరంపర. వీరు పరిపూర్ణత కొరకు ప్రయత్నించే వారికి సహాయ సహకారములు అందిస్తారు. వీరు అన్ని లోకములలో పనిచేస్తూ వుంటారు. అలాంటి పరిపూర్ణుల గురించిభగవద్గీతలో విభూది యోగంలో భగవంతునిచే తెలియపరచ బడినది. వారే సనకస నందనాదులు, సప్త ఋషులు, ప్రజాపతులు మొ|| వారు. కాబట్టి అసలు సంకల్పము జీవులది. జీవుల సంకల్పము ప్రకారం వారికి పరిపూర్ణులుగా చేయుటకు భగవంతుడు తనను తాను సృష్టించుకొని ఒక మహా చైతన్య స్వరూపుడై వెలుగై నిలుస్తాడు.

మహా చైతన్యమే అన్నిటికి ఆథారము. దాన్నే అదితి అని, గాయత్రి అని, సావిత్రి అని, సరస్వతి అని అంటారు. దాన్నే త్రిగుణములకు అవతల వున్న అమ్మవారుగా, జగన్మాతగాకొలుస్తాము. శుద్ద చైతన్య స్వరూపులమే మనమంతా కూడా. కాని మనం త్రిగుణముల నుండి దిగి వచ్చిన కారణంగా త్రిగుణములలో బంధింపబడి వుంటాము. అది మొదటిబంధము. దాని వల్ల మనకు నేను అను భావము కలుగుతుంది. త్రిగుణములకు మూలము ఇచ్ఛ, జ్ఞాన క్రియా శక్తులు. ఇచ్ఛా పూర్ణమునకు మనము పొందవలసినజ్ఞానము, జ్ఞానము ఆధారముగా క్రియను నిర్వర్తించటము జరుగుతుంటుంది. వచ్చిన ఇచ్ఛకు సరియైన జ్ఞానము లేనప్పుడు చేసిన క్రియలో వున్న అవకతవకల వల్ల మనముబందింప బడుట జరుగును. మూడును జీవుని కొరకు మొదటి సారిగా అవతరించును. ఇవే రజస్సు, సత్వము మరియు తమస్సు లనబడే త్రిగుణములు.

మూల ప్రకృతి నుండి అవి తామసిక, రాజసిక మరియు సాత్విక అహంకారములై పుట్టును. మూడు గుణములను అథిష్టించి వున్నావాడు ఈశ్వరుడు. అనగా మనయందుమూడు గుణములకు ఆవల మనను అథిష్టించి అన్నిటిని నిర్వర్తించుటకు సంసిద్దుడై వున్నవాడు ఈశ్వరుడు. అన్ని భూతములయందు కూడా ఆవిథంగానే వుండి వున్నాడు.అతడు మనయందు వున్నాడు అన్న భావన మనకు బాగా స్థిరపడవలెను. త్రిగుణములకు ఈవల ఈశ్వరునికి ప్రతిబింబములుగా జీవులమై మనముంటాము. నిజానికిమనమున్నామని అనుకోటమేకాని అసలు లేము. అల వుంది అనుకోటమే కాని నిజానికి అది సముద్రమే కదా! గుణములందుకొని అది అలైంది. దానికి పుట్టుక వుంది, వృద్దివుంది మరల మరణము వుంది. అలాగే మనకు కూడా నేనున్నాను అనే భావము పుడుతుంది, పెరుగుతుంది మరల పడిపోతుంది. భావము వెనుక ఈశ్వరుడు వున్నాడు.కనుకనే భాగవతము నందు "అతడు ఈశ్వరుడై వుండగా రజస్సు, సత్వము, తమస్సు అను గుణములు వానినుండి పుట్టుచున్నవి" అని చెప్పబడినది.

రజస్సు వల్ల కార్యము, సత్వము వల్ల కారణము, తమస్సు వల్ల కతృత్వము ఏర్పడుచున్నవి. సంబంధము వలననే ద్రవ్య రూపములుగా పంచ భూతములు పుట్టుచున్నవి. జ్ఞానరూపములుగా దేవతలు పుట్టుచున్నారు. క్రియా రూపములు గా ఇంద్రియములు పుట్టుచున్నవి. జ్ఞాన రూపులైన దేవతలు మనయందు ఆకాశము, వాయువు, అగ్ని, జలము,పృథ్వి అను ద్రవ్య (పదార్థము) రూపములైన పంచ భూతములకు సహాయమందిస్తూ వుంటారు. కేవలం ఇచ్ఛ, జ్ఞానముల వలన అనుభూతి కలగదు. అది క్రియా రూపముపొందినపుడే కలుగుతుంది. ఇచ్ఛ వున్నంత కాలము క్రియ వుంటుంది. ఇచ్ఛ మనలని మనం పరిపూర్ణులను చేసికొనుటకు భగవంతునిచే ఇవ్వబడినది. దీని కొరకే జన్మించుటజరుగుతుంది. శాశ్వతమైన ఆనందము పొందవలెననే ఒక భావము నుండి కలిగిన ఇచ్ఛ వలన మరల మరల జన్మించటము జరుగుతూ వుంటుంది. ఇచ్ఛని నిర్వర్తించుకొనుటకుజ్ఞానము, జ్ఞానమును నిర్వర్తించుకొనుటకు శరీరము ఇవ్వబడినవి. క్రియా రూపములో ఇంద్రియములు, శరీరము లేకపోతే మనము అనుభూతిని పొందలేము. మనస్సు,శరీరము మరియు ఇంద్రియములు మూడును పదార్థమునకు సంబంధించినవే. వాటిని అనుసరించి కార్యము నిర్వర్తించుటకు జీవుడు వాటిలోనికి దిగివచ్చును. ఈశ్వర తత్వముత్రిగుణముల ద్వారా పత్యేకముగా ఇంద్రియములలోనికి దిగివచ్చినపుడు సంకర్షణుడు అంటారు. అప్పుడే తాను, ఇతరులు అనే వేరు భావము కలుగుతుంది. అతడే జీవుడు.జీవుడు అనగా స్పందనాత్మక చైతన్యము. ఆనందము కొరకు అన్వేషించువాడు. అనేక ఇతర విషయములలో తనకన్నా భిన్నముగా వున్నవాటిలో ఆనందము కొరకు అన్వేషించి,చివరకు తను ఎక్కడనుండి పుట్టుకొచ్చాడో దానితో అనుసంధానము చెందితే తప్ప ఆనందము లభించదు అని తెలుసుకోవటం జరుగుతుంది. దానికొరకే దైవారాథనము, దానితోతాదాత్మ్యము చెందుట. అందుకొరకు దైవముచే ఇవ్వబడినవే ఇచ్ఛా, జ్ఞాన క్రియా శక్తులు. మూడునూ భగవంతుని శక్తులే.

ఇది ప్రతిరోజూ మనకు జరుగును. ఇచ్ఛ కారణముగానే మనము నిద్ర లేవటము జరుగుతుంది. లేకపోతే మనము దైవముతోనే వుంటాము. నిద్ర లేచిన తరువాత బుద్ది లోకములలోదేవతా ప్రజ్ఞలతో అనుసంధానము వలన, ఇచ్ఛను నిర్వర్తిచుటకు కావలసిన జ్ఞానము ఏర్పడుతుంది. అక్కడినుండి పదార్థమయమైన మనస్సు, ఇంద్రియములలోనికి దిగివచ్చినిర్వర్తించుట జరుగుతుంది. అలా మూడు స్థితులలో దైవముతో వున్న ప్రజ్ఞ, పదార్థమయ లోకములలో జీవుడుగా ప్రవర్తించుట జరుగును. ఇక్కడనుండి మరల అదే మూడుస్థితులలో జీవుడు దైవమును చేరగలడు. మనస్సు నుండి బుద్దిలోనికి, అక్కడ నుండి తాను లేక నేను అనే ప్రజ్ఞగా విశ్వాత్మకమైన ప్రజ్ఞతో అనుసంధానము చెందటముజరుగుతుంది. దీనినే త్రివిక్రమత్వము అంటారు. మూడు అడుగులలో జీవుడు దేవుడవగలడు.

మనము నిద్ర నుండి లేవంగానే మనకు గుర్తు వచ్చేది నేను, నేనున్నాను అని. అంతకు ముందు నిద్రలో అది మనకు గుర్తులేదు. అప్పుడు మనం ఎక్కడ వున్నాం? అప్పుడుమనమెవరు? తెలియదు. కారణము, నేను అను భావము లేని స్థితి అది. నేనున్నాను అని తెలియుట మూల భావము. అప్పుడు నేనేమి చేయవలయునని భావించి జ్ఞానమునుపొందటము తరువాత స్థితి. పొందిన జ్ఞానముతో కార్యమును నిర్వర్తించుట చివరి స్థితి. అక్కడి నుండి జీవుని స్వభావము ననుసరించి జీవితము నడపబడుతుంది. అంటే జీవితముఅనే మహా వృక్షము నేను అనే పునాది నుండి బయలు దేరుతుంది. ఇలా నేను అనుకోవటమే అహంకార మనబడుతుంది. అంటే మూలము కంటే వేరుగా వున్నానన్న భావము.అలా కాక అన్నిటికి మూలమైన శుద్ద చైతన్యమే నేనుగా వున్నది అని భావించటం భక్తి అవుతుంది. నేను లేని స్థితి, మేల్కాంచి నేనున్నానను స్థితి, జ్ఞానము పొందు స్థితి తరువాతనిర్వహణ స్థితి అను నాలుగు స్థితులలో సమస్తము ఏర్పరచబడినది. ఇది మనలోనూ, సృష్టిలోనూ ఏర్పరచబడినది.