Tuesday, August 4, 2009

పూర్వ జన్మలు గుర్తుకొస్తాయా?


ప్రశ్న: కొంతమందికి పూర్వజన్మలు గుర్తు వచ్చినట్లు వింటూ ఉంటాం. అలాంటి నిదర్శనాలు వార్తా పత్రికల్లో కూడ కనబడుతూ వుంటాయి. ఇక కథల్లో, సినిమాల్లో విశేషమైన ప్రచారం వున్నది. నిజంగా పూర్వ జన్మలు గుర్తుకొస్తాయా? వస్తే ఎలాంటి స్థితిలో గుర్తుకు వస్తాయి?

మాస్టర్ ఇ.కె: ఈ పూర్వజన్మ జ్ఞానం విషయం పాకుడు బండలాగ సూక్ష్మమైన పొరపాట్లతో కూడి ఉన్నది. శాస్త్రీయ వర్గీకరణం చేయడానికి ప్రయత్నించిన వారంతా జారి పడుతూనే వుంటారు. తరగతులుగా విభజించుకుంటేనే గాని వీటి బండారం బయటపడదు.

1. సిద్దులైన పరమగురువులు శతాబ్దాల తరబడి చేయ వలసిన లోక శ్రేయస్సు, ప్రణాళికలకు అలవాటు పడతారు గనుక వారి పూర్వాపర జన్మల జ్ఞానం చత్వారం లేకుండా ఉంటుంది. నిద్రపోయి లేచినవాడు నిన్నటి పని ఎలా పూర్తి చేసుకుంటాడో ఈ గురువులు పూర్వజన్మ ప్రణాళికను అలా పూర్తి చేస్తూ ఉంటారు.

2. సిద్దుల స్థితి కలుగబోయే ముందు సృష్టి పరిణామం కారణంగా మొదటి కొన్ని జన్మలలో చెదురు మదురుగా పూర్వ జన్మల సంబంధాలు, పేరు, ఊళ్ళు స్ఫురించేవాళ్ళు కొందరుంటారు. ముఖ్యంగా భార్యా భర్తల మధ్యగాని, తల్లీ బిడ్డల మధ్యగాని ప్రేమ తీరకుండా అకాల మరణాలు సంభవించినపుడు ఆ తరువాత జన్మలో కొంత పూర్వజన్మ జ్ఞానం పీచులాగా రేగుతుంది.

3. యోగసాధన, భక్తి జ్ఞాన వైరాగ్యాది ఆధ్యాత్మిక సాధనలు సక్రమంగా నడుస్తూ మధ్యలో చనిపోయినప్పుడు కూడా పూర్వజన్మల జ్ఞానం కలుగుతుంది. దానిపైన వారికి స్వామిత్వం వుండదు. కలిగినన్నాళ్ళు కలుగవచ్చు. తరువాత పోనూవచ్చు.

4. కొన్ని మానసిక వ్యాధులు, అక్రమ, అశాస్త్రీయ యోగసాధనలు కారణంగా నిద్రలో సూక్ష్మదేహం అనేక ప్రదేశాలకు పర్యటనం చేసివస్తూ వుంటుంది. అప్పుడు కనిపించిన అజ్ఞాత నగరాలూ, ప్రదేశాలూ, ఇళ్ళూ వాకిళ్ళూ, వ్యక్తులూ, కుటుంబాలూ వాళ్ళతో నిద్రావస్థలో జరిగిన సంభాషణలు, మెలకువ వచ్చేసరికి జ్ఞప్తి ఉండవు. కొంతకాలం తరువాత జ్ఞప్తికి వస్తాయి. అవి తమ పూర్వజన్మలకు సంబందించినవి అని భ్రమపడటం జరుగుతుంది. కనుక పూర్వజన్మ జ్ఞానమేనని వారుకూడ అథికార రీత్యా సర్టిఫికెట్టు ఇవ్వవచ్చు. ఉదాహరణకు ఈ శతాబ్దములోనే జరిగిన శాంతిదేవి పూర్వజన్మ కథ మొదలైనవి.

5. మనస్సులోని పొరలలో ఒక పొరకి దూరదృష్టి దూరశ్రవణం వున్నది. అది ఒక్కొక్కప్పుడు కొందరిలో తాత్కాలికంగా కదులుతుంది. అప్పుడు ఎవో అజ్ఞాత కుటుంబాల పేర్లు, వాళ్ళ పై తరాలవారి పేర్లు, వాళ్ళ ఇళ్ళలోని వ్యవహారాలు మనస్సుకి తగుల్తాయి. అదంతా తమ పూర్వజన్మ వాతావరణమని భ్రమపడవచ్చు. పరిశోధకులు కూడా అంగీకరించవచ్చు.

ఇన్ని వికల్పాలతోనూ కలగలుపుగా ఉత్సాహపూరితములైన పామర మనస్సులు విద్యావంతములైనా కూడా ఈ మొత్తాన్ని పూర్వజన్మ జ్ఞానంగా పరిగణం చేసుకొని సత్యాన్ని గ్రహించినట్లు సంతోషపడతాయి. వీటి వడపోతలు తెలిసిన ప్రజ్ఞ కలవారికి మాత్రమే నిజమైన పూర్వజన్మ జ్ఞానం, దాని ప్రయోజనం తెలుస్తాయి.

చనిపోయేముందు తెలుస్తుందా?

ఆధునిక యుగమున మానవతా విలువలను, మానవ ధర్మమును అర్ధమగు రీతిలో ప్రజలకు వివరించి చెప్పవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. సక్రమమగు మార్గము తెలియక అనేకమంది పెడత్రోవలు పట్టుచున్నారు. కనుక సంప్రదాయ పరమైన, శాస్త్రీయమైన సన్మార్గమును నేటి తరమునకు చూప వలసిన గురుతరమైన బాద్యత పెద్దలపై ఉన్నది. మానవజాతెపై గల అపారమైన ప్రేమతో అట్టి సన్మార్గముని నవయుగమునకు కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య (మాష్టర్ ఇ.కె.) చూపించిరి. అడిగినవారికి వివరించి చెప్పి, గ్రంథస్థము కూడ చేసిరి.

మాస్టరు ఇ.కె గారిని ఎంతో మంది సన్మార్గమునుకోరి, ఆసక్తితో అనేక విషయములపై ప్రశ్నలు వేయుచుండెడివారు. వాటిలో కొన్ని ఇక్కడ తెలియపరచుటకు ప్రయత్నిస్తున్నాము.



చనిపోయేముందు తాము చనిపోతున్నామని, ఆ చనిపోబోయే వారికి తెలుస్తుందా? ఒకవేళ తెలుస్తే అప్పటి అనుభూతి ఎలా వుంటుంది? అన్న ప్రశ్నకు మాస్టర్ ఇ.కె గారు ఇచ్చిన సమాధానం:

చాలామందికి చావు అంటే ముఖ్యంగా సొంతచావు అంటే అంతో ఇంతో భయం వుంటుంది. వాళ్ళకి మాత్రం చనిపోయే సమయంలో తెలిస్తే గుండే బేజారై పోతుంది. అలాంటి వాళ్ళకి ఇంకా కొంచెం ముందుతెలిస్తే ఆ భయంతో చచ్చిపోవచ్చు. అలాంటి వాళ్ళకు ఆ సమయంలో ప్రకృతి తెలియకుండా చేస్తుంది. అంటే మృత్యువుకు ముందు తెలివి తప్పుతుంది. భయం ఎంత తీవ్రంగా వుంటే అన్ని గంటలో, రోజులో, నెలలో తెలివి తప్పున స్థితిలో ఉండిపోతారు. ఆ స్థితిలో ప్రకృతి శక్తులు మత్తుఇచ్చి అట్టే పెట్టి ప్రాణానికి దేహానికి మధ్య బిగించి వున్న మేకులన్నీ పీకుతారు. దేహధాతువుల్ని పంచభూతాలలోకి మలచి పార్శిల్ కట్టి వి.పి చేస్తారు. తీరా పనంతా పూర్తి అయిన తరువాత మత్తు వదలి తెలివి వస్తుంది.

ఇక మృత్యుభీతి తొలగిపోయినవారు తప్పకూండా ఆరోగ్యవంతులు, జ్ఞానులు, ప్రసన్నులు, వైరాగ్య సంపన్నులు అనే కోవలో దేనికో ఒక దానికి చెంది వుంటారు. అలాంటి వాళ్ళకి కలగబోతున్న దేహ పరిత్యాగం స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళకి చనిపోవడం వుండదు. దేహం విడవటం మాత్రం వుంటుంది. వెన్నెముక దిగువనుండి పైకి వీణమీటల్లాగ అనిపిస్తుంది. అలా ఎందుకనిపిస్తుందంటే చైతన్యం మూలాధారం నుండి ఊర్థ్వగతి పడుతుంది. ఇంద్రియాలకు ఇంద్రియార్థాలు అందవు - ఏదో ఆలోచిస్తూ వుంటే కంటి ఎదుట నున్న వస్తువులు కనిపించనట్లు. అటుపైన ప్రజ్ఞ శ్వాస కలసి ఒక్కటి అవుతాయి. ఆ ఒక్కటి నిలిచిపోతుంది. ఇంకొక కక్ష్యలో ప్రజ్ఞ మేల్కొంటుంది. ఇలా మహానుభావులకు జరుగుతుంది.

అలాకాక పీకులాటలు, పితలాటలు వున్నవాళ్ళకి కళ్ళు, చెవులు అన్నీ పనిచేస్తూనే వుంటాయి. చుట్టువున్న వాళ్ళు చేసే గోలంతా తెలుస్తూనే వుంటుంది. కానీ ఏ భాగము తన ఆధీనంలో వుండదు. శ్వాస ఆడుతూవున్నా మాట మొదలైనవి సాధ్యపడవు. ఏడవటానికిగాని, మాట్లాడటానికి గాని, తల ఊపటానికి గాని అవసరమైన కీళ్ళ మేకులన్నీ ఊడిపోయి వుంటాయి. ఉదాహరణకు వెనకడిప్ప ఊడదీసిన గడియారంలో ముళ్ళ చక్రాల్లాగ అన్నీ కొంతసేపు తిరుగుతునే వున్నా ఏమీ స్వాధీనంలో వుండదు. బాకీలు వసూలు కాలేదని, భార్యాబిడ్డలు ఆదరించలేని తీవ్రంగా తాపత్రయపడే వాళ్ళకి ఇలాంటి స్థితి కొన్ని రోజు లుండవచ్చు. అంటే ఇలాంటి వాళ్ళు నరక మనుభవిస్తూనే దేహం వదులుతారు. అందుకే అన్నారు మనవాళ్ళు - చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత అని.

ఒక వ్యక్తి చనిపోయిన తరువాత అతనేమౌతాడు అన్న ప్రశ్నకు మాస్టరు గారు ఇచ్చిన సమాధానం:

చనిపోవడంలో పోవడం అనేది ఏమీ వుండదు. మనిషి అంటే చోటుతో(ఆకాశం), మట్టితో, నీళ్ళతో, గాలితో మరియు వెచ్చదనం (అగ్ని)తో చేయబడిన ఒక బొమ్మ. ఆ బొమ్మ మధ్య వున్న చోటు మనిషిగా మేల్కొని పనిచేస్తూ వుంటుంది. శబ్దంచేస్తూ ఇద్దరి మధ్య వున్న చోటు ధ్వని తరంగాలుగా ఎలా మేల్కొంటుందో అలాగే శ్వాసచేసే గుండెకాయలో వున్న చోటు ఆల్టర్‌నేషన్ ఆఫ్ కరంట్స్ (Alternation of Currents) గా మేల్కొని ఎలక్ట్రో మేగ్నెట్ (Electro Magnet) లాగా జీవ తరంగాలను పంపుతుంది. పంపడం మొదలు పెట్టేవరకు ఆకాశంలో వున్న శక్తి స్టార్టర్ (Starter) గా పనిచేస్తుంది. పంపటం మొదలు పెట్టాక గుండెకాయలో ఆకాశాన్ని మేల్కొలిపే శక్తి వేరవుతుంది. అప్పటినుండి దాని ఆధీనంలో శరీరం పనిచేస్తూ వుంటుంది. అలా వేరైన మేలుకొలుపునే జీవుడు అంటాము. ఒకసారి వేరైన తరువాత మళ్ళా అది చోటుగా మారడం చాలా కష్టం. అలవాటు చొప్పున స్థూల సూక్ష్మ దేహాలుగా పనిచేస్తూ వుంటుంది. స్థూలదేహం విడిపోయాక కూడా కొన్ని వేల సూక్ష్మదేహాలు పనిచేస్తూ వుంటాయి. పాముకిగాని, కోడికిగాని మెడ నరికాక కొంతకాలమ్ దేహభాగాలు కదుల్తూనే వుంటాయి. ఇదేవిధంగా భౌతికమైన చావు జరిగిన తరువాత సూక్ష్మ దేహాలలో జీవుడు బద్దుడై వుంటాడు. ఇంతలో మరొక దేహం ధరిస్తాడు. దానినే పునర్జన్మ అంటారు.

ఆవేశాలు, ఆదర్శాలు, ఆచారాలు తన మనస్సుని ఏ మాత్రం బంధించకుండా చచ్చిపోయిన జీవుడికి ఈ సూక్ష్మ దేహాలు కూడా విడిపోతాయి. అప్పుడు, ఆ మేల్కొన్న జీవతరంగం చోటులో కలసిపోతుంది. ఇక జీవుడుండడు. పునర్జన్మ వుండదు.

తమ స్థూల సూక్ష్మ శరీరాలమీద స్వామిత్వం సిద్ధించిన కొందరు మహనీయిలు కూడా స్థూల శరీరం విడిచాక సూక్ష్మ శరీరాలని చెదిరిపోకుండా నిలిపేస్తారు. అంటే తమకు జన్మరాహిత్యం అక్కరలేదని కోరి మళ్ళీ భౌతిక దేహాలలోకి వస్తారు. ఆ పని జగత్కళ్యాణం కోసం చేస్తారు. కనుక వారికవి పునర్జన్మలైన కారణ జన్మలు, భౌతికజన్మ కన్న ముందే ఒక పవిత్ర కారణం ఏర్పాటు చేసుకోగలిగితే అతనిని కారణజన్ముడు అంటారు. పరమగురువులు మొదలైనవారు అలాంటివారు. చెప్పాలంటే సృష్టిలో జరుగుతున్న కథ ఇదే.

Monday, August 3, 2009

మాస్టరు సి.వి.వి


Master C.V.V

మాస్టర్ C.V.V (కంచుపాటి వెంకట్రావ్ వెంకస్వామి రావు) గారు 4,ఆగష్టు 1868లో తమిళనాడు రాష్ట్రము నందలి కుంభకోణములో జన్మించారు.

పరతత్వం, గురుతత్వం

మాస్టరు సి.వి.వి అనే మహా చైతన్యం ఈ భూమికి దిగి రావడం ఒక అద్భుతమైన అంశం, అది ఎక్కడెక్కడో ఊర్ధ్వ లోకాల నుండి దిగివచ్చి, మన గోళం చేరుకొని, మనల్ని చేరుకుంది. కేవలం మనమీద ఉండే అపారమైన ప్రేమ, కరుణ, ఆదరము, వాత్సల్యం కారణాలుగా మనల్ని ఉద్ధరిద్దామని మనల్ని చేరింది. మనని పరిచయం చేసుకుంది. అసలు ప్రతిరోజూ ఎక్కడినుండో సూర్యరశ్మి వచ్చి మనల్ని చేరుతున్నదే, అది మనల్ని చేరే సమయానికి మనం ఎంత సిద్ధంగా వుంటున్నాము? అంతకన్నా దూరమైనటువంటి లోకాలనుండి దిగివచ్చిన "కుంభచైతన్యపు ప్రజ్ఞ" మనమెరిగినటువంటి, మనం అనుకుంటున్నటువంటి మాస్టరు సి.వి.వి ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞని "తెర వెనుక ప్రజ్ఞ" అంటారు. ఆంగ్లంలో The background conciouness అంటారు. అందుకే మనకి మాటి మాటికి గుర్తురాదు. మనకి తెరముందు కథే అంతంత మాత్రం. ఇక్కడ కథకన్న వెనుక తెర వున్నది. ఆ తెరవెనుక "అది" వున్నది. దీనినే పరతత్వం, పరబ్రహ్మము అని కూడా అంటారు.

తెర వెనుక విషయం గుర్తుకు వస్తే, తెర చిన్నదైపొతుంది. కనుక తెర వెనుక వున్న ప్రజ్ఞ మనకి తెలిస్తే, మన మాస్టరు సి.వి.వి అంటే ఎమిటో తెలుస్తుంది.

అవతరణము

చైతన్యం వుండగ, విశ్వాత్మక చైతన్యం వుండగ, ఆ చైతన్యాన్ని నడిపించే చైతన్యంగా మాస్టరు సి.వి.వి ప్రజ్ఞ వున్నది అని చెప్పారు. అంటే అది పరతత్వం లేక పరబ్రహ్మతత్వము. కనుక ఆ తత్వము సరాసరి మరోసారి మనల్ని అనుగ్రహించడానికి అంతరిక్షములో వుండే రకరకములైన మండలములు దాటి వచ్చి, సరాసరి సింహరాశిలో ప్రవేశించి, సింహరాశి నుండి సరాసరి శ్రావణమాసంలో ప్రవేశించి, అక్కడ నుండి, శ్రావణ పౌర్ణమి ఘడియలలో భూమికి దిగివచ్చి, బహుళ పాడ్యమినాడు ఒక శరీరాన్ని బాహ్యంగా బయటకి వ్యక్త పరచింది. ఆ రోజు 4 ఆగష్టు 1868.

"ఎందుకు దిగివచ్చింది?" అని అడిగితే, "మనకోసమే". "మనలో ఏమి మార్పులు చేయడానికి దిగివచ్చింది"? అంటే "మనలో వుండే సూక్ష్మ శరీరాన్ని చక్కగా నిర్మాణం చేసి, అది నశించకుండ వుండేటట్లుగ దాన్ని స్థిరపరచి, అది కారణంగా మనకి మరణం లేనటువంటి స్థితిని ప్రసాదించడం కోసం దిగివచింది". సూక్ష్మశరీర నిర్మాణమును పటిష్ఠము చేసి, అమరత్వము సాధించి పెట్టడం అనే విషయాన్ని మానవ జాతికి అందించడానికి యోగములో నూతన పరిణామము తీసుకొని వచ్చింది.

ఇది ఆయనకు ఈయబడిన కర్తవ్యము. దానిని ఆయన సక్రమంగ, నిశ్శబ్దంగ, గుప్తంగ, గుట్టుగా నిర్వర్తించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు అంటే, మనలోకి, మన పరిసరాలలోకి అదృశ్యులైనారు. అంతకు ముందు దృశ్యంగా వుండే మాస్టరు ప్రజ్ఞ, ఇప్పుడు భూగోళం అంతా అదృశ్యంగ, తన యొక్క సూక్ష్మ శరీరంతో ఆవరించి వున్నది.

ప్రజ్ఞగా తను ఆవరించి వుండి, పిలిచినవారిలో ప్రవేశించి, వారి సూక్ష్మ శరీరాన్ని నిర్మాణము చేసి, పునరుత్థానం చేసి "మరణం లేని స్థితి కల్పిస్తా" నని వాగ్దానం చేసారు. "అందరికీ చావులేని స్థితిని కలిగించడానికి, అందరికీ బ్రహ్మత్వం అనుభూతి చెందింప జేయడనికి నేను దిగివచ్చాను. అది అయ్యేంతవరకు ఈ భూమి ఆవరణలో వుంటాను" అని మాస్టరు గారు చేసిన చక్కని వాగ్దానం మనకి వున్నది. వారికిగా వారే 18 సార్లు మరణించి జీవించినట్లుగా తన అనుయాయులకు ప్రదర్శించి చూపించారు. షిరిడి సాయి కూడా అలాగే మృత్యువు లేదని ప్రదర్శించారు.

మరణం లేదని తెలియాలి అంటే, ఒక నిర్దిష్ట పథకం లేక విధానం ప్రకారం సూక్ష్మ శరీరం పటిష్ఠంగా నిర్మాణం కావాలి.

సూక్ష్మశరీరం

సూక్ష్మశరీరం నుండే భౌతిక శరీరానికి ప్రాణము అందుతూ వుంటుంది. ప్రాణం మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసలుగాను, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన అనే ప్రాణ ప్రవృత్తులు గాను, గుండె, ఊపిరితిత్తులు, శ్వాస అవయవములు కదలటముగాను గోచరిస్తుంది. సూర్యరశ్మినుండి ప్రాణం సూక్ష్మ శరీరంలో ఉండే చక్రముల ద్వారా భౌతిక శరీరంలో ఉండే గ్రంథుల నుండి భౌతిక శరీరానికి అందింపబడుతుంది.

ఈ సూక్ష్మ శరీరానికి రెండు రకాల ఆటు పోట్లుంటాయి. ఒకటి, మనలో ఉండే కోరికలు అసంబద్దముగాను, ధర్మానికి వ్యతిరేకముగాను, ధర్మాన్ని అతిక్రమించి వుంటే, కామ శరీరం అనే తుప్పు, ఈ సూక్ష్మ శరీరం చుట్టూ చేరుతుంది. అందుకే మహాత్ములంతా "కోరికలను సరిచూసుకో" అని చెప్తారు.

మాస్టరు సి.వి.వి గారు "నీ కోరికలను నాకు వదిలేసెయ్యి, నీకు ఏంకావాలో అది నన్ను కోరు. నేను, నీ సమస్త సౌకర్యాలను చూసేవాడినని నమ్మకం వుంటే ఇంక ఎవరినీ ఏమీ కోరక" అని చెప్పారు. కోరడం మొదలు పెడితే సూక్ష్మ శరీరానికి దెబ్బ తగులుతుంది. ప్రతీ కోరికా, ఇనుపముక్కకి తుప్పు పట్టినట్లుగా వుంటుంది. కామ శరీరం పెరిగితే, యోగమయమైన సూక్ష్మ శరీరాన్ని బాగా సన్నగిల్ల చేస్తూ వుంటుంది.

ఇదంతా దేనివలన? కామం వలన. మరి కామం వుండ కూడదా? ఉండవచ్చు. అది ధర్మసమ్మతంగ, ప్రకృతి సిద్ధంగ, సహజంగా వుండాలి. అసహజంగా, అతిగాను, మితిమీరిన కోరికలు కోరడంగాను వుండరాదు.

అందుకనే మాస్టరు సి.వి.వి గారు "నాకు దణ్ణం పెట్టినవాళ్ళు, మనసులో ఎటువంటి కోరికలు పెట్టుకోవద్దు. ఒకవేళ బలీయంగా మీ సంస్కారం లోంచి కోరికలు వస్తే, అవి ప్రార్థనా సమయంలో నాకు సమర్పణ చేయండి. అందులో మీకు శ్రేయస్సు కలిగించేవి నేను మీకు ఏర్పాటు చేస్తాను. శ్రేయస్సు కలిగించనివి, తీవ్రముగా మీ మనస్సుని బాధపెట్టేవి వుంటే వాటి యందు మీకు మరపు వచ్చేట్లుగా మాయం చేస్తాను" అని చెప్పారు.

సూక్ష్మ శరీర నిర్మాణానికి మొదటి మెట్టు "కోరికలు కోరవద్దు".

ప్రార్థన

నీకు నేను త్వరితగతిని సూక్ష్మ శరీర నిర్మాణం చేసిపెడతాను. ఇది జరగటానికి నేనిచ్చిన, బీజాక్షరాల్ని శ్రద్ధతో, భక్తితో ఉచ్చరించి, విని, కన్నులు మూసుకొని లోపల జరిగే ప్రక్రియను గమనిస్తూ వుండు అన్నారు. అది మంత్ర జపంలాగ చేయవద్దు అన్నారు. ఎందుకంటే అది జపానికి సంబంధించిన మంత్రం కాదు కనుక. అలాగే రూపాన్ని కూడ ఎక్కువ ధ్యానం చెయ్యవద్దని అన్నారు.

ఒకసారి రూపాన్ని చూచి, వారి కన్నులను చూచి, లఘువుగా కనులు మూసుకొని, ఆ తర్వాత వారిచ్చిన బీజాక్షరములను ఉచ్చరించడం చేత మనలో ఒక విధమైన విద్యుత్ ప్రసారం మొదలౌతుంది. అది మొదలైనప్పుడు లోపల మార్పులు జరుగుతాయి. అవి ఏమిటో మనకు తెలియదు. తెలిసినా చూస్తుండడమే తప్ప చేసేదేం లేదు. సాక్షిగా చూడడమే.

"నీ లోతట్టున ఏమేమి జరుగునో గమనించుచూ వుండు" అనడంలో "నీకేం తెలియదు, నువ్వేం చెయ్యవద్దు. నేను చేసుకుంటాను, నాకు వదిలెయ్యి." అని వారి ఉద్దేశ్యం. అలాగే ఆలోచనలు ఏమైనా వస్తే... పోనియ్యి, ఫర్వాలేదు. గమనిస్తూ వుంటే అవే తగ్గిపోతయి. అందుకని 15, 20, 30, 40నిల పాటు నీకు ఎంతసేపు లోపల ప్రసారం జరుగుతూ వుంటే అంతసేపు గమనిస్తూ వున్నట్లయితే, దాన్ని మన మాస్టరు గారికి సమర్పణ చేసి వదిలేసి నట్లయితే "కన్నులు తెరుద్దాం" అనే భావన వచేవరకు, ఆ విధంగా ఆ ప్రసారం జరుగుతుంది. కాబట్టి నిర్వర్తింప చేసుకోవాలి.

ఉదయం, సాయంత్రం 6గంల సమయానికి శరీరం, మనసు శుచిగా వుంచుకొని, మాస్టరుగారి చిత్రపటాన్ని ఉత్తర ముఖముగానో, తూర్పు ముఖముగానో వుంచి, అగరువత్తులు, దీపం వెలిగించి, సుఖము, స్థిరము అయిన ఆసనం ఏర్పరుచుకొని కూర్చోవాలి. హృదయంలోనో, భ్రూమద్యంలోనో మాస్టరుగారిని మానసికంగా దర్శించి, నమస్కారం చేస్తూ
"మాస్టర్ సి.వి.వి నమస్కారం" (Master C.V.V. Namaskaram) అని ఉచ్చరించాలి. అలా ఉచ్చరించినపుడు మాస్టరుగారు (పద్మాసనాసీనులై యున్నవారు) తన దక్షిణ (కుడి) హస్తంతో మనలను ఆశీర్వదిస్తున్నట్లు, యోగమారంభించ మంటున్నట్లు, తాను పని ప్రారంభిస్తున్నట్లు, మనము సాక్షీభూతముగా మన దేహ కోశములందు జరుగు మార్పు లను చూస్తున్నట్లు భావించాలి. మార్పులు జరుగుతున్నత సేపు కనులు తెరుచుకోవు. ఆ రోజుకు వర్కింగ్స్ (workings) పూర్తి అయిన తరువాత కనులు తెరుచుకుంటయి. ఏ రొజున ఎంతవరకు జరిగితే శ్రేయస్సో, అంతవరకే మాస్టరుగారు మార్పులు (వర్కింగ్స్) జరుపుతారు.

ప్రార్థనలో ముఖ్యాంశమేమిటంటే, మనము చేయవలసిన అభ్యర్థన. అది ఏమిటంటే:

"మాస్టరు గారు! పద్మకోశం వంటి ఈ నా శరీరంలోని సమస్త కోశములను పరిశుద్ధి గావించండి. భావములను, కోరికలను ధర్మయుక్తం చేయండి. ప్రాణమును పెంపోందించండి. కామమును తగ్గించండి. సూక్ష్మ శరీరమును తీర్చిదిద్దండి. అమరత్వం ప్రసాదించండి. మీ దివ్య ప్రణాళికలో నాకు కర్తవ్యాన్ని, బాధ్యతను ఏర్పరచండి. పరహితమునకు నన్నంకితం చేయండి. నేను మీకు సదా వాహికనై వుండునట్లు అనుగ్రహించండి."

పై అభ్యద్థన గావించి కనులు మూసుకొని కూర్చోవాలి. క్రమశః సాధకుని శ్రద్ధాభక్తుల బట్టి సాధన సిద్దిస్తుంది. మాస్టర్ E.K గారికి 12 సంలలో సిద్ధించినది. మాస్టర్ M.N గారికి కూడా అలాగే సిద్ధించినది. వారిరువురు యిపుడు దివ్య ప్రణాళికలో సింహభాగం వహించి యున్నారు. ఈ విధంగా మాస్టరుగారి ప్రార్థనతో దివ్య వాహికలు తయారు కాగలవు. అది మాస్టరు C.V.V గారి వాగ్దానం.

మాస్టర్ సి.వి.వి గారు ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేశారు. ఆయన శిష్యులకు త్రిసూత్ర ప్రణాళిక నిచ్చారు.
1. ఉదయము, సాయంత్రము ప్రేయరు చేయటం.
2. జీవితాన్ని సేవకు అంకితం చేయటం.
3. స్వలాభాపేక్షతో ఏ పని చేయకుండటం.

సాధకుడు తప్పనిసరిగా పైన ఇచ్చిన త్రిసూత్ర ప్రణాళికను 12 సంవత్సరాల కాలం పాటు క్రమశిక్షణతో అనుసరించవలసి ఉంటుంది.

మాస్టరు సి.వి.వి అనే బీజాక్షరాలలోని శబ్దతరంగములు మన మనస్సులలో, మనలో సంస్కారవశమున ఏర్పడిన భావముల నంతా మింగివేస్తాయి. మనం అనేక జన్మల నుండి వచ్చిన కర్మలు అనే ఇంధనం లోపల బాగా పేర్చుకొని వుంచుకున్నాం. దాన్ని ఆయన కాల్చేస్తారట. అది కాల్చడానికి ఈ మంత్రం. తొందరగా కాల్చేయడానికి ఈ పద్దతి పట్టుకొచ్చారు. "It is a dynamic change to the Science of Yoga" అని మాస్టరు E.K గారే వ్రాశారు. అన్నీ పరిణామం చెందుతున్నాయి. కాబట్టి యోగవిద్య కూడా పరిణామం చెందింది. ఈ యోగం గురించి వివరిస్తూ C.V.V. గారు ఇలా అన్నారు. It is neither post - ponement nor purging of Karma, but is neutralisation of it. అంటే "నేను ప్రారబ్ద కర్మను వాయిదా వేయను, ప్రచోదనము చేయను. కేవలం మీకోసం మింగేస్తాను" అన్నారు.

ఎవరైననూ మాస్టరు గారి ప్రార్థన చేసుకొన వచ్చును. దీనికి జాతి, మత, కుల, వర్ణ వివక్షత ఎంత మాత్రము లేదు. ఆయన సమస్త మానవ జాతిని ఉద్దరించి నడిపించుటకు వచ్చిన పరబహ్మము. ఇందు సందేహము అవసరము లేదు. నమ్మకము ముఖ్యము. ఆయను నమ్మి సమస్తము ఆయనకు సమర్పించి ఉండండి, అప్పుడు, ఆయనే మనకు సమస్త విషయములు మన లోపలి నుండే తెలియ చేయును, జీవితమును ఆనందమయము చేయును.

ఈ రోజు మన మాస్టరు గారి పుట్టిన రోజు. కనుక అందరకు మాస్టరు గారి దివ్య అనుగ్రహము, ఆశిస్సులు లభించవలెనని ఆకాంక్షిస్తూ ఆయనను ప్రార్థిస్తున్నాము.