Saturday, June 13, 2009

మాస్టర్ యమ్.యన్

Master M.N

మాస్టర్ MN (శ్రీ మైనంపాటి నరసింహం) గారు నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట గ్రామము నందు 25-August-1883 న జన్మించారు. ఆయన న్యాయవాద వృత్తిని చేపట్టి న్యాయవాదిగా ధర్మము నందు వున్నారు. 1919 డిసెంబర్ లో యోగ మార్గము లోనికి మాస్టర్ సి.వి.వి గారి ద్వారా ప్రవేశింపబడినారు.

మొదటి సారి MN గారు సి.వి.వి గారి దగ్గరకు వెళ్ళినప్పుడు సి.వి.వి గారు ఇలా ప్రశ్నించారట:

"శాంతి అనగా ఏమిటి? దానికి మాస్టర్ గారు ఇచ్చిన సమాధానం ఆయనకే సరియైనది కాదు అని అనిపించినదట. నాకు శాంతి కావాలి అని అడిగినారట, అప్పుడు సి.వి.వి గారు ఇచ్చాను అన్నారట."

మాస్టర్ సి.వి.వి గారిని కలవటమే ఆయన జీవితమునకు పెద్ద మలుపు. ఆయన ఆదేశముతో ఒంగోలు నందు న్యాయవాదిగా స్థిరపడి యోగము నందు వుండి అందరికి యోగమును అందించారు. 1927 లో "సత్య యోగ స్కూల్" ను ఆయన ఇంటియందే స్థాపించి కోర్సులను మరియు సాముహిక ప్రార్ధనా కార్యక్రమములను నిర్వహించినారు. అనేక వందల కుటుంబములను యోగ మార్గములోనికి ప్రవేశింపచేసి వారికి కర్మ బంధము నుండి విముక్తిని ప్రసాదించినారు.

సాధకులు మరియు ప్రజలు ఆయనను "లిటిల్ మాస్టర్" అనియు, "ఒంగోలు మాస్టర్ గారు" అనియు, "ఒంగోలు స్వామివారు" అనియు పూజించేవారు. ఆయన న్యాయవాదిగా కంటే ఒక సిద్ధునిగా ఒక యోగిగా తెలియబడినారు. ఆయన జీవితమే ఒక యోగ జీవనము. మాస్టర్ గారి యొక్క దివ్య సాన్నిధ్యమును అనుభవించుటకు అనేక మంది ఒంగోలులోని ఇంటియందు ఆశ్రయము పొందియున్నారు. సంవత్సరమంతా ప్రతిరోజు మాస్టర్ గారి ఇల్లు పండగలా, పెండ్లి వారి ఇల్లులా వుండేది. ప్రార్ధనల ద్వారా అనేక మంది రోగుల యొక్క దీర్ఘకాల రోగములను తగ్గించినారు.

మాస్టర్ సి.వి.వి గారి యోగ సాధకులలో మాస్టర్ యం.యన్ గారు ఒక ధృవతారగా నిలిచారు. అనేక వేల మందికి మార్గదర్శకులై మాస్టర్ సి.వి.వి గారి యోగ ప్రణాళికకు సింహభాగము నందు నిలిచినారు. మాస్టరు గారు ప్రార్దనలు నిర్వహించినపుడల్లా అందరూ కూడ ఒక దివ్యానుభూతికి గురయ్యేవారు. వెంటనే ఎవరికి జరుగవలసిన మార్పులు, సవరణలు జరిగిపోయేవి. మాస్టరు గారు ఆయన వాక్కు ద్వారా, ప్రార్ధన ద్వారా, మాస్టరు సి.వి.వి గారి కోర్సుల ద్వారా మరియు ద్యానముల ద్వారా అనేక మందిని యోగ మార్గమునకు ఉత్తేజ పరచినారు.

మాస్టరు గారి ద్వారా యోగము, సాధన అందింపబడిన అప్పటి ఆయన శిష్యులు ప్రస్తుతము నూతన దేహములతో మాస్టరు గారి ప్రణాళికను పశ్చిమ దేశములలో స్తాపించి ఆయన వాహికలై నిలచివున్నారు. మాస్టరు యం.యన్ గారు అంతర్యామి స్వరూపులై మాస్టరు సి.వి.వి గారి యోగమును మరియు సాన్నిద్యమును అందించుచు ప్రాక్-పశ్చిమ ఆద్యాత్మిక సమన్వయమునకు కృషి చేయుచున్నారు.

మాస్టరు యం.యన్ గారు తన శిష్యులకు ప్రేమ మరియు వెలుగును పంచి సూక్ష్మ లోకములనుండి పనిచేయుటకు చాలా సుఖముగా, సులభముగా 11-March-1940 న దేహత్యాగము చేసినారు.