Tuesday, January 29, 2013

ధ్యానము ఎందుకు చేయాలి?



విచక్షణలేక ఇంద్రియలోలుడై జీవించు వానిని సరియైన శిక్షణలేని జంతువుగా మన పెద్దలు చెపుతారు.  సరియైన శిక్షణలేని ఎద్దు ఎలాగైతే వ్యవసాయమునకు ఉపయోగపడదో అలాగే విచక్షణ లేక జీవించువాడు జ్ఞానమును పొందలేడు.  గుఱ్ఱమును లొంగదీసుకొని, మచ్చికచేసుకొని, దానికి సరియైన శిక్షణనిచ్చి దానిపై స్వారీ చేసి గమ్యమునకు చేరవచ్చును.  అలాగే శరీరమునకు శిక్షణనిచ్చి మానవుడు తన గమ్యమైన ఆత్మసాక్షాత్కారమును పొందవచ్చును.  అటువంటి శిక్షణలోని భాగమే పతంజలి మహర్షి చెప్పిన యమ, నియమములు.  ఈ విథముగా శిక్షణకు సంబందించిన అనేక నియమ నిబంధనలు ప్రతి మతము నందు చెప్పబడినవి.  కానీ మతము నందు నీతి, నియమములను చెప్పి రుద్దుటకన్నా వాటి వెనుక ఉన్న శాస్త్ర విజ్ఞానమును అందించినచో అది ఎంతో ఉపయోగము.  ఈ విజ్ఞానమును యువతరమునకు అందించినచో ప్రస్తుత యువకుల మానసిక స్థితి ఇలా ఉండి ఉండేది కాదు.  ఇటువంటి శిక్షణ చిన్నతనము నుండే ఇవ్వవలెను.  "మొక్కై ఒంగనిది మ్రానై వంగునా" అన్న సామెత ఉన్నది కదా!  పెరిగి పెద్ద అయిన తరువాత కావలసినంత శిక్షణకు శరీరము సహకరించదు.  మచ్చికచేసుకొనని శరీరము మనిషికి సహకరించదు.  అది జీవుని తనకు బద్దుని చేసుకొనును.  జీవుడు శరీరమునకు బానిసయై జీవించును.  5సంవత్సరముల వయస్సునుండే శరీరమునకు కావలసిన శిక్షణనివ్వవలెను. 5 సంవత్సరములు వచ్చుసరికి జీవునిలోని పూర్వజన్మ వాసనలు కొంచెము కొంచెముగా మొలకెత్తును.  తగిన శిక్షణను అందించవలసిన వారు తల్లితండ్రులు మరియు గురువులు.  తల్లితండ్రులు మమకారముచే కొంత మరచిననూ, గురువులు ప్రేమానురాగములతో వానియందు మొలకెత్తుతున్న చెడు వాసనలను తొలగించి సరియైన శిక్షణను ఇవ్వవలెను.  అది వారి బాధ్యత.  మనస్సు, శరీరము, ఇంద్రియములు వాటియొక్క సాంకేతిక పరిజ్ఞానము తెలిసిన వాడు వాటిని ఎలా వాడుకోవాలో తెలిసి జీవితమును పండించుకొనును.  దుర్గుణములను తొలగించుకొని, సద్గుణములను పెంచుకొని ఆత్మజ్ఞానము వైపుకు నడచును.

సృష్టిలోని జీవరాసులలో ఒక్క మానవునికే తనను తాను తెలుసుకొనగలిగిన స్థితి ఇవ్వబడినది.  క్షరపురుషుడు, అక్షరపురుషుడు, పురుషోత్తముడు అనెడి మూడు స్థితులలో మానవుని నిర్మాణము జరిగిందని భగవద్గీత చెప్పుచున్నది.  తాను దేహము అన్న భావనతో, అహంకార, మమకారములతో జీవించి ఏ జన్మకు ఆజన్మ దేహము, దేహ సంబందమైన బంధములను తిరిగి తిరిగి పొందువాడు క్షరపురుషుడు.  ప్రతి జన్మలో తాను అనుభవించిన సుఖ, దుఃఖములు మరియు కర్మ ఫలితములను అనుభవిస్తూ, జన్మలు పొందుతూ ఆ అనుభవములను తనయందు కలిగివుండు వాడు అక్షరపురుషుడు.  వీనిని జీవుడు లేక ఆత్మ అంటారు. ఇతడు త్రిగుణాత్మకుడు.  త్రిగుణములు ఇతనిని నడిపిస్తాయి.  ఈ జీవుడు స్పందనాత్మక చైతన్యము కలిగినవాడు.  ఆ చైతన్యము మహాచైతన్యము.  ఆ మహాచైతన్యమును పురుషోత్తముడు అంటారు.  ఇతడు త్రిగుణాతీతుడు.  సర్వాంతర్యామి.  ప్రతి అణువునందు తన శక్తితో కూడి ఉన్నాడు.  జగత్తు అంతా నిండి ఉన్నది శక్తి, చైతన్యములే.  ఏ స్థితికి ఆ స్థితి "నేను" అని చెప్పబడినది.   క్షరపురుషుడు అక్షరపురుషుడై పురుషోత్తముని స్థితికి చేరుకోవాలి.  దీనినే మానవుడు నరుడై నారాయణ స్థితికి చేరుకోవాలి అని భాగవతము చెబుతుంది.  మానవుడు అనగా మనస్సు ప్రధానముగా జీవించువాడు.  మనస్సు శరీరమునకు అథిపతి.  అది ఇంద్రియములద్వారా శరీరమునకు కావలసిన అవసరములను తెలియపరుస్తుంది.  ఇంద్రియలోలుడై జీవించువాడు, బాహ్యప్రపంచముతో సంబంధము పెంచుకొని సుఖ, దుఃఖములను అనుభవిస్తూ జనన, మరణ చక్రములో తిరుగుతూ శాంతిలేక ఉంటాడు. 

మనస్సు దాటి శాంతిని పొందదలచినవాడు, బుద్ది అను వెలుగు సహాయముతో అంతర్లోకములలోనికి (తనలోనికి తాను) ప్రవేశించుటకు ప్రయత్నముచేయును.  బుద్ది అనునది మానవునకు అందివ్వబడిన విచక్షణ అను వెలుగు.  అది ఒక్క మానవునికే ఇవ్వబడినది.  బుద్ది ఆత్మ యొక్క వెలుగు.  మనస్సు యందు జీవించు మనిషి కేవలము తనకొరకు మాత్రమే జీవించును. జీవితము స్వార్థపూరితమై ఉండును.  తన ఆలోచనములు మాతమే సరియైనవి, ఇతరులవి కావు అన్నభావన ఎక్కువగా ఉండిన కరుడు కట్టిన స్థితి.  బుద్దిలోనికి ప్రవేశించినవాడు తనకేమి కావాలి అన్న స్థితి నుండి ఇతరులకు  తాను ఎలా సహాయపడగలడు అన్న స్థితిలోనికి ఎదుగుతాడు.  వారు సంఘహితముకొరకు మంచికార్యములు చేయుచు నిస్వార్థముగా జీవింతురు.  వారి కర్మలు జ్ఞానముతో నిండి ఉంటాయి.  మనస్సు శరీరమునకు కావలసిన అవసరములకొరకు కర్మలు చేయిస్తే, బుద్ది జీవుని వికాసముకొరకు కర్మలను చేయిస్తుంది.  బుద్దిని దాటి ఆత్మ స్థితికి చేరినవారి కర్మలు సమస్త జీవులకొరకు ఆచరింపబడతాయి. అట్టివారు బుద్ది యందున్నను ఆత్మను తెలుసుకొన్నట్లు కాదు.  కానీ ఆత్మను తెలుసుకొనుటకు మార్గము సుగమము అగును.  కనుక ప్రతి మానవుని యందు ఆత్మ, బుద్ది, మనస్సు అనునవి ముగ్గురు అన్నదమ్ములుగా ఉండును.  కానీ ఎవరు ఎవరిని అథిగమించి ఉన్నారు అన్నభావమును అనుసరించి వాని జీవితము నడచును. 

మనస్సుకు, ఆత్మకు మధ్య వారథిగా బుద్ది పనిచేస్తుంది.  ఈ బుద్ది ఆత్మయొక్క వెలుగు, అనగా ఆత్మలోనిదే.  మనస్సును బుద్దికి అనుసంధానము చేయుటకు చేయు ప్రయత్నములే మనిషి జ్ఞానముకొరకు చేయు ప్రయత్నములు.  సద్గ్రంథముల పఠనము, సద్గురువులను ఆశ్రయించుట మొదలగునవి.  ఇది మొదటి మెట్టు.  తరువాతది ఆత్మ స్థితికి చేరుట.  అక్కడ తనకు తానెవరో తెలుస్తుంది.  అదే అంతటా వెలుగుతున్నది అన్నది అనుభవమునకు వస్తుంది.  ఇది మనకు తెలిసిననూ దినచర్యలో మరపునకు వస్తుంది.  కారణము మనస్సు మనల్ని అథిగమించి ఉండుటయే.  మనస్సు అథీనమై మానవుడు జీవించుటయే.  కనుక మనలో సమన్వయ దృష్టి లోపించి విశ్లేషణాత్మకమైన విమర్శనా దృష్టి పెరుగుతుంది.  బుద్దికి అనుసంధానము చెందినవానికి కూడా విశ్లేషణాత్మకత ఉంటుంది, కానీ అది సమన్వయాత్మకమై ఉంటుంది.  మనస్సుయందు ఉన్నవానికి ఈ సమన్వయాత్మకత లోపిస్తుంది.  కనుక ఆత్మ, బుద్ది, మనస్సులను అనుసంధానము చేయుటకు ధ్యానము యొక్క ఆవశ్యకత ఉన్నది.  ధ్యానము ద్వారా సాథకుడు ఈ మూడు స్థితులలో అనుభూతిని పొంది దైవత్వమును చేరును.  సరియైన నియమ నింబంధనలతో కూడిన శిక్షణపూరితమైన జీవనము, ధ్యానము జీవుని దేవుని చేయును.  ధ్యానము ఉదయము, సాయంత్రము ఎదో కొద్దిసేపు చేసేటటువంటి వ్యాయామము కాదు.  అది జీవితము కావాలి.  జీవన విథానము కావాలి.  పరీక్షల్లో మార్కులు రావటానికో, జ్ఞాపక శక్తి పెంచుకోవటానికో, వ్యాపార దృక్పదముతోనో, పదిమందికి తాను రోజూ ధ్యానము చేస్తాను అన్న కీర్తి కాంక్షతోనో ధ్యానము చేసినచో దానివల్ల చేరవలసిన గమ్యము చేరము.  ఇవి ధ్యానమునకు పరమావథి కాకూడదు.  ధ్యానము యొక్క పరమావధి ఆత్మయోగమే.  ఆత్మసాక్షాత్కారమే.  దానికొరకు ధ్యానము.  ఆత్మసాక్షాత్కారము గమ్యముగా తపనతో సాథనచేయువానికి తగిన సద్గురువు లభించి త్వరితగతిన గమ్యము చేరగలడు.