Monday, January 21, 2013

ధ్యానము - కావలసిన ప్రాథమిక సూత్రములు



ధ్యానము - ప్రపంచములో ప్రస్తుతము ఎక్కచూసినా వినబడే ప్రక్రియ.  చాలా మంది చాలా చోట్ల దీనిగురించి మాట్లాడుతూ ఉంటారు.  అసలు ధ్యానము అనగా ఏమిటి?  ఎందుకు చేయాలి? అన్న ప్రశ్నలకు చాలా తక్కువమంది సరియైన సమాథానము చెపుతారు.  "శ్వాసమీద ధ్యాస" అని చెప్పేవాళ్ళు ఎక్కువమంది ఉంటారు.  అది నిజమే!  ధ్యానము చేయాలని కూర్చొని మనస్సును శ్వాసమీద ఉంచినచో ఎందుకు నిలచుటలేదు?  అలా ఎంతమందికి జరుగుతోంది?  అందరికి ఎందుకు జరగటము లేదు?  అసలు శ్వాసమీద ధ్యాస నిలచుటకు వీలు ఉన్నదా?  ఉంటే ఎప్పుడు జరుగుతుంది? 

బయటి ప్రపంచముతో మమేకమైన మనస్సు ఒక్కసారిగా అంతర్ముఖమై శ్వాస క్రియను గమనించటానికి వీలులేదు.  ఎందుకంటే కనపడుతున్నదానిని మాత్రమే గ్రహించగలిగే మనస్సు కనపడని దానిని గమనించలేక విసుగుచెందుతుంది.  అందుకనే ఎక్కువమంది ధ్యానము చేయలేరు, చేసినా ఎక్కువసేపు కూర్చొనలేరు.  కనులు మూసుకున్నా మనస్సు ప్రాపంచిక విషయాలనే చూపిస్తుంది, వాటిగురించే ఆలోచిస్తుంది.  ఎందుకు?  మనసుకు సరియైన శిక్షణ మరియు సంసిద్దత లేకపోవుటయే.  ముందుగా ధ్యానమునకు కావలసిన మనస్సును తయారు చేసుకోవాలి.  అందుకు మొదటగా సాథకుడు సరియైన, సక్రమమైన క్రమబద్దమైన దినచర్యను అలవరచుకోవాలి.  దినచర్యను క్రమబద్దీకరించుకొనని వాడు ధ్యానమునందు ప్రవేశింపలేడు.  ఒకవేళ ప్రయత్నించినా నిరాశే మిగులుతుంది.  కనుకనే చాలా మంది ధ్యానమును కొనసాగించలేక మధ్యలోనే మానివేయటము జరుగుతుంది. 

పతంజలి యోగసూత్రములలో ధ్యానము 7వది.  మొదటి 6 నియమములు సాథనచేయకుండా 7వది చేరుట అసంభవము.  యమ నియమములను పాటిస్తూ ఉంటేనే ఆసనసిద్ధి కలుగుతుంది.  "స్థిర సుఖ మాసనం" అని ఆసనము గురుంచి చెప్పబడినది.  సాథారణముగా ఇది భౌతికమైన ఆసనముగా చెబుతారు.  కానీ ఇది భౌతికము కాదు.  మానసికము.  మానసిక స్థిరత్వము కలిగిన సాథకునికి భౌతికమైన స్థిరత్వముకూడా కలుగుతుంది.  కనుక మొదట ప్రయత్నించవలసినది మానసిక స్థిరత్వము.  చిత్తవృత్తి నిరోధము జరుగనిదే మానసిక స్థిరత్వము రాదు.  కనుక యమము (అహింస, సత్యము,అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము), నియమము(శౌచము, సంతోషము, తపస్సు, స్వధ్యాయనము, ఈశ్వరప్రాణిదానము) లలో చెప్పబడిన వాటిని సాథన ద్వారానే చిత్తవృత్తి నిరోధము జరిగి స్థిరమైన మానసిక స్థితి ఏర్పడుతుంది.  మనస్సు స్థిరముగా లేనిచో అంతర్ముఖము అవుటకు అవకాశము లేదు.  అంతర్ముఖము అయినవాని శరీరము స్థిరమైన ఆసనము నందు ఉండగలదు.  భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు ఆరవ అధ్యాయములో మొదట ధ్యానము చేయవలసిన వానికి ఉండవలసిన లక్షణములను చెప్పి ఆ తరువాత ధ్యానము చేసే పద్దతి చెప్పినాడు.  "స్థిరమాసనమాత్మనః" అన్నదానిలో ఆత్మయందు స్థిరమైన మనస్సు కలవాడు అని చెప్పియున్నాడు.  స్థిరత్వము మానసికమైనచో సుఖమైన భౌతిక ఆసన సిద్ది కలుగుతుంది.

కనుక ధ్యానమునకు కావలసినది చిత్తవృత్తి నిరోధముచే స్థిరత్వము చెందిన మనస్సు.  అటువంటి స్థితిలో సాథకుడు తన మనస్సుకు శ్వాసపైన ఉంచినచో అది చెదరక శ్వాసను గమనిస్తూ శ్వాసలో లయము చెందుతుంది.  అప్పుడు ఉశ్చ్వాస, నిశ్వాసలు సమత్వము చెంది యమింపబడతాయి.  అనగా ప్రాణము యమింపబడుతుంది.  అది ప్రాణాయామము.  ఇది చేసేది కాదు, జరిగేది.  పతంజలి యోగసూత్రములలో ప్రాణాయామము 4వది. 

అప్పుడు ఎటువంటి లోకవ్యవహారములు, స్మృతి స్మరణలు లేని స్థితి కలిగి మనస్సు, ఇంద్రియములయొక్క మూలతత్వము తెలుసుకొనుట అనుభవము అవుతుంది.  అంటే మనస్సు ఇంద్రియములు బయటి నుండి లోపలకి లాగబడినవి.  తాబేలు తన అవయవములను ఎలా లోపలకి ముడుకుకొంటుందో అలాగే సాథకుడు సంకల్పమాత్రము చేత మనస్సు ఇంద్రియములను లోపలకు తీసుకొనగలడు.  మనస్సు ద్వారా చూడటము నుండి మనస్సును చూచుట జరుగుతుంది.  అదే మూలతత్వమును అనుభవము చెందుట.  తనను తాను చూచుటకు దగ్గర అవుతున్నట్లు.  ఇది 5వది అయిన ప్రత్యాహారము.

అలా ప్రత్యాహారము చెందిన స్థితిలో సాథకుడు దేనిమీదనైనా అంతర్ముఖము చెందిన మనస్సు ఉంచగలడు.  అలా నిలుపుటను ధారణ అంటారు.  ఇది 6వ స్థితి.  అటువంటి స్థితిలో ఎంతసేపైనా మనస్సుని నిలుపగలుగుట 7వది అయిన ధ్యానము.  అది నిజమైన ధ్యానము.  ధ్యానము నందు తనను తాను దర్శించి, విశ్వాత్మక చైతన్యము నందు తాదాత్మ్యము చెంది అంతటా తనను తాను దర్శించుట సమాధి.  అదే పరమావధి.

ఇవి అన్నియు ఒకదాని తరువాత ఒకటి చేసేవి కావు.  అన్నీ సమిష్టిగా, నిరంతరము, దీర్ఘకాలము, దృఢచిత్తముచో చేయాలి.  దినచర్యను నియంత్రించుకొనక, యమ నియమాలను పాటించక ధ్యానము చేసేవానికి ధ్యానసిద్ది కలుగదు.  తాను ధ్యానము చేస్తాను రోజూ... అని ప్రపంచానికి గొప్పగా చెప్పుకోటానికి మాత్రము పనికొస్తుంది కానీ తనకు ఏమాత్రము ఉపయోగపడదు. 

మరన్ని వివరాలు మరొక సారి....