Friday, June 12, 2009

గజేంద్రమోక్షము లోని ఈశ్వర స్తుతి


గజేంద్రమోక్షము లోని ఈశ్వర స్తుతి
(Master EK గారి భాగవత రహస్య ప్రకాశము నుండి)





ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీనమై,
యెవ్వనియందు డిందు, బరమేశ్వరుఁడెవ్వఁడు, మూలకారణం
బెవ్వఁ, డనాది మధ్యలయుఁ డెవ్వఁడు, సర్వము దానయైన వాఁ
డెవ్వఁడు, వాని నాత్మభవు, నీశ్వరు,నే శరణంబు వేఁడెదన్.


సృష్టి యంతయు ఒకే ఒక దేవుని వలన పుట్టుచున్నది. ప్రళయ కాలమున వాని యందే లీనమైయుండి, మరల సృష్టికాలము వరకు వానియందే నిద్రించుచుండును. కనుక అన్ని సృష్టులకును పరమేశ్వరుడైనవాడొక్కడె! అతడే కారణముల కన్నింటికిని మూలకారణమైనవాడు. వానికి మొదలు, ఉండుట, అంతరించుటయనునవి లేవు. అతడు తనంతట తానే యుండును. అట్టి ఒకేఒక్క ఈశ్వరుని నేను శరణు వేడుచున్నాను.

ఒకపరి జగముల వెలి నిడి,

యొకపరి లోపలికిఁ గొనుచునుభయముఁ దానై
సకలార్థ సాక్షియగు
య్యకలంకుని, నాత్మమూలు, నర్థింతు మదిన్
.

తనకు తానే మూలమైన పరమేశ్వరుడు ఒకమారు జగత్తులని సృష్టించి, మరల తనలోనికి లాగుకొను చుండును. సృష్టి యందును, లయము నందును తానేయున్నాడు. అన్నింటిలోని సారాంశమునకు సాక్షిగా తానే నిలబడి యున్నాడు. లోపములు సృష్టిలో నుండవచ్చును గాని వానిలో నుండవు. అట్టి పరమేశ్వరునినా ఆపద తొలగుటకై స్మరించు చున్నాను.

లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ తుది నలోకం బగు పెం
జీకఁటి కవ్వల నెవ్వఁడు -

నేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.

భూలోకము మొదలు పాతాళము వరకుగల అథోలోకములు, సత్యలోకము వరకుగల ఊర్థ్వలోకములు సృష్టిలోని భాగములు. కాలగమనములో ఆయాలోకములలోని జీవులు, లోకములు, లోకముల కధిపతులైన దేవతలు, చివరకు బ్రహ్మాదులు కూడ సృష్టి పరిణామక్రియలో అంతమై పోవుదురు. వెనుకనున్నది పెంజీకటి; అనగా దుర్భేద్యమైన చీకటి. అది మాయామయ మగు మూల ప్రకృతి. మూల ప్రకృతికి కూడ వెనుకగా ఒకే ఒక వెలుగు తనలో తాను వెలుగుచుండును. అట్టి జ్యోతి స్వరూపుడైన దేవుని నేను సేవింతును.

నర్తకునిభంగిఁ బెక్కగు -

మూర్తులతో నెవ్వఁడాడు, మునులున్ దివిజుల్
కీర్తింప నేర, రెవ్వని -

వర్తన మొరు లెఱుఁగ రట్టి వాని నుతింతున్.

నారాయణుడు నర్తకునివలె ఎన్నో రూపములతో క్రీడించు చుండును. (రూపములే వేరుగాని, ఉన్న వాడొక్కడే! అది నేను అను ప్రజ్ఞ). దేవతలుగాని, మునులుగాని వానిని కీర్తింపలేరు. అతని ప్రవర్తన మెప్పుడెట్లుండునో తెలుయుట వారి కెవ్వరికిని సాధ్యముకాదు. అట్టి మహానుభావుని నేను స్తోత్రము చేయుచున్నాను.
విశ్వకరు, విశ్వదూరుని
విశ్వాత్మకు, విశ్వవేద్యు, విశ్వు, నవిశ్వున్
శాశ్వతు, నజు, బ్రహ్మ ప్రభు
నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్
.

జగత్తులని సృష్టించి, తానే జగత్తుల యొక్క రూపముగా నున్నవాడును, విశ్వమునందున్న అఖండమైన ఆత్మ ప్రజ్ఞయు నతడే. ఐనను విశ్వమునకతీతుడుగా అతడున్నాడు. కనుక విశ్వము నంతటిని అతడెరుగును. విశ్వముగా నున్నవాడు, విశ్వముగా లేనివాడు కూడ అతడే! సృష్టిలీనమైనప్పుడుకూడా, లీనమగుటగా అతడున్నాడు. కనుక వేరుగా పుట్టుట లేని శాశ్వతుడతడు. బ్రహ్మకుకూడ అధిపతియైన ఈశ్వరు డతడు. అట్టి పరమ పురుషుని నేనుసేవింతును.

లా వొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యెఁ, బ్రాణంబులున్
ఠావుల్‌తప్పెను, మూర్ఛవచ్చెఁ, తనువున్ డస్సెన్, శ్రమంబయ్యెడిన్
నేవే తప్ప నితః పరం బెఱుగ, మన్నింపందగున్ దీనునిన్,

రావే యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

ఈశ్వరా! నాలో నింక యే మాత్రము శక్తి మిగులలేదు. ధైర్యము తల్లక్రిందులైనది. ప్రాణములు గూడుతప్పి యల్లాడు చున్నవి. శరీరము డస్సిపోయినది. స్థితినితట్టుకొనుటకు చాల శ్రమ కలుగుచున్నది. స్పృహ తప్పిపోవు చున్నట్లున్నది. నీవు తప్ప మరియొక దిక్కు తెలియని వాడను. దీనుడు చేసిన యపరాధములనుమన్నించి నన్ను రక్షింపరావా? కోరినవారికి కోరిన వరము లిచ్చువాడవు. రక్షించుట యను లక్షణమే నీ యాత్మగా నున్నవాడవు. నన్ను రక్షింపుము.

ఓకమలాప్త! యో వరద! యో ప్రతిపక్ష విపక్ష విదూర! కు
య్యో! కవి యోగి వంద్య! సుగుణోత్తమ! యో శరణాగతామరా
నోకహ! యో మునీశ్వర మనోహర! యో విపుల ప్రభావ! రా
వే! కరణింపవే! తలఁపవే! శరణార్థిని నన్నుఁ గావవే
!

నీవు లక్ష్మీదేవికి ప్రియుడవు. వరముల నిచ్చువాడవు. నీదృష్టిలో శత్రువులుగాని, నీ పక్షము కానివారు గాని ఉండరు. మహాకవులు, యోగులు నిన్ను దర్శింతురు.సృష్టిలోని ఉత్తమ గుణములన్నియు నీ వద్దనే యున్నవి. నిన్ను శరణుజొచ్చిన వారికి కల్పవృక్షము వంటివాడవు. నీ యీ లక్షణమే మునీశ్వరులకు మనోహరముగానుండును. నీ ప్రభావము చాల విశాలమైనది. కుయ్యో! అని నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను స్మరించి, కరుణించి వెంటనే వచ్చి రక్షింపవా!